– ఇందిరమ్మ రాజ్యమంటే భూములు అమ్మడం, బీర్లు అమ్మడం కోసమేనా?
– కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పిడి తప్పదు
– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
హైదరాబాద్: జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పిడి తథ్యమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ జోస్యం చెప్పారు. అందుకోసమే తన పదవి కాపాడుకునేందుకు, సోనియా గాంధీకి తనపట్ల నమ్మకం కలిగించుకునేలా ప్రసన్నం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సోనియా దేవత అంటూ.. ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తిమీద జల్లుకోవాలంటూ.. రాహులే దేశానికి సర్వస్వమంటూ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం, కప్పం కట్టడంపైనే రేవంత్ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఎన్.వి.ఎస్.ఎస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరోజు గడిస్తే చాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి….. హమ్మయ్య..! ఈరోజు గడిచిందనే భావనలో ప్రజలు ఉన్నట్లుగా అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి.. తన పదవిని కాపాడుకోవడానికే ప్రాధాన్యతనిస్తూ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడ తమ భూములను గుంజుకుంటుందోనని, ఇల్లు కూలగొడుతుందేమోననే భయంలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే.. కూలగొట్టడం, కొల్లగొట్టడం.. దోచుకోవడం, దాచుకోవడం.. భూములు అమ్మడం, బీర్లు అమ్మడమేనా అంటూ ఎన్.వి.ఎస్.ఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజల కోసం పాలన చేయకుండా ఇతర రాష్ట్రాల్లో రాజకీయాల కోసం, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలను మెరుగుపర్చుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నారంటూ ఆరోపించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రా.. లేక రేవంత్ రెడ్డా…? అన్న అనుమానం ప్రజల్లో నెలకొందని ఎన్.వి.ఎస్.ఎస్ విమర్శించారు.
సోనియా గాంధీ పట్ల విధేయత చాటుకుని, నమ్మకం కలిగించుకునేలా ప్రసన్నం చేసుకోవాలని రేవంత్ రెడ్డి నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. అయినా, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను నమ్మడం లేదనే విషయంలో అనేక అంశాల ద్వారా స్పష్టమవుతున్నది. ఏడాది కాలం నుంచి మంత్రివర్గ విస్తరణ చేసి, కీలక శాఖలను తనవారికి అప్పజెప్పాలని పదేపదే కేంద్రాన్ని ప్రాధేయపడుతున్నా రేవంత్ కు అనుమతి ఇవ్వడం లేదు. రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఎవ్వరనేది తెలంగాణ ప్రజల్లో సంశయం నెలకొంది.
వీసీల నియామకం కావాలన్నా.. కార్పొరేషన్ల నియామకం జరగాలన్నా.. పదాధికారుల నియామకం జరగాలన్నా, మంత్రివర్గ విస్తరణ చేయాలన్నా ఫైలు పట్టుకుని ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాంట్రాక్టు రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే రేవంత్ ముందుకెళ్తున్నడు.
అసలు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రా.. లేక రేవంత్ రెడ్డా? రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదు. ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ చేసిన దాఖలాల్లేవు. ప్రభుత్వ బకాయిల కారణంగా ఏ ప్రైవేటు ఆసుపత్రిలో కూడా ఆరోగ్య శ్రీ ని సక్రమంగా అమలు చేయడం లేదు. దీనిపై సర్కారు కనీసం సమీక్షించలేదు.
ఇందిరమ్మ రాజ్యమంటే.. కూలగొట్టడం, కొల్లగొట్టడం.. దోచుకోవడం, దాచుకోవడం. భూములు అమ్మడం, బీర్లు అమ్మడంకోసమేనా? రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్టు పెట్టి గట్టెక్కే విధంగా ఓట్లు దండుకుని పబ్బం గడుపుకున్నాడు. దేవుడికి ఆగ్రహం వస్తుందేమోనని, తన పీఠం కదులుతుందేమోననే భయంతో రేవంత్ ఒక్కో దేవాలయాన్ని సందర్శిస్తున్నడు. మొన్న వేములవాడ, యాదాద్రి ఆలయాలను సందర్శించి చేసిన తప్పులకు చెంపలు వేసుకుని, గుంజీలు తీశాడు. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పిడి తప్పదు.