– డబ్బుతో పరాచికాలు ఆడితే మహా మహులను సైతం కోలుకోలేని దెబ్బ కొడుతుంది
– ఆర్ టి ఐ మాజీ కమిషనర్ బుద్దా మురళి
– లక్ష్మీ కటాక్షం పుస్తకం పై చర్చ
హైదరాబాద్ : డబ్బును గౌరవించాలి , డబ్బుతో పరాచికాలు ఆడితే మహా మహులను సైతం కోలుకోని విధంగా డబ్బు దెబ్బ కొడుతుంది అని లక్ష్మీ కటాక్షం – పుస్తక రచయిత , ఆర్ టి ఐ మాజీ కమిషనర్ బుద్దా మురళి అభిప్రాయం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి లోని కె యస్ పి ట్రేడింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో లక్ష్మీ కటాక్షం పుస్తకం పై బుధవారం చర్చ నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు కె సుబ్రమణ్య ప్రసాద్ చర్చ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ పుస్తక రచన ఉద్దేశాన్ని రచయిత మురళి వివరించారు. కాంతారావు , సావిత్రి , చిత్తూరు నాగయ్య , కస్తూరి శివరావు, రాజబాబు , రాజనాల , గిరిజ వంటి హేమా హేమీలైన నటులు ఒకప్పుడు రాజభోగం అనుభవించి.. ముందు జాగ్రత్త లేక పోవడం వల్ల చివరి దశలో దుర్భర జీవితం గడిపారు. ఒక్క సినిమా నటులే కాదు. ప్రకాశం పంతులు వంటి రాజకీయ నాయకులు, చివరకు మొఘల్ చక్రవర్తి వారసులు సైతం డబ్బు విషయం లో చూపిన నిర్లక్ష్యం వల్ల, దుర్భర జీవితం గడిపారని అలాంటి పరిస్థితి రాకుండా డబ్బు విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో , పొదుపు , ఇన్వెస్ట్ మెంట్ గురించి వివరించినట్టు తెలిపారు.
లక్ష్మీ కటాక్షం డబ్బు విషయంలో ఆలోచన రేకెత్తించే విధంగా ఉందని , మనీ మేనేజ్ మెంట్ గురించి ఎన్నో విషయాలు, మంచి ప్రభావం చూపే విధంగా పుస్తకం ఉందని కెయస్ పి ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సుబ్రమణ్య ప్రసాద్ తెలిపారు. పలువురు పుస్తకం పై తమ అభిప్రాయాలు వెల్లడించారు .