Suryaa.co.in

Telangana

హక్కులను అడ్డుకోవడం ప్రజాపాలన?

– సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ నేత కె. గోవర్దన్ విమర్శ

హైదరాబాద్‌: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల వెళ్లకుండా వివిధ మహిళా సంఘ నేతల్ని మంగళవారం టుంకిమెట్ల వద్ద పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారు. ప్రొఫెసర్ పద్మజా షా, పీవోడబ్ల్యు జాతీయ కన్వీనర్ వి.సంధ్య, ఝాన్సీలతో పాటు సజయ, అనసూయ, జ్యోతి, శ్రీదేవి, గీత తదితరులను పోలీసులు అడ్డగించడం అప్రజాస్వామికం, చట్టవిరుద్ధంగా ఉన్నాయని సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కె.గోవర్దన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

లగచర్ల పరిసర గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు చెందిన భూముల్ని ఫార్మా కంపెనీలకు ఇచ్చేది లేదని ఆరు నెలలుగా తెగేసి చెప్తూ వస్తున్నారు. అయినా రేవంత్ సర్కార్ ఈ భూములను ఇవ్వాల్సిందే అంటూ బలవంతపు ప్రయత్నాల్ని సాగించడం లో భాగంగానే కలెక్టర్, ఇతర అధికారులపై ఇటీవల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం మహిళా జేఏసీ తరపున హైదరాబాద్ నుండి లగచర్ల కు వెళ్తున్న నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు అడ్డగించి, వారిని తిరిగి బలవంతం గా హైదరాబాద్ కు తరలించడం నిరంకుశ విధానమే అవుతుందని విమర్శించారు. ప్రజా పరి పాలన సాగిస్తున్నామని ఏడాది సంబురాల్ని ప్రారంభించిన రోజే ఈ రకమైన నిర్భందాన్ని అమలు జరుపడం ఈ ప్రభుత్వ నిరంకుశ స్వభావానికి అద్దం పడుతున్నదని ఆరోపించారు.

LEAVE A RESPONSE