Suryaa.co.in

Features

మంచి ఆహార అలవాట్లు పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత కాదా ?

ఆకలేస్తే అన్నం తినడం లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం, దాహమేస్తే కూల్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకున్న ప్రజలకు ఏమి తింటున్నాము ఏమి తాగుతున్నాము అన్న సోయ లేకుండా పోయింది. అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేనిపోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్న ఎందుకు అన్నాన్ని తినడం అంటే, చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా.

మన తల్లిదండ్రులు మనకు అన్నం తినడమే నేర్పించారు. తృణధాన్యాలు తినడం నేర్పించలేదు. అందుకే అన్నం తప్పించి ఇంకో తిండి తెలియని బతుకులు మనవి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు అన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు.

డాక్టర్లు కూడా ఆరోగ్యంగా బతకాలంటే తృణ ధాన్యాలను తినాలంటూ సూచిస్తున్నారు. మన పూర్వికులు చిరు ధాన్యాలను తిని బతికినవాళ్లే. మనమే అన్నం తిని బతుకుతున్నాం, అనారోగ్యానికి గురవుతున్నాం. మన తాతలు, ముత్తాతలు చిరుధాన్యాలను తిన్నారు కాబట్టే వందేళ్లు సంతోషంగా బతికారు. మనం తినడం లేదు కాబట్టి ముప్పై ఏళ్లకు బీపీ, షుగర్, మధుమేహం, క్యాన్సర్ కొని తెచ్చుకుంటున్నారు.

జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు వీటిని తృణ ధాన్యాలు అంటారు. వీటన్నింటిలో ఉండే పోషకాలు, క్యాల్షియం, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు మనిషికి వచ్చే రకరకాల లైఫ్ స్టైల్ రోగాలను రానివ్వవు. ప్రతి రోజు చిరుధాన్యాలు తినడం అలవాటు చేసుకుంటే రోగాలను దూరం చేసినవారవుతారు. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, రక్తస్రావం వంటి సమస్యలతో బాధ పడుతున్న వాళ్ళు తృణ ధాన్యాలు తింటే వాళ్లకు ఆ సమస్యలు తీరుతాయి. అందుకే ఇప్పుడు చిరు ధాన్యాలకు మార్కెట్ మంచి గిరాకీ ఉంది.

మిల్లెట్‌లు మానవులు పండించే తొలి పంటలలో ఒకటి, పోషకాల యొక్క ముఖ్యమైన మూలం వాతావరణ మార్పు ఆహార లభ్యత ఎలా ప్రభావితం చేస్తుందో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తృణధాన్యాలు ప్రపంచ ఉద్యమం ఆహార భద్రత దిశలో ఒక ముఖ్యమైన ముందడుగు, చిరుధాన్యాలు సులభంగా పెరగగలవని, వాతావరణాన్ని కరువును తట్టుకోగలవు. మిల్లెట్లు సమతుల్య పోషకాహారం యొక్క గొప్ప మూలం, సహజ వ్యవసాయ విధానాలకు అనుగుణంగా తక్కువ నీరు అవసరం. మిల్లెట్స్ పండించడం రైతులకు, సమాజానికి అలాగే వాతావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుంది .

వాస్తవానికి తృణ ధాన్యాల వినియోగం గత పది సంవత్సరాలుగా దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఓరిస్సా, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు ఆహారంగా ఉండేది. పది సంవత్సరాల క్రిందట 8.6 లక్షల హెక్టార్లలో తృణ ధాన్యాలు పండించే వారు, ఇప్పుడు కేవలం 1.86 లక్షల హెక్టార్లకు పరిమితమయింది. ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్ అలాగే రాష్ట్రాల మిల్లెట్ బోర్డులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారు.

దేశంలో రెండు విడతలుగా 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న రైతులకు ఎంతమేరకు ఉపయోగపడుతుందో తెలుస్తూనే ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క భూసార పరీక్షా చేపట్టని రాష్ట్రాలు ఉన్నాయి. చాల రాష్ట్రాల్లో సేంద్రియ కర్బనం పూర్తిగా తగ్గింది. జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ వారు స్థానిక సాగు భూములు తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలు సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందని సూచనలు ఇస్తున్నారు.

ఈ మధ్య వారు ప్రచురించిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వం, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7 కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరించారు. భూమిని నమ్ముకోవడం అంటే, పంట భూములు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడం. భూమి ఆరోగ్యానికి సేంద్రియ కర్బనం ఒక ముఖ్య సూచిక. మన భూముల్లో 0.5 % కన్నా సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడం కష్టసాధ్యమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే, రసాయనిక ఎరువులకు పూర్తిగా స్వస్తి పలికి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్న కొందరు రైతులు మాత్రం 2.0% వరకు పెంచుకోవడం సాధ్యమేనని నిరూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, స్వల్పకాలంలోనే సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే అనేక మార్గాలున్నాయని సూచిస్తున్నారు. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉండాలని రైతులు భయంకరమైన గడ్డి మందుల వినియోగం చేపడుతున్నారు.

కలుపు మొక్కల నివారణకు కూలీలు దొరకడం కష్టసాధ్యం అలాగే దొరికిన ఎక్కువ కూలీ అడగడం తో గిట్టుబాటు కాక సంవత్సరం వరకు కలుపు రాకుండా ఉండడానికి గడ్డి, తుంగ, పార్థీనియం, పూల గడ్డి, గారభ తదితర నివారణకు ప్రత్యామ్న్యాయం లేక భూమి నిస్సారమైన పర్వాలేదు బాగు పడతానేమో అనే మూర్ఖపు పట్టుదలతో రైతులు ఉన్నారు. భూమిపై ఆహార వైవిధ్యం యొక్క ఆవశ్యకతను, పౌష్టికాహార లోపం గురించి నిరంతరం చెబుతున్న ఆహార శాస్త్రవేత్తల హెచ్చరికలను సలహాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది.

వ్యవసాయం ఏక పంటగా మారితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆహార వైవిధ్యాన్ని పెంచడానికి తృణధాన్యాలు మంచి మార్గమని సూచించినా ప్రయోజనం లేదు. రైతులకు ప్రోత్సాహకాలు అలాగే మంచి విత్తనం కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారు. ప్రజలకు, వినియోగదారులకు సమతుల్య పోషణ గొప్ప మూలం. సాగు దారులకు భూమి సారవంతమవుతుంది అలాగే మన పర్యావరణానికి ప్రయోజనం చేకూరుస్తాయి , ఎందుకంటే వాటికి తక్కువ నీరు అవసరం, సహజ వ్యవసాయ విధానాలకు అనుకూలంగా ఉంటుంది.

వ్యవసాయం ఏక పంట గా మారితే, అది మన ఆరోగ్యం మన భూముల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. భారతదేశం 170 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి మిల్లెట్లు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలి , ఆసియాలో ఉత్పత్తి చేయబడిన మిల్లెట్లు అగ్రగామిగా నిలువడానికి కృషి చేయాలి. ఇది దాదాపు 131 దేశాలలో సాగవుతున్నాయి.

ఆసియా, ఆఫ్రికాలో సుమారు 60 కోట్ల మందికి సాంప్రదాయ ఆహారం తృణధాన్యాలే . ఇంత గొప్ప మేలు కలిగిన చిరుధాన్యాల సాగు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సరైన విత్తనం ఇవ్వడం లేదు, రైతులు విత్తనం అందుబాటులో లేక సుదూర ప్రాంతాల నుండి తెచ్చుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు, రైతు వేదికలల్లో తృణధాన్యాలు దొరకడం లేదు. మిల్లెట్స్ సంవత్సరం సురక్షితమైన, స్థిరమైన ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా సామూహిక ఉద్యమాన్ని ప్రారంభించాలని పౌర సమాజం అలాగే ప్రభుత్వం ఆకాంక్షించాలి.

                                                         – డా. యం. సురేష్ బాబు
                                                       అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక

 

LEAVE A RESPONSE