– బాబా ఫసీయుద్దీన్ ను వెంటనే అరెస్ట్ చేయాలి
– సీతక్క, ఎంపి మల్లు రవి, రేవంత్ తో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు
– ఫసీయుద్దీన్ బయట ఉంటే బోరబండలో ఎన్నికలు సజావుగా సాగవు
– బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ బిఆర్ఎస్ ఎమ్మెల్సి శంభీపూర్ రాజు మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన సర్దార్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు బోరబండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ను కలిశారు.
ఈ సందర్భంగా డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే.. బాబా ఫసీయుద్దీన్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన వేధింపుల వల్ల సర్దార్ అనే వ్యక్తి బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుండి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయి 5 నెలలు దాటినా ఇప్పటికీ పోలీసు విచారణ పూర్తి కాలేదు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయలేదు.
బాబా ఫసీయుద్దీన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క, ఎంపి మల్లు రవి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్ మీటింగ్ లకు రాకపోతే, సర్దార్ కు పట్టిన గతే మీకు కూడా పడుతుందని అందరినీ బెదిరిస్తున్నారు.
నా మీద ఎన్ని కేసులు పెట్టినా నన్ను ఏం చేయలేరంటూ మాట్లాడుతున్నారు. ఫోన్ లో బెదిరించినా రికార్డింగ్ ఉన్నా, 5 నెలలుగా పోలీసులు ఏమీ చేయడం లేదు. 83 క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రౌడీలు ఇలాగే రెచ్చి పోతారు. పైగా నిందితునికి ప్రభుత్వం గన్ మెన్లను ఇచ్చింది.
బాబా ఫసీయుద్దిన్ ఆగడాలు దారుణంగా ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. గంజాయి బకెట్లు ఇంట్లో పెట్టి అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. రైతులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే, కేసు పెట్టి నల్ల బాలు,దిలీప్,కొణతం,గౌతమ్ లను అరెస్ట్ చేసిన పోలీసులకు బాబా ఫసీయుద్ధిన్ మాత్రం దొరకడం లేదు.
కనీసం అతన్ని అరెస్ట్ చేయడం లేదు, బైండోవర్ చేయడం లేదు,కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించడం లేదు. బాబా ఫసీయుద్దీన్ బయట ఉంటే బోరబండలో ఎన్నికలు సజావుగా సాగవు. అందుకే అతన్ని అరెస్ట్ చేసి,రౌడీ షీట్ ఓపెన్ చేయాలి,పిడి యాక్ట్ పెట్టి బైండోవర్ చేసి జైలుకు పంపించాలి. బాబా ఫసీయుద్దిన్ కు గన్ మెన్ల ను ఇవ్వడం పై ఎన్నికల కమీషన్, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ను కూడా కలుస్తాం.