Home » తాడిపత్రి ఘటనలో అమాయకులపై అక్రమ కేసులు

తాడిపత్రి ఘటనలో అమాయకులపై అక్రమ కేసులు

పక్క జిల్లా డీఎస్పీ చైతన్య ఎవరి అనుమతితో వచ్చి తాడిపత్రిలో దాడులు చేశారు?
పిన్నెల్లి చేసిన సిగ్గుమాలిన పనిని దేశం మొత్తం చూసింది
రాష్ట్రంలో అల్లర్లకు కారణం వైసీపీ నేతలే…అయినా టీడీపీపై నిందలు
టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

అమరావతి : తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో సంబంధంలేని వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. జిల్లాతో సంబంధంలేని డీఎస్పీ చైతన్య అర్థరాత్రి పూట జేసీ ఇంట్లోకి దూరి సిబ్బంది, పొరుగువారిపై దాడులకు పాల్పడ్డారన్నారు.

బుధవారం సచివాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ….‘‘తాడిపత్రిలో టీడీపీకి చెందిన వారినే ఎక్కువమందిని కేసుల్లో ఇరికించారు. పెద్దారెడ్డి, ఆయన కుమారుడు అక్రమాలకు పాల్పడ్డారు. 728 మందిని నిందితులుగా చూపిస్తున్నారు. కిందిస్థాయిలోని పోలీసులు టీడీపీకి చెందిన వారినే ఎక్కువ మందిని చూపిస్తున్నారు.

దీపక్ రెడ్డి, పవన్ రెడ్డిపై 307 సెక్షన్ నమోదు చేశారు. కౌంటింగ్ రోజున మళ్లీ అరాచకాలకు పాల్పడాలని చూస్తున్నారు. సీఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. తప్పుడు కేసుల్లో అమాయకులను ఇరికించొద్దు. జగన ప్రమాణస్వీకారం నాడు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానన్నాడు. తెనాలిలో అన్నాబత్తిన శివకుమార్ బూత్ లో ఓటరును కొట్టారు…ఇది దేశం మొత్తం చూసింది. బీహార్ లో నాడు జరిగిన ఘటనలు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి.

ఓటర్ల ముందు పోలింగ్ రోజును ఓటరును కొట్టారు. జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రకయలో పాల్వాయి గేటులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడు. దేశం మొత్తం ఇప్పుడు రాష్ట్రం వైపు చూస్తుంది. ఈవీఎం పగలగొట్టి దేశం దాటిపోవాలని చూస్తున్నాడు. పోలింగ్ బూత్ లో ఏజంట్ పై దాడి చేశారు. తురకా కిశోర్ అనే వ్యక్తి కూడా దాడులకు పాల్పడ్డారు. ఇతను గతంలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడికి పాల్పడ్డాడు. వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు.

13న ఈవీఎం పగలగొట్టినా పిన్నెల్లిపై చర్యలు తీసుకోలేదు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదులో పోలింగ్ సిబ్బంది, అధికారులు ఈ ఘటనను సీఈవో దృష్టికి తీసుకురాలేదు. 15న ఇచ్చిన ఫిర్యాదులో కూడా సీసీ రికార్డులో రికార్డు అయినా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనతో దేశం మొత్తం రెండో సారి ఏపీవైపు చూసింది. పిన్నెల్లిపై 10 సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేస్తే రాష్ట్రం వదిలి పారిపోయాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి భయపడి పారిపోయాడు.

కానీ సీఎస్ మాత్రం సెక్రటేరియట్ లో కూర్చున్నాడు. జవహర్ రెడ్డి నాయకత్వంలోనే యంత్రాంగం అంతా పని చేస్తోంది. ఈ ఘటనలన్నింటికీ జవహర్ రెడ్డే బాధ్యుడు. సీఎస్ తక్షణమే బాధ్యతల నుండి తప్పుకోవాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం అమలు చేసి పిన్నెల్లిని అనర్హుడిగా చేర్చాలి. దేశంలో మరోసారి ఈవీఎం పగలగొట్టకుండా చర్యలు తీసుకోవాలి.

అంబటి, జోగి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అల్లర్లకు చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ కారణం అని సిగ్గు లేకుండా మాట్లాడారు. ఏపీలో ఏం జరుగుతోందని సీఈవోను అడిగే దుస్థితి ఏర్పడింది. సాక్షిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు.ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక టేబుల్ పైనే లెక్కించేలా కలెక్టర్, డీఈవోలకు ఆదేశాలు జారీ చేయాలి’’ అని కోరారు.

దీపక్ రెడ్డి మాట్లాడుతూ…. ‘‘తాడిపత్రిలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పెద్దారెడ్డి, ఆయన కొడుకు బూత్ లలోకి చొరబడి దాడులకు తెగబడ్డారు. 15 నుండి 18 ఘటనలను ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాము. సిట్ ద్వారా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు…91 మందిని అరెస్టు చేస్తే అందులో 51 మంది టీడీపీ వారే ఉన్నారు. సిట్ వచ్చి వెళ్లిన తర్వాత 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. నేను ఘటనలో లేకపోయినా నన్ను, జేసీ పవన్ రెడ్డిని చేర్చారు.

కౌంటింగ్ రోజును ఎవర్నీ లేకుండా చేయాలని చూస్తున్నారు. సక్రమంగా కౌంటింగ్ జరిగేలా సీఈసీ చర్యలు తీసుకోవాలి. తాడిపత్రికి సంబంధించి ఆధారాలతో సహా సీఈసీకి ఇచ్చాం. అరాచకాల్లో బీహార్ కూడా వెనకబడింది. పక్క జిల్లాకు చెందిన డీఎస్పీ చైతన్య ఎస్పీ అనుమతి లేకుండా వచ్చి అర్థరాత్రి పూట దాడులకు పాల్పడ్డారు.

దాడులకు సంబంధించి సిట్ అధికారులు కనీసం సంప్రదించలేదు. అక్రమ కేసులు పెట్టిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. కౌంటింగ్ రోజున మాకు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.

 

Leave a Reply