Suryaa.co.in

Political News

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసహనం

ఈ ప్రభుత్వం పై ఉద్యోగులకు ఎందుకింత అసహనం. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలే. ఇచ్చిన హామీలపై అధికారం లోకి వచ్చాక తీసుకున్న వైఖరి.

1. చాలీ చాలని జీతాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, మనం అధికారం లోకి వచ్చాక, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దేశం లో అందరికంటే ఎక్కువగా ఉంటాయి అని నొక్కి మరీ చెప్పారు.

2. మరొకమాటగా సకాలంలో DA లు ఇవ్వటం లేదు. రెండు DA లు పెండింగులో ఉంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు ఎలా బ్రతుకుతారు అని, అందుకే వారు లంచాలకు అలవాటు పడుతున్నారని, మనం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు DA అప్పుడే అని,
ఇప్పుడు DA లు వాటి అరియర్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయో కూడా ఉద్యోగులు లెక్క మరచిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క DA కూడా సక్రమంగా తీసుకున్నది లేదు.

3. PRC ని సకాలంలో ఇస్తాం. ఇంతకు ముందు ఎక్కువ ఆలస్యం అయిన PRC 2005. (21 నెలలు కోల్పోయారు). ఇప్పుడు ఈ PRC ఇవ్వడానికి చేసిన ఆలస్యం 42 నెలలు.

1986 – ఆలస్యం లేదు.
1993 – 9 నెలలు ఆలస్యం.
1999 – 9 నెలలు ఆలస్యం
2005 – 21 నెలలు ఆలస్యం
2010 – 19 నెలలు ఆలస్యం
2015 – 11 నెలలు ఆలస్యం
2022 – 42 నెలలు ఆలస్యం

4. గత ప్రభుత్వం 20% IR ప్రకటిస్తే, ఈ ప్రభుత్వం 27% ఇస్తామని చెప్పింది. చెప్పినట్లుగానే అధికారం లోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. కానీ, మూడు నెలలు కోత పెట్టింది. 20% పై 12 నెలల పాటు నెలకి 6000 IR నాకు వచ్చేది 72000. 27% పెంచి 9 నెలల పాటు నెలకు 8000 ఇస్తే అప్పుడూ 72000 అయింది. పేరుకు 27% చెప్పుకోవడానికి తప్ప, రూపాయి ప్రయోజనం లేదు. ఇంకా ఆలస్యం కూడా అయింది.

5. ఇక IR అంటే ఫిట్మెంట్ గా ఇవ్వ బోయే దానిలో కొంత ముందుగా పొందటం. IR కంటే ఫిట్మెంట్ తక్కువ వుండటం అనేది మన రాష్ట్రం లోనే కాదు. దేశంలో కూడా ఎప్పుడూ, ఎక్కడా జరగని వింత. మన పాత చరిత్ర చూస్తే

1999 IR – 11%, ఫిట్మెంట్ 25%
2005 IR – 8.5%, ఫిట్మెంట్ 16%
2010 IR – 22%, ఫిట్మెంట్ 39%
2015 IR – 27%, ఫిట్మెంట్ 43%
2022 IR – 27%, ఫిట్మెంట్ 23%

23% ఫిట్మెంట్ ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన 20% IR సరిపోదు. 27% ఇస్తామని చెప్పడం అంటే ఓట్ల కోసం మభ్య పెట్టడం కాక మరేమని అనుకోవాలి?

ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు వేర్వేరు కాదు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యుల్లర్ చేయాలని ప్రతిపక్షం లో ఉండగా అసెంబ్లీ లో ప్రకటించారు. మరి ప్రస్తుతం ఏమైంది?

అసలు వారి వేతనాలు పెంపు నిజంగా దయనీయం.

పోలీసులకు వారాంతపు సెలవు అన్నారు. అలా ఎంత మంది పొందుతున్నారో పోలీస్ సోదరులే చెప్పాలి.

అలాగే ప్రతీ ఉద్యోగి ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు పని చేసి మిగిలిన సమయం అంతా కుటుంబం తో సంతోషంగా గడపాలి అన్నారు. అలా గడిపే పరిస్థితి ఎవరి కుందో లేదో తెలీదు.

ఆర్ధిక భారం అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఉద్యోగులకు ఇంతగా బకాయిలు పెట్టిన ప్రభుత్వం లేదు. ఒక్కో ఉద్యోగికి కనీసం రెండు లక్షల నుండి 10 లక్షలకు పైగానే బకాయిలు ఉంటాయి. ఇంత బకాయి ఉన్నా కూడా సకాలంలో జీతాలు రావటం లేదు. అసలు ఒకటవ తేదీ (మొదటి వర్కింగ్ డే) జీతం రాకపోవడం అనేది ఉద్యోగుల చరిత్ర లో లేదు.
RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారికి విలీన కమిటీ ప్రతిపాదించిన ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయలేదు, వారికి ఓల్డ్ పెన్షన్ లేకుండా విలీనం చేయటానికి అర్ధం ఏముంది. వైద్యం అందని ద్రాక్ష పండులా వారికీ ఉంది.

రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఒక్క పెండింగ్ లేకుండా, అన్ని చెల్లించి 16000 కోట్ల లోటుతో విభజిత ఆంధ్ర ప్రదేశ్ ప్రయాణం మొదలు పెట్టింది. ఏడాది లోపే 43% భారీ ఫిట్మెంట్ తో జీతాలు పెంచినా కూడా ఒక్క నెల కూడా జీతాలు ఆలస్యం కాలేదు.

100 కోట్ల నగదు బాలన్స్ తో ఈ ప్రభుత్వం పాలన మొదలు పెట్టి ఒక్క DA చెల్లించకుండా, మూడున్నరేళ్లు PRC అమలు చేయకుండా, అమలు చేసిన PRC కూడా రివర్స్ లో చేసి ఒక్క రూపాయి అదనపు భారం పడకుండా బాలన్స్ చేసినా సరే జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి కి కారణాలు ఏమిటి?

ఉద్యోగులు అద్భుతాలు ఏమీ కోరుకోరు. DA లు, PRC లు వరాలు ఏమీ కాదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కు అనుగుణంగా వేతనాలను సర్దుబాటు చేసే సాంకేతిక ప్రక్రియ మాత్రమే.

ఈ రోజు మీకు ఫిక్స్ అయిన 22460 లో ఇప్పటివరకు చరిత్ర లో ఇచ్చిన ప్రతీ DA, ప్రతీ PRC లలో కలిగిన లబ్ది cumulative ఎఫెక్ట్ నే ఇది.

గత ప్రభుత్వాలు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే ఇప్పుడు మీకు వచ్చే జీతం 30000 కాదు. 15000 కూడా ఉండదు. నా జీతం 70000 కాకుండా 30000 కూడా ఉండదు.

ఇక CPS విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
GPS అనేది ఎవరికి అంతుపట్టని పదార్ధం.
అది ఎవరికి ప్రయోజనమో దేవుడికి ఎరుక!

ఇక్కడ ప్రభుత్వ విధానాల జోలికి ఎక్కడా వెళ్ళలేదు. విమర్శించ లేదు. మనకు అవి అనవసరం.
కేవలం ఉద్యోగులకు సంబంధించిన అంశాలను అది కూడా కాండక్ట్ రూల్స్ అనుమతించిన అంశాల వరకు మాత్రమే వ్యక్త పరచడం జరిగింది.

హామీలు ఇచ్చేటప్పుడు ఆర్ధిక పరమైన ఇబ్బందులు కనిపించాలి కదా. సాధ్యాసాధ్యాలు చూసుకునే కదా ఇవ్వాలి. అధికారంలోకి వచ్చాకా ఆర్ధిక ఇబ్బందులు, సాంకేతిక అవరోధాలు, నిబంధనలు అడ్డుగా ఉన్నాయి అంటే ఎలా?

ఉద్యోగులకు ఏమైనా ఆర్ధిక ప్రయోజనాలు ఇవ్వాలి అంటే ఎందుకు అంత చిన్న చూపు, మనం కూడా సమాజ నిర్మాణంలో భాగస్వాములము కదా!

– శ్రీనివాస్

LEAVE A RESPONSE