సడెన్‌ స్ట్రోక్స్కి పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా?

– యువ గుండెల్లో కల్లోలం
– వైద్యుల నివేదికలో షాకింగ్ విషయాలు
(యస్వీయస్)

గుండె లయ తప్పుతోంది. వందేళ్లు ప్రాణాలను నిలబెట్టాల్సిన మన గుండె 40 ఏళ్లకే మొరాయిస్తోంది. చెట్టంత మనిషినీ ఉన్నట్టుండి కుప్ప కూల్చుతోంది. ఆరోగ్యం పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండే వాళ్లూ సడెన్‌గా చనిపోతున్నారు. అయితే యువ గుండెల్లో ఎందుకీ కల్లోలం.? ఈ సడెన్‌ స్ట్రోక్స్ పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా.? రాజ్‌ కౌశల్, సిద్దార్థ్‌ శుక్లా, పునీత్‌ రాజ్‌కుమార్, గౌతమ్‌ రెడ్డి, షేన్‌వార్న్… అందరూ కరోనా బారిన పడి కోలుకున్నవాళ్లే! అందరూ ఫిట్‌నెస్‌ పర్ఫెక్ట్. నిత్యం వ్యాయామం చేసే వాళ్లే..! బాడీని ఫిట్‌గా ఉంచేవాళ్లే! అందరూ కూడా ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య సేవలు పొందగలవారే!

కానీ వీళ్లందరూ చనిపోయింది హార్ట్‌ ఎటాక్‌ వల్లే. గతంలో 60 ఏళ్లు దాటిన వారిలోనే ఇలాంటి సడెన్‌ కార్డియాక్ అరెస్ట్‌ కనిపించేది. కానీ ఇప్పుడు 50 ఏళ్ల లోపే, ఇంకా చెప్పాలంటే 40 ఏళ్ల వయస్సులోనే గుండె ఆగిపోతోంది. ఇటీవల వరసగా తలెత్తుతున్న ఇలాంటి మరణాలు వైద్యులకూ అంతుచిక్కని మిస్టరీగా మారుతున్నాయి. ప్రధానంగా వ్యాయామాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయనివారు ఉన్నట్టుండి కుప్ప కూలిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అతిగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయడం కూడా ప్రమాదమే అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అదీ నిజమే. కానీ కరోనా బారిన పడి కోలుకున్న వారి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

సడెన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌ లు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. అన్నింటికీ మించి యంగ్‌స్టర్స్ వీటి బారిన పడుతుండడంతో గుండెపై పోస్ట్‌ కొవిడ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశంపై కీలక అధ్యయనాలు జరిగుతున్నాయి. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. కరోనా వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రభావం గుండె పని తీరు పైనా తీవ్రంగా ప్రభావం చూపుతోందని తేల్చారు. ఇటీవల కాలంలో మృతిచెందిన రాజ్‌ కౌశల్, సిద్దార్థ్‌ శుక్లా, పునీత్‌ రాజ్‌కుమార్, గౌతమ్‌ రెడ్డి, షేన్‌వార్న్‌ విషయంలోనూ ఇలా జరిగే ఛాన్స్‌ లేకపోలేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

గుండె జబ్బులకు పోస్ట్‌ కొవిడ్‌కు లింక్‌ ఉందని ప్రాథమికంగా తేలిన అంశం. అయితే అన్ని హార్ట్‌ స్ట్రోక్స్ కేవలం కరోనా కారణం కాదన్నది కూడా అంతే నిజం. అందుకే ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయే వాళ్లంతా బయటి నుంచి చూడ్డానికి చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తుంటారని డాక్టర్లు అంటున్నారు. కానీ తెలియకుండానే శరీరం లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అందుకోసం వ్యాయామం చేయాలి. జిమ్‌కు వెళ్లాలి. కానీ రోజుకు ఎంతటైమ్ వర్కౌట్ చేయాలి? ముఖ్యంగా కొవిడ్ బారిన పడిన వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే పనిగా ఓవర్ వర్కౌట్ చేస్తే గుండెపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలకు కచ్చితంగా సమాధానాలు తెలుసుకోవాలి. పోస్ట్‌ కొవిడ్ లక్షణాల్లో హార్ట్‌ ఎటాక్‌ కూడా చేరిపోయిందంటున్న డాక్టర్ల హెచ్చరికలను కచ్చితంగా పట్టించుకోవాలి. సరైన జాగ్రత్తలూ పాటించాలి.

గుండెపోటులో కీలకంగా ‘గోల్డెన్ అవర్..’
“గోల్డెన్‌ అవర్‌” అనేది ఎమర్జెన్సీ టైమ్‌లో వినిపించే పదం. అవును.., ఎవరైనా ఆపదలో ఉంటే ఆ గోల్డెన్‌ అవరే బతికిస్తుందంటారు వైద్యులు. ప్రైమరీ ట్రీట్‌మెంట్‌ తర్వాత గంటలోపు హాస్పిటల్‌కి తీసుకొస్తే ప్రాణాలు నిలపొచ్చనేది దీని అర్ధం. అయితే, ఇప్పుడు ఈ గోల్డెన్‌ అవర్ వర్కవుట్‌ కావడం లేదేమోనన్న అనుమానం వస్తోంది! ఎందుకంటే, ఆపదలో పడ్డామని గుర్తించేలోపే ప్రాణాలు పోతున్నాయ్‌.
అవును.. ఇప్పుడిదే జరుగుతోంది. ఆమధ్య పునీత్‌ రాజ్‌కుమార్‌, మొన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఇప్పుడు క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ విషయంలో ఇదే జరిగింది.

పోస్ట్‌ కోవిడ్‌ ఎఫెక్టో, లేక ఇంకేదైనా కారణమో తెలియదు గాని, నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. షేన్‌ వార్న్‌ విషయంలో అది మరోసారి రుజువైంది. హార్ట్‌ ఎటాక్‌కి గురైన షేన్‌ వార్న్‌ను బతికించుకునేందుకు ముగ్గురు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించారు. గుండెను రీయాక్టివేట్ చేసేందుకు CPR చేశారు. ఛాతిపై అదుముతూ నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేశారు.

20 నిమిషాలపాటు విశ్వప్రయత్నాలు చేసినా షేన్‌ వార్న్‌ను బతికించుకోలేకపోయారు అతని స్నేహితులు. వార్న్‌ కొద్దిరోజులుగా ముగ్గురు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లోనే ఉంటున్నాడు. ఓ ప్రైవేట్‌ విల్లాలో ఉంటోన్న వార్న్‌, స్నేహితులు వచ్చేసరికి అచేతనంగా పడి ఉన్నాడు. హార్ట్‌ ఎటాక్‌గా భావించి వెంటనే CPR చేశారు. కానీ, ప్రాణాలు కాపాడలేకపోయామని అతని స్నేహితులు పేర్కొన్నారు.
ముందుగా తెలుసుకునే ఛాన్స్ ఉందా?

సడెన్ హార్ట్ అటాక్ తో మృత్యువాత పడిన సెలబ్రిటీలంతా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించారు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ తీసుకున్నారు. అయినా, వీరు చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే యువకులు కూడా ఎందుకు గుండెపోటు ఎందుకు వస్తుంది.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది ఆక్సిజన్ లేకపోవడం, వెంటనే చికిత్స చేయకపోతే, గుండె కండరాలకు మరణం సంభవిస్తుంది. గుండెపోటు లక్షణాలు వ్యక్తికి.. వ్యక్తికి మారుతూ ఉంటాయి. కాలక్రమేణా కొలెస్ట్రాల్ సహా అనేక రకాల వ్యర్థాలు రక్తంలో పేరుకుపోతాయని, ఇది ధమనులను అడ్డుకుని గుండెపోటుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండెపోటుకు.. కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా చాలా తేడా ఉంది. రెండు పరిస్థితులు ఒకేలా ఉన్నప్పటికీ, అవి వైద్యపరంగా విభిన్నంగా నిర్ధారణ చేస్తారు. వాటికి వేర్వేరు చికిత్సలు చేస్తుంటారు. ఒత్తిడి కూడా దీనికి ఒక పెద్ద కారణం కావచ్చు. ఎందుకంటే ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెకు ప్రాణాంతకంగా మారుతుంది.

గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు మనం గమనించవచ్చు. శరీరం ఎడమవైపు బిగుతుగా అనిపించడం, ఛాతీ లేదా చేతులు, మెడ నొప్పి, నొప్పి దవడ లేదా వెనుకకు వ్యాపిస్తుంది. అలాగే వికారం, అజీర్ణం, వేడిమి, కడుపు నొప్పి, శ్వాస ఆడకపోవుట, బాగా చెమట పట్టడం, అలసట, నీరసం, తేలికగా అనిపించడం తదితరాలు గుండెపోటుకు లక్షణాలు.

WHO ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం మరణాలలో 16% గుండెపోటే కారణం. ఈ మరణాలలో ఆరు మిలియన్లకు పైగా 30 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. అత్యధిక గుండెపోటు మరణాల్లో చైనా తొలిస్థానంలో ఉండగా రెండవస్థానంలో భారత్, మూడో స్థానంలో రష్యా, నాలుగో స్థానంలో అమెరికా దేశాలు ఉన్నాయి..

Leave a Reply