పప్పు పలహారం లాగా పంచడం ఏమిటి ఇది ఘోరం…ఎలాగో చదవండి.
భారత, పాకిస్థాన్‌లుగా దేశం విడిపోయింది సరే!
ఇంతకూ ఈ రెంటినీ విడగొట్టిందెవరు ?
ఏ భాగం ఎవరికన్నది ఎవరు నిర్ణయించారు ?
ఎలా నిర్ణయించారు?
ప్రపంచ చరిత్రలో… కోట్ల మందిని నిరాశ్రయుల్ని చేసి… వలసబాట పట్టించి… లక్షల మంది ధనమానప్రాణాలను హరించిన అత్యంత దారుణమైన విభజన రేఖ గీసింది *సర్ సైరిల్ రాడ్‌క్లిఫ్
భారత్, పాకిస్థాన్‌ల మధ్య రెండు విభజన రేఖలను (సరిహద్దులను) గీసే బాధ్యతను రాడ్‌క్లిఫ్‌కు అప్పగించింది బ్రిటిష్ ప్రభుత్వం. ప్రధానంగా ఈ విభజనంతా పంజాబ్, బెంగాల్‌లకు సంబంధించిందే.
రాడ్‌క్లిఫ్ వృత్తిరీత్యా లాయర్! ఆయనకు ఇద్దరు పాక్, ఇద్దరు భారత న్యాయవాదులను సహాయకులుగా అప్పగించారు.
1947 జులై 8న ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయనకు… పని పూర్తి చేయటానికి నెలరోజుల సమయం ఇచ్చారు. 1934నాటి గెజిట్ వివరాల ఆధారంగా… రాడ్‌క్లిఫ్ ఈ విభజన చేశారు.
అంతకుముందు రాడ్‌క్లిఫ్‌కు భారత్ గురించి అవగాహన లేదు. పంజాబ్, బెంగాల్‌లు ఎక్కడుంటాయో కూడా తెలియదు.
ఏమీ తెలియదు కాబట్టే పక్షపాతం లేకుండా పనిచేస్తారని ఆయన్ను నియమించారనేది బ్రిటిష్ ప్రభుత్వం చెప్పిన సూత్రం.
మొత్తానికి… 12 ఆగస్టు 1947నాడే విభజన రేఖ పూర్తయింది. కానీ… దాన్ని ఆగస్టు 17 దాకా ఆపి ఉంచారు. స్వాతంత్య్రానంతరం రెండు రోజులకు సరిహద్దులను ప్రకటించారు.
మతపరమైన జనాభానే విభజనకు ప్రధానాంశమైనా… కొన్నిచోట్ల సహజసిద్ధమైన సరిహద్దులు, రవాణా, జలవనరులు, సామాజిక రాజకీయ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
సరిహద్దుల నిర్ణయానంతరం… రెండువైపులా భారీస్థాయిలో మారణకాండ చెలరేగిందన్న వార్తలు విని… తనకు ప్రభుత్వం ఇచ్చిన జీతభత్యాలను కూడా తిరస్కరించారు.
మొత్తానికి ఐదు వారాల్లో పటంపై గీసిన గీతలు… కోట్ల మంది జీవితాలను దుర్భరంలోకి నెట్టేశాయి. ఓ మారణహోమానికి కారణమయ్యాయి.
బాగా చేయలేకపోయా…. నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. ఐదు వారాల్లో అంత బాగా చేయలేకపోయాను. కనీసం రెండు మూడు సంవత్సరాల సమయం ఇచ్చి ఉంటే … మరింత మెరుగ్గా ఉండేదేమో. తొలుత నేను లాహోర్‌ను భారత్‌కు కేటాయించాను. కానీ… పాకిస్థాన్‌కు పెద్ద పట్టణం అంటూ లేకుండా పోతుందనటంతో దాన్ని పాకిస్థాన్‌లో ఉంచాల్సి వచ్చింది.1976లో కులదీప్ నయ్యర్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాడ్‌క్లిఫ్.
పాక్ రూపాయి భారత్‌లో ముద్రణ విభజన వేళ ఆస్తుల పంపకాలు విచిత్రంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నీచర్, ఇతర సామగ్రి పంచుకొనే విషయంలో భారీస్థాయిలో గొడవలు జరిగాయి. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో బల్లలు ఓ దేశానికి వెళితే, కుర్చీలు ఇంకో దేశానికి తరలాయి. కొన్ని గ్రంధాలయాల్లో నిఘంటువులను A నుంచి K వరకు ఒక దేశం, మిగతా భాగాన్ని ఇంకో దేశం చించుకొని పంచుకున్నాయి.
కరెన్సీని ముద్రించే మింట్ ఫ్యాక్టరీ ఒకటే ఉండడంతో భారత కరెన్సీనే ఉపయోగించుకోవాలని పాకిస్థాన్ నిర్ణయించింది. దీంతో నోట్లపై Govt of India అని ముద్రించి ఉన్నా, ఆ పక్కనే Govt of Pakistan అని ముద్రించుకుని తన దేశంలో చెలామణి చేసింది.
సైన్యాన్నీ రెండుగా విభజించారు. 2,60,000 మంది హిందువులు, సిక్కులు, భారత్ సైన్యంలో, లక్షా 40 వేల మంది ముస్లింలు (అప్పటి Muslim Regiment మొత్తం) పాక్ సైన్యంలో చేరారు.
స్వాతంత్య్రం వచ్చినా.. బ్రిటన్ కిందే
మనకు స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చింది ?
అనగానే… 1947 ఆగస్టు 15 అని ఠక్కున చెప్పేస్తాం. నిజమే. కానీ… ఆ రోజున మనకు వచ్చింది పాక్షిక స్వాతంత్య్రమే…. బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్-1947 ప్రకారం డొమినియన్ స్టేటస్ (స్వపరిపాలన) మాత్రమే ఆ సమయంలో భారత్‌కు లభించింది. చట్ట ప్రకారం స్వపరిపాలన చేసుకున్నా, ఇంకా దేశం బ్రిటన్ రాచరికం కింద ఉన్నట్లే లెక్క. తమ సామ్రాజ్యంలోని స్వతంత్ర రాజ్యాలకు బ్రిటన్ స్వపరిపాలన హోదా ఇచ్చేది. ఈ హోదా పొందిన దేశాలకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఉంటుంది. అయితే బ్రిటన్ రాచరికానికి లోబడి ఉండాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు స్వతంత్య్రమైనా… ఇప్పటికీ బ్రిటిష్ రాజు లేదా రాణికి విధేయులుగానే ఉంటున్నాయి. 1950 జనవరి 26 న సొంత రాజ్యాంగ ఆవిష్కరణతో… భారత్ ఆ విధేయతకు చరమగీతం పాడింది. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. పాకిస్థాన్ మాత్రం 1956 వరకు అలాగే బ్రిటిష్ రాచరికం కిందే కొనసాగింది.