Suryaa.co.in

Andhra Pradesh

ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతా

-విజయవాడ పశ్చిమను ఆదర్శంగా నిలుపుతా
-ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. శుక్రవారం ఉదయం బుద్దా వెంకన్న, నాగుల్ మీరాతో కలిసి కాళేశ్వరరావు మార్కెట్, హోల్ సేల్ పూల మార్కెట్ వాణిజ్య సముదాయాలలో పర్యటించారు. స్థానిక వ్యాపారస్తులు, ముఠా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తాను గెలిచిన తరువాత పూల మార్కెట్ ను ఆధునీకరించి అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో వ్యాపారస్తుల అభివృద్ధిని ముఠాకూలీల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. మంత్రిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారని సుజనా విమర్శించారు. కూటమితోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తనకు సొంత జిల్లాపై అవగాహన ఉందని ప్రచారంలో అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని వాటన్నింటినీ పరిష్కరించి విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పటికే నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. సంపద సృష్టించే విధంగా కూరగాయలు, పూల మార్కెట్లను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలే నిదర్శనమని అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా సుజనా పర్యటించారు. కొండలు, గట్లు ఎక్కి ఇంటింటికీ వెళ్ళి ప్రజలను కలిశారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల దుస్థితిని సుజనాకు ప్రజలు వివరించారు. 22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చెప్పారు.

అలాగే వ్యాపారులు, ముఠా కార్మికుల ఇబ్బందులను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రచార ఆర్భాటమే తప్ప…పని చేయాలనే తపన వైసీపీ నేతలకు లేదని దుయ్యబ్టటారు. ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హోల్ సేల్ పూల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండు అశోక్, ఉపాధ్యక్షుడు సయ్యద్ రఫీ, టీడీపీ క్లస్టర్ ఇన్ చార్జ్ పల్లంటి గంగ, రౌతు తారక శ్రీనివాస్, మాత శివ, పైడి రాము, కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజ రయ్యారు.

ఆ తర్వాత తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం వద్దనున్న వీరబాబు స్వామివారి ఆలయాన్ని సుజనా చౌదరి సందర్శించారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సుజనాకు ఆలయ అధ్యక్షుడు కె.జనార్దన్ రావు, కోశాధికారి బసవరాజు స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE