Suryaa.co.in

Andhra Pradesh

ఈ పాపం నీది కాదా?

-అంబేద్కర్‌ వారసుడివి అయితే… కల్తీ మద్యంతో జనాలను చంపుతావా?
-కాంట్రాక్టర్లకు మీరే బినామీ అంటగా…
-నియోజకవర్గంలో హామీలు ఏమయ్యాయి?
-షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారట..ఏమైంది?
-నారాయణస్వామిపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఫైర్‌
-కాంగ్రెస్‌ వస్తే షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి అంట కదా..ఎప్పుడైనా నియోజకవర్గానికి వచ్చాడా…ప్రజల అవసరాలు తీర్చాడా? ఈయన లిక్కర్‌ బాటిల్‌ మంత్రి అంట… అందరు కాంట్రాక్టర్లకు ఈయనే బినామీ అంట… మంత్రి గారు బూమ్‌ బూమ్‌, క్యాపిటల్‌ అంట…ఈయన మళ్లీ అంబేద్కర్‌ వారసుడు అని చెప్పుకుంటాడట. అంబేద్కర్‌ వారసుడు అయితే కల్తీ మద్యం అమ్ముతా రా? కల్తీ మద్యంతో జనాలను చంపుతారా? ఈ పాపం ఈ లిక్కర్‌ మంత్రిది కాదా? అని ప్రశ్నించారు. మద్య నిషేధం అంటే ప్రభుత్వం మద్యం అమ్మడ మా? అని అడిగారు. నియోజకవర్గంలో హామీలు అయినా నెరవేర్చారా? మొత్తం మాఫియా…మట్టి మాఫియా…ఇసుక మాఫియా అంటున్నారని విమర్శించారు. షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారట…ఏమైంది అని ప్రశ్నించారు.

ఐదేళ్లు గాడిదలు కాశావా? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?
ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు. ఐదు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువులు రెండిరతలు పెంచారు. బటన్‌ నొక్కడం అంటే ఇచ్చి తీసుకోవడం ఆన్న మాట. ఐదేళ్లలో జగన్‌ పాలనలో ఒరిగింది ఏమైనా ఉందా ? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. ఐదేళ్లలో ఉద్యోగాలు ఇచ్చిన మాటే లేదు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2.32 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 23 వేల పోస్టులలో మెగా డీఎస్సీ అన్నారు. ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశావా? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? నాలుగున్నరేళ్లు కుంభకర్ణ లెక్క నిద్రపోయారు. ఇప్పుడు లేచారు..హడావిడి చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే 6 వేలతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియదు. వ్యవసాయానికి ఆదరణ లేక రైతులు అప్పుల పాలయ్యారు. పంట నష్ట పరిహారం లేదు..గిట్టుబాటు ధర లేదని ధ్వజమెత్తారు.

షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం
కాంగ్రెస్‌ అధికారంలో వస్తే రాష్ట్రంలో మూతపడిన చెక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, చెరుకు సాగుకు పెద్దపీట వేస్తామని వివరించారు. రైతులకు 2 లక్షల వరకు రుణాలు మాఫీ, వృద్ధులకు రూ.4 వేలు పెన్షన్‌, వికలాంగులకు 6 వేలు, మహిళలకు ఏడాదికి లక్ష సాయం, ఇళ్లు లేని కుటుంబానికి 5 లక్షలతో ఇళ్ల నిర్మాణం అమలు చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE