– గత టీడీపీ పాలనలోనూ కనిపించని పార్టీ నేతల ప్రకటనలు
– జగన్ జమానాలోనూ మంత్రులు, అధికారుల ప్రకటనలే
– సమాచారశాఖలో కొత్త సంస్కృతి
( మార్తి సుబ్రహ్మణ్యం)
విజయవాడ ఎంపి కేశినేని చిన్నికి సమాచార శాఖ అధికారిక సేవలపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన విజయవాడ ఎంపి అయినప్పటికీ, అధికారికంగా ఎలాంటి ప్రొటోకాల్ లేదు. అయినప్పటికీ చిన్నికి సంబంధించిన కార్యక్రమాలన్నీ సమాచార శాఖ నిర్వహించే పబ్లిసిటీసెల్ గ్రూపులలో, గత కొద్దికాలం నుంచి తామరతంపరగా వచ్చి పడుతున్నాయి.
నిజానికి అది ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల రోజువారీ కార్యక్రమాలను మీడియాకు వివరించేందుకు ఏర్పాటుచేసిన మీడియా గ్రూప్. అది కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటుచేసినది. ఆ గ్రూపులో పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు గానీ, ప్రభుత్వ పదవులతో సంబంధం లేని వ్యక్తుల కార్యక్రమాల వార్తలు గానీ ఇవ్వడానికి వీల్లేదు.
ఈ సంప్రదాయం ఏ పార్టీ అధికారంలో ఉన్నా విజయవంతంగా కొనసాగింది.
గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు సైతం ఎంపి, ఎమ్మెల్యేల కార్యక్రమాలు సమాచారశాఖ గ్రూపులలో ఎప్పుడూ పెట్టిన దాఖలాలు లేవు. నిబంధనలు లెక్క చేయరన్న పేరున్న జగన్ జమానాలో సైతం, ఈ నిబంధన కొనసాగించారు. కాకపోతే రెండు సందర్భాల్లో వైసీపీ ఎమ్మెల్యేల కార్యక్రమాలు పెట్టినప్పుడు.. జర్నలిస్టుల ఫిర్యాదుల తర్వాత వాటిని తొలగించారు. ఆ తర్వాత ప్రభుత్వ పదవులు లేని వారి కార్యక్రమాలు వచ్చిన దాఖలాలు లేవు.
కానీ ఈసారి సమాచార శాఖలో కొత్త సంప్రదాయానికి తెరలేచింది. విజయవాడ ఎంపి కేశినేని చిన్నికి సంబంధించిన కార్యక్రమాలన్నీ, సమాచారశాఖ గ్రూపులో ప్రతిరోజూ రావడం విస్మయపరుస్తోంది. గతంలో విజయవాడ ఎంపిగా ఉన్న కేశినేని నాని.. తన పార్లమెంటు పరిథిలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా, సమాచార శాఖ తన గ్రూపులో పెట్టలేదు. కృష్ణా జిల్లా డీపీఆర్‌ఓ గ్రూపులో కూడా పెట్టలేదు. కేవలం నాటి మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర కార్యక్రమాలు మాత్రమే మీడియాకు పంపించేవారు.
మరి ఈసారి ఆ నిబంధనలు మార్చిన అధికారి ఎవరు? ఎంపి చిన్ని కార్యక్రమాలు పబ్లిసిటీ సెల్‌లో ఇవ్వాలని ఆదేశించిన అధికారి ఎవరు? అన్న చర్చ జరుగుతోంది. రేపు విజయవాడ ఎమ్మెల్యేలు సైతం తమ వార్తలు కూడా గ్రూపులో పెట్టాలని ఒత్తిడి చేస్తే పరిస్థితి ఏమిటి? అన్న చర్చకు తెరలేచింది. నిజానికి కేశినేని చిన్నికి సొంతంగా సోషల్‌మీడియా బృందాలు, ఇద్దరు పీఏలు ఉన్నారు. వారు మీడియా గ్రూపులలో చిన్ని పాల్గొనే కార్యక్రమాలు పంపిస్తుంటారు. మళ్లీ ఈ ‘సమాచార’ సేవ ఎందుకున్న ప్రశ్నలు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి.