హవ్వ… టీటీడీతో సమానంగా జగనానంద స్వామి ఫొటోకు ప్రాధాన్యతనా ? ఇది భావ్యమేనా??

-కలియుగ దైవం శ్రీనివాసుడి కంటే తానే గొప్పవాడినని జగన్మోహన్ రెడ్డి భావిస్తారేమో నాకు తెలియదు
– టీటీడీ స్టేషనరీ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు?… ఒక మత విశ్వాసానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి??
– టీటీడీ నియమ నిబంధనల ప్రకారం అన్య మతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే విధిగా డిక్లరేషన్ సమర్పించాలి
– 2019 ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవ మతస్థుడనని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి
– శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ఆయన డిక్లరేషన్ సమర్పించడం లేదంటే, హిందూ మతాన్ని స్వీకరించారని భావించాలా?
– హిందూ మతం అనేది ఒక జీవన విధానం… ఎవరినైనా స్వాగతిస్తుంది
– జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం పడితే అప్పుడు విశాఖలో నిర్మించుకున్న కలల సౌదంలోకి వెళ్లొచ్చు… అప్పటివరకు ఓపిక పట్టండి
– రాహుల్ గాంధీ త్వరగా ఢిల్లీకి వస్తే… ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్
– టీడీపీ, జనసేన కూటమితో బిజెపి జతకట్టే అవకాశమే అధికం
– నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) లోగో ఒకవైపు అయితే, మరొకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ను టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇండ్ల స్థలాల ప్రొసీడింగ్స్ పై ముద్రించడం ఏమిటని ? నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తిరుమలేశానికి భక్తులు హుండీ ద్వారా వచ్చిన ఆదాయంతో భూమిని కొనుగోలు చేసి, టీటీడీ ఉద్యోగులకు ప్లాట్లుగా విభజించి ఇండ్ల స్థలాలను ఇస్తున్నారు. ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే ప్రొసీడింగ్ పత్రాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం, ఆయన ఫోటోకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు భావ్యమని నిలదీశారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఏ రకంగా చూసిన ఇది క్షమించరాని దోషం. ఇది నేరం అని చెప్పలేను కానీ దోషం అని చెప్పగలను. ఉద్యోగులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల ప్రొసీడింగ్ పత్రాలపై టీటీడీ లోగో ఒకవైపు అయితే మరొకవైపు జగనానంద స్వామి ఫోటోను ముద్రించారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు మనస్సాక్షిని చంపుకొని ఈ విధంగా ప్రొసీడింగ్స్ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటోను ముద్రించి ఉంటారని నేను భావిస్తున్నాను. తెలిసి తెలియకుండా ముద్రించిన ఈ ప్రొసీడింగ్స్ ను వెంటనే రద్దు చేసి వెనక్కి తీసుకోవాలి.

టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఒక మత విశ్వాసానికి సంబంధించిన దేవాలయం కార్యకలాపాలలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకోవడం సరికాదు. ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈ వో )ని రాష్ట్ర ప్రభుత్వమే నియమించినప్పటికీ, ఈ వో స్వామి వారి సేవకుడే తప్ప, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారి కాదు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ అధికారిని స్వామివారి సేవ కోసం నియమించినట్లు అవుతుందన్నారు.

దేవాలయాల పరిసరాలలో ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి
పవిత్రమైన దేవాలయ పరిసరాలలో, పట్టణంలో వ్యక్తుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికాదని 2008-09 లో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిషేధించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. టెంపుల్ పట్టణంలో ఒక రాజకీయ నేత అధికంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనించిన ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. వ్యక్తుల ఫ్లెక్సీలు ఉండడానికి వీలు లేదని, దేవాలయ ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా దేవుడు, దేవత ప్రతిమల ఫోటోలు మాత్రమే ఉండే విధంగా ఆదేశాలను జారీ చేశారు.

దేవాలయ ఉత్సవాల ఫ్లెక్సీలపై కార్యనిర్వహణ అధికారి పేరు మాత్రమే ఉండాలని, వారి ఫోటోలు కూడా ఉండవద్దనే నిబంధనలు ఉన్నాయి. మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమాలలో ప్రభుత్వాలు, వ్యక్తులు అతిగా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. టీటీడీ డబ్బులతో భూమిని కొనుగోలు చేసి, ఉద్యోగులకు ఫ్లాట్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ డబ్బులను వెచ్చించి భూమిని కొనుగోలు చేసి ఉద్యోగులకు సెంటు, 10 సెంట్ల స్థలాన్ని ఇచ్చినా , ప్రొసీడింగ్స్ పత్రాలపై ఆయన ఫోటోను ముద్రించడానికి లేదు. టీటీడీ స్టేషనరీ పై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎలా ముద్రిస్తారు?!. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించే చోట గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉండేది .

ఇప్పుడు ఆయన ఫోటోను కూడా ఎత్తేశారు. చుట్టూ వైకాపా రంగులతో నవరత్నాలు ఫొటో, చూస్తే తట్టుకోలేనంత బాధనిపిస్తుంది. ఇంత దరిద్రంగా నీచంగా ఆలోచిస్తారా అని జనం అనుకుంటున్నారు. ప్రజలకు సంబంధించిన బర్త్, డెత్, ఆస్తి హక్కు పత్రాలపై, ఆసుపత్రి పత్రాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా టీటీడీ స్టేషనరీ పై జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించే దుస్థితికి పరిపాలన విభాగం వచ్చిందా?, లేకపోతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాల్సిందేనని ఆయన తరపున సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఎవరైనా చెబితే, ఏమి చేయలేని దయనీయ పరిస్థితులలో ఈ దారుణ క్రీడకు ఒడిగట్టారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రేపు మూలవిరాట్టు మార్పు తప్ప దేనికైనా రెడీ అవుతారా అంటూ నిలదీశారు.

ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం ఉన్న చట్టాలను, గైడ్ లైన్స్ అతిక్రమించడమే…!
టీటీడీ స్టేషనరీ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం అనేది ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను, గైడ్లైన్స్ అతిక్రమించడమే అవుతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఒకవేళ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోను రాష్ట్ర ప్రభుత్వాలు లోగో గా పెట్టుకుంటే, అప్పుడు ముఖ్యమంత్రి ఫోటో లోగో కింద, లేదంటే పక్కకు పెట్టుకోవచ్చు. అంతేకానీ టెంపుల్ స్టేషనరీ పై ఫోటో ముద్రించడం అనేది ఇట్స్ నాట్ ఎటాల్ గుడ్ టేస్ట్ అని విమర్శించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోను రాష్ట్ర ప్రభుత్వాలు లోగో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే, మెజారిటీ ప్రజల మనో హృదయాలను దోచుకునే అవకాశం ఉంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లోగో గా దేవాలయ శిఖరం ఫోటోను పెట్టుకుంటారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి
టీటీడీ స్టేషనరీ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఫోటోను ముద్రించమని ఎవరైనా చెప్పారా?, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిసి తెలిసి ఇటువంటి పొరపాటు చేయరని నేను భావిస్తున్నాను. ఈ సంఘటన మనసును తీవ్రంగా కలచివేసింది. భక్తులకు ఆ ఫోటో అంటేనే తీవ్రమైన వ్యతిరేకతను కల్పించే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. రాజకీయ సుడిగుండంలో కడతేర్చే దిశగా ప్రజలని ప్రేరేపిస్తున్నారేమోనని, ఒక్కసారి ఇటువంటి సంఘటనలపై పునరాలోచించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

ఎన్నికల అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి తాను క్రైస్తవ మతస్థుడినని తెలిపారు. ఆయన ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే, ఈ విషయం స్పష్టం అవుతుంది. తిరుమల శ్రీవారిని అన్యమతస్తులు ఎవరైనా దర్శించుకోవాలని భావించినప్పుడు… నేను అన్యమతస్తుడనని, భగవంతుడిపై నమ్మకంతో ఆయనని దర్శించుకుంటానని డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఈ విధంగా డిక్లరేషన్ ఇచ్చారు. అన్యమత విశ్వాసాలు కలిగిన వారు కూడా కొలిచే దైవం ఆ శ్రీనివాసుడు. జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఆ శ్రీనివాసుడి కంటే గొప్ప వారిగా భావిస్తారేమో నాకు తెలియదు. సాధారణ ప్రజల వద్ద ఆయన భావన అదే విధంగా ఉంటుంది.

ఆయనకు ఆయన ఏమైనా అనుకోవచ్చు. ఎవరికి వారే గొప్ప. తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలులో ఉన్న నియమ నిబంధనలను పాటించమని చెప్పే ధైర్యం పాలించే ఉద్యోగులకు లేకపోవచ్చు. కానీ, దేవాలయ నియమ నిబంధనలను పాటించాలనే ధ్యాస జగన్మోహన్ రెడ్డి కి ఉండాలి కదా అని రఘురామకృష్ణం రాజు అన్నారు . జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను పాటించడం లేదంటే, తరచూ స్వరూపానంద స్వామి గారి కార్యకలాపాలలో, అప్పుడప్పుడు చినజీయర్ స్వామి గార్ని కలుస్తుండడం పరిశీలిస్తే ఆయన ఏమైనా హిందూ మతాన్ని స్వీకరించారా? అన్న అనుమానం రావడం సహజం.

జగన్మోహన్ రెడ్డిని సాదరంగా స్వామీజీలు హిందూ మతంలోకి తీసుకువచ్చారేమో తెలియదు. అందుకే ఆయన తిరుమల లో శ్రీవారిని దర్శించుకునేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శనాన్ని చేసుకుంటున్నారేమో. హిందూ మతం అన్ని మతాల వారిని అక్కున చేర్చుకుంటుంది. హిందూ మతం అనేది ఒక జీవన విధానం అని రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల అఫీడవిట్ పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి హిందూవా?, క్రైస్తవ మతస్థుడో తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవాలయ సాంప్రదాయాన్ని అనుసరించి చిన్న ప్రొసీజర్ అనుసరిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?!.

ఈ విషయములో భారతీ రెడ్డిని అభినందిస్తున్నాను. ఆమెకు తమ మతం పట్ల ఉన్న విశ్వాసం అద్భుతం. తిరుమలలో దైవదర్శనానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే ఆమె దైవదర్శనానికి రావడం లేదనుకుంటున్నాను. దైవదర్శనానికి వచ్చినప్పుడు చిన్న సంతకం పెడితే, అన్య మతస్తుల హృదయాలను గెలుచుకునే అవకాశం ఉంటుందని ఒక భక్తునిగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా టీటీడీ స్టేషనరీ పై ముద్రించిన జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడిన ప్రొసీడింగ్స్ ను చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు జోక్యం చేసుకొని రద్దు చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు .

అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో వసతి, కార్యాలయాలా?
వెనుకబడిన విశాఖపట్నం అభివృద్ధిని పర్యవేక్షించడానికి ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో వసతి, కార్యాలయాలు అవసరమా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నం కు తరలించాలనే కుట్రను సీనియర్ న్యాయవాది వున్నం మురళీధర్ రావు వంటి వారు న్యాయస్థానంలో అడ్డుకున్నారు. వెనుకబడిన విశాఖ అభివృద్ధిని పర్యవేక్షించి అభివృద్ధి చేయాలనుకుంటే అడ్డుగా వస్తున్నారని సింగిల్ జడ్జి ముందు ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలను వినిపించారు. అసలు ఈ కేసు సింగిల్ బెంచ్ జడ్జి వాదనలను వినడానికి వీలు లేదని, త్రిసభ్య ధర్మసనానికి బదిలీ చేయాలని పట్టుబట్టారు.

ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి న్యాయ మూర్తి బదిలీ చేస్తూ, స్టే విధించారు. అమరావతి నుంచి దుకాణం సర్దేయడానికి ప్రయత్నించగా హైకోర్టు గతంలోనే ప్రభుత్వానికి ఆ హక్కు లేదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా… హైకోర్టు తీర్పు నేపథ్యంలో దుకాణం సర్దేయడానికి వీలులేదని సుప్రీం కోర్టు కూడా వెల్లడించి, కేసు వినడానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్ట్ కావలసిన ఈ కేసు, లిస్ట్ కాలేదు.

దీనితో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చింతల సుమన్ రెడ్డి వెళ్లి వెనుకబడ్డ విశాఖ అభివృద్ధిని పర్యవేక్షించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యమంత్రి తో పాటు ఐఏఎస్ అధికారులు అక్కడే బస చేస్తూ పర్యవేక్షించే వెసులు బాటు కల్పించాలని కోరడం పరిశీలిస్తే… ఇటువంటి సిల్లీ డ్రామాలకు న్యాయమూర్తులు పడిపోతార నుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది . విశాఖపట్నం ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసే అభివృద్ధి ఏముంది?, అక్కడ ఏమైనా కొత్తగా పోర్టును నిర్మిస్తారా?,

ఇప్పటికే విశాఖపట్నంలో పోర్టు ఉంది. కొత్త గా స్టీల్ ప్లాంట్ ఏమైనా నిర్మిస్తారా? ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. ఇంకా కొత్తగా చేసే అభివృద్ధి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అభివృద్ధి మాటేమిటి?, ఈ రెండు ప్రాంతాల అభివృద్ధిని కూడా పర్యవేక్షించడానికి అక్కడ ఆరు లక్షల చదరపు అడుగుల వసతి కార్యాలయ సౌకర్యం కావాలా?, అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

టిడిపి తో పొత్తు పై కాంగ్రెస్ మీటింగ్ లో చర్చ
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల్లో కలిసి వెళ్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ పొత్తుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు ఆసక్తిని ప్రదర్శిస్తారని రాహుల్ గాంధీ, సొంత పార్టీ నేతలను ప్రశ్నించినట్లుగా తెలిసిందన్నారు. తెదేపా, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. జనసేనకు ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రానున్న ఎన్నికలకు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్లే అవకాశం ఉంది.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కష్టం అనేది ఊరికే పోదు. చంద్రబాబు నాయుడు 53 రోజులపాటు జైలు జీవితం అనుభవించి మహా కష్టాలను అనుభవించారు . నాలుగు ఏళ్లు గా నేను ఎన్నో కష్టాలను పడ్డాను. ఈ ప్రభుత్వంలో కష్టపడిన ప్రజలు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుంది… పోలింగ్ రోజు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. జనవరి 10వ తేదీ లోపు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని భావించాము.

కానీ ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే, నాగపూర్ నుంచి రాహుల్ గాంధీ త్వరగా ఢిల్లీకి చేరుకుంటే ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయనుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బదిలీ అయింది. ఇప్పుడు షర్మిల నాయకత్వంలో బదిలీ అయిన ఓటు బ్యాంకులో రాహుల్ గాంధీ ఆశిస్తున్నట్లుగా 15% కాకపోయినా, ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Leave a Reply