Suryaa.co.in

Andhra Pradesh

బజార్లలో తాగి బలాదూర్ చేస్తామంటే… ఉండి నియోజకవర్గంలో కుదరదు

– పంచాయతీరాజ్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించండి… పబ్లిక్ ప్లేస్ లలో చెత్త వేసి డిస్టర్బ్ చేయవద్దు
– చెత్తను విభజించి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలి…
– కాలువలలో, డ్రైనేజీలలో తాగి పడేసిన సీసాలను విసిరి వేయవద్దు
– శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

బజార్లలో తాగి బలాదూర్ చేస్తామంటే ఉండి నియోజకవర్గంలో కుదరదని తాగుబోతులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. పబ్లిక్ ప్లేస్ లలో చెత్త వేసి, ప్రజలను డిస్టర్బ్ చేయవద్దన్నారు .

అలాగే పంచాయతీరాజ్ శాఖకు సహకరించాలని ప్రజలకు సూచించారు. చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. మద్యం బాబులు కాలువలలో, డ్రైనేజీలలో తాగి పడేసిన మద్యం బాటిళ్లను విసిరి వేయవద్దన్నారు.

శుక్రవారం సాయంత్రం రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఉండి నియోజకవర్గ ప్రజలకు ఒక చిన్న విన్నపం. ఎప్పటినుంచో ప్రభుత్వ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు తడి, పొడి చెత్త తో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయాలని చెబుతున్నారు. మీరిచ్చే వ్యర్ధాలతో, ప్లాస్టిక్ వ్యర్ధాలను కలపవద్దని, ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఇవ్వాలని సూచిస్తున్నారన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను కూడా చెత్తతో కలిపి ఇవ్వడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.

చాలా గ్రామాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను కలిపేసి కొన్ని గృహాలలో ఇస్తున్నారన్నారు. కొన్ని గ్రామాలలో 50%, మరికొన్ని గ్రామాలలో 20% మంది మాత్రమే చెత్తను వేరు చేసి ఇస్తున్నారని తెలిపారు. ఇదే విషయమై ఈరోజు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎవరైనా చెత్తను విభజించకుండా, అలాగే అందజేస్తే దాన్ని వారి ఇంటి వద్దనే పారిశుద్ధ్య కార్మికులు వదిలి వెళ్తారని తెలిపారు.

ఇంకా మారకపోతే ఎవరైనా ఆ చెత్తను తీసుకువెళ్లలేదని చెప్పి రోడ్డు మీద వేస్తే, ఆ చెత్తను మీ ఇంటి ముందే కుమ్మరించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెత్త నుంచి సంపదను సృష్టించాలని, ఇప్పటివరకు నిలిపివేసిన కేంద్రాలను తిరిగి ప్రారంభించి సక్రమంగా వాడుకోవాలని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంకా 50% మంది చెత్త విభజన చేయడం లేదన్నారు. చెత్త ద్వారా పరిసరాలను మరింత చెత్తగా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

చెత్త నుంచి సంపద అనే నినాదాన్ని ఆలా ఉంచితే, చెత్త నుంచి దరిద్రం అన్న కాన్సెప్ట్ ను గృహ యజమానులు ఫాలో అవుతున్నట్లుగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. మీ ఇల్లు, మీ ఊరు శుభ్రంగా ఉండాలంటే పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా సహకరించాలని కోరారు. ప్రతి కేంద్రంలోనూ తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, అందులో నుంచి సంపద ఎలా సృష్టించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నాన్నారు.

చాలామంది పంచాయతీరాజ్ సిబ్బందే కాలువ గట్లు, డ్రైనేజీ కాలువల వెంట చెత్తను వదిలి వేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ధ్వజమెత్తారు. అటువంటి గ్రామ కార్యదర్శిలపై కూడా, సర్పంచులపై కూడా చర్యలు తీసుకుంటామని ఈరోజు జరిగిన సమావేశంలో ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలిపారు. ఈరోజు నుంచి ఉండి నియోజకవర్గ పరిధిలోని 74 గ్రామాల ప్రజలందరూ చెత్తను విభజించి పంచాయతీ సిబ్బందికి అందజేయాలని కోరారు. సంపద సృష్టికి సహకరించాలన్న ఆయన, సంపద అంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తుందని కాదని తెలిపారు.

ముందు చెత్తను సక్రమంగా వదిలించుకోవడమే ఒక టాస్క్ అని అన్నారు. ప్రజలందరూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా సహకరించాలని కోరారు. ప్రజలు సహకరించకపోతే చెత్త వారి వద్ద ఉంటుందని, వారి ఇంటి వద్దే డంప్ చేయడం జరుగుతుందన్నారు. ఈ నిబంధనలు అందరూ పాటించడం ద్వారా మీ గ్రామాలు ఎంత చక్కగా ఉంటాయో చూడాలన్నారు. అలాగే చాలా చోట్ల గ్రామ సముదాయాలలో, అంగన్వాడి స్కూల్ ల వద్ద కాంపౌండ్ వాళ్లు లేని ఎలిమెంటరీ స్కూల్ ల వద్ద, కొన్ని కొన్ని కూడళ్ల వద్ద లిక్కర్ తాగి సీసాలను రోడ్లపై పడేయటం, కాలువలలో పడేయటం జరుగుతుందన్నారు.

దశాబ్దాల తరువాత కాలువలను శుభ్రం చేస్తూ ఉంటే టన్నులకు, టన్నులుగా ప్లాస్టిక్ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ కుప్పలు, కుప్పలుగా కాలు వలలో నుంచి లభిస్తున్నాయని తెలిపారు . ఈ కాలువలను లిక్కర్ బాటిల్స్ ద్వారా పూడ్చి వేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు . సాగునీరు, డ్రైనేజీ కాలువలను పూడ్చివేస్తూ మద్యం బాబులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు..దానివల్ల కలుషిత జలాలు సేవించి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనం చచ్చిపోతున్నారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దురదృష్టకరమని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చోమని, మందుబాబులు సక్రమంగా పనిచేసే విధంగా చేస్తామన్నారు. ఈ రోజు నుంచే పోలీస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక పోలీసు డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఇవాళ ఓ 15 మందిని పబ్లిక్ ప్లేస్ లలో మద్యం తాగి, అక్కడే సీసాలను వదిలి వేసే వారిని పట్టి వేయడం జరుగుతుందన్నారు. అవసరమైతే వారి ఫోటోలను మీడియాకు విడుదల చేయనున్నట్లుగా తెలిపారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంటికి వెళ్లి మద్యం తాగాలని, అంతేకానీ పబ్లిక్ ప్లేస్ లలో తాగి బలాదూర్ అంటామంటే కుదరదన్నారు. ఎక్కడపడితే అక్కడ సీసాలను పడేస్తామంటే ఉండి నియోజకవర్గంలో కుదరదని తేల్చి చెప్పారు.

చెత్తను వేరు చేసి ప్రజలంతా పంచాయతీరాజ్ శాఖకు సహకరించాలని, పబ్లిక్ ప్లేస్లలో చెత్త వేయవద్దని, కాలువలలో, డ్రైనేజీలలో తాగి పడేసిన సీసాలను వేయవద్దని, ఎక్కడపడితే అక్కడ పాఠశాల వంటి ప్రదేశాలలో మద్యం సేవించి అక్కడే సీసాలను వదిలివేసి పబ్లిక్ డిస్టబెన్స్ క్రియేట్ చేయవద్దని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఈ నిబంధనలను పాటించాలని కోరారు.

LEAVE A RESPONSE