కళ్లు మూసుకున్న అధికార గణం

-పెన్షన్ల పంపిణీ వేళ కోడ్‌ ఉల్లంఘన
-అవ్వాతాతల పాసు పుస్తకాలపై సీఎం బొమ్మలు
-సచివాలయాలకు వాటితోనే వృద్ధుల రాక
-ముందే తెలిసినా చర్యలు శూన్యం
-రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ధిక్కరిస్తూ ఎన్నికల వేళ కోడ్‌ను ఉల్లంఘిస్తూ అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. వారికి అధికారులు కూడా వత్తాసు పలుకున్నారు. తాజాగా పెన్షన్ల పంపిణీ వేళ పెన్షన్‌ పాసు పుస్తకాలపై సీఎం జగన్మోహన్‌రెడ్డి బొమ్మలు దర్శనమిచ్చాయి. బుధవారం నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నా, పాసు పుస్తకాలపై సీఎం బొమ్మలు ఎప్పటినుంచో ఉన్నాయని ముందే తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరించడం, ఎటువంటి ఆదేశాలివ్వకపోవటం వారి వ్యవహార శైలికి అద్దం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అందుకుంటున్న వారు సీఎం ఫొటోలు ఉన్న పాసుపుస్తకాన్ని తీసుకునే సచివాల యాలకు వెళుతున్నారు. దీనిని ఇప్పటివరకు అంతగా పట్టించుకోకపోవటం విశేషం.

కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామ సచివాలయం-2లో గురువారం ప్రతినెలా అందించే పింఛన్‌ కోసం వృద్ధులు, వికలాంగులు భారీ ఎత్తున గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి వేచి చూశారు. వారి చేతుల్లో జగన్‌ ఫొటోతో ఉన్న పింఛన్‌ బుక్కులు దర్శనమిచ్చాయి. సచివాలయ సిబ్బంది రావడంతో ఒక్కసారిగా అందరూ సచివాలయంలోకి వెళ్లారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను తుంగలో తొక్కుతూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టుగా సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సిద్ధవటం మండలంలో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉందా లేదా అని ప్రశ్నించారు. ఇటీవలే జ్యోతి గ్రామంలో ముఖ్యమంత్రి వాల్‌ పోస్టర్లు దర్శనం కావడం… నేడు గ్రామ సచివాలయం మాధవరంలో ముఖ్యమంత్రి బొమ్మతో ఉన్న పింఛన్‌ పాసు బుక్కులు దర్శనం కావడం ఎలక్షన్‌ కోడ్‌ అమలు ఉల్లంఘన బహిరంగంగా జరుగుతున్న అధికారులు చర్యలు ఎక్కడ అని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశాయి.

ఎంపీడీవో ఉమామహేశ్వరరావు వివరణ: మాధవరం గ్రామ సచివాలయం 2లో పింఛన్‌ పాసుబుక్కులపై ముఖ్యమంత్రి బొమ్మలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం.

Leave a Reply