ఇది బడాయి బడ్జెట్
ఇది గొప్పల బడ్జెట్
– తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి
అరకొరగా ప్రణాళిక వ్యయం – కేవలం రూ.33 వేల కోట్లు … ఇక అభివృద్ధి ఎలా సాధ్యం .. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం … ప్రగతి పట్టని, లక్ష్యం లేని బడ్జెట్ … సరైన దిశా నిర్దేశం లేని బడ్జెట్ … హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ … రాష్ట్రాన్ని దివాళా తీయించే బడ్జెట్.
బడ్జెట్ నిండా అప్పులే కనిపించాయి … రాష్ట్ర అప్పులను మరింత పెంచే బడ్జెట్ ఇది. అభివృద్ధి మచ్చుకైనా కానరాలేదు. బడ్జెట్ ప్రసంగాలు విజనరీగా ఉండాలి. కానీ రాజకీయ ప్రసంగానికే బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనం. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నట్టు, అదే కాంగ్రెస్ సాధించిన పెద్ద ఘనత అన్నట్టుగా బడ్జెటులో చెప్పుకోవడం విడ్డూరం.
బడ్జెట్ లో రూ.62 వేల కోట్ల అప్పులు చేస్తున్నట్టు గొప్పగా చెప్పుకున్నారు. ఇంత భారీగా అప్పు చేస్తున్న ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది కేవలం రూ.33 వేల కోట్లే. మరి దీన్ని అప్పుల బడ్జెటు అనకుండా అభివృద్ధి బడ్జెట్ అంటారా?
బడ్జెటులో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. నెలకు నాలుగు వేలు ఇస్తామని కాంగ్రెస్ యూత్ డిక్లరేషనులో ప్రకటించింది. మరి ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి భృతి ఇవ్వాల్సి ఉండే. తెలంగాణలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. వారికి నెలకు నాలుగు వేల చొప్పున నెలకు 14 వందల కోట్లు అవసరం.
మరి ఆ నిధులేవీ బడ్జెటులో పెట్టలేదు. అంటే ఈ పధకాన్ని కాంగ్రెస్ ఎత్తేసినట్టేనా ? జనవరి నెల నుంచి నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఈ ఏడు నెలల బాకీలు కూడా చెల్లించాలి. అంటే నిరుద్యోగ భృతికి సుమారు రూ.10 వేల కోట్లు ఈ బడ్జెటులో కేటాయించాలి.
తెలంగాణలో పేద మహిళల కోసం నెలకు రెండున్నర వేలు ఆర్ధిక సహాయం చేయడానికి మహాలక్ష్మీ పధకం కింద ఏటా 14 వేల కోట్లు అవసరమని అంచనా. కర్ణాటకలో గృహలక్ష్మీ స్కీమ్ కోసం 17,500 కోట్లు కేటాయించారు. మరి ఈ మహాలక్ష్మీ పధకానికి నిధులేవీ. బడ్జెటు ప్రసంగంలో ఈ పధకం ఊసే లేదు.
చేయూత పధకం కింద నెలకు నాలుగు వేల చొప్పున 44 లక్షల మంది పెన్షనుదారులకు ఏటా 21 వేల 120 కోట్లు కావాలని గణాంకాలు చెబుతున్నాయి. అయితే పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించింది రూ.29,816 కోట్లు. ఈ నిధులు ఇటు గ్రామాల అభివృద్ధికి, సామాజిక పెన్షన్లు కలిపి కేటాయించినవి. పెన్షన్ల మొత్తాన్ని పెంచితే, కేటాయించిన నిధులతో గ్రామీణభివృద్ధి సాధ్యపడదు. అంటే ఈ ఏడాది కూడా పెన్షన్ల పెంపు లేనట్టే.
సాగునీటి ప్రాజెక్టులకు ఓట్ ఆన్ అకౌంట్ ( అపుడు కేటాయించిన నిధులు రూ. 28 వేల కోట్లు) కంటే ఇపుడు పూర్తి స్ధాయి బడ్జెటులో కోత పడింది. ఇపుడు కేటాయించింది రూ.22,301 కోట్లు. ఆరు నెలలకే ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చింది. ఇరిగేషన్ కు ప్రాధాన్యత తగ్గింది.
మరి అరకొర నిధులు ఇరిగేషన్ కు ఏమాత్రం సరిపోవు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ కోసం చేసిన అప్పులకు చెల్లించాల్సిన కిస్తీలకే ఈ నిధులు సరిపోతాయేమో.
2024-25 బడ్జెట్ అంచనాలు … మొత్తం వ్యయం రూ.2,91,159 కోట్లు … బడ్జెటులో రాష్ట్ర ఆదాయాన్ని రూ, రెండు లక్షల 21 వేలకు పైగా చూపారు. గత ఏడాది వచ్చిన ఆదాయం రూ. లక్షా 69 వేల కోట్లు మాత్రమే. అంటే రూ.52 వేల కోట్ల అదనపు ఆదాయం ఎలా సాధ్యమో ఆర్ధిక మంత్రి చెప్పాలి.
ఇది కాకుండా రూ.62 వేల కోట్లు అప్పుగా తెస్తున్నారు. అంటే పెరిగే ఆదాయం, వచ్చే అప్పులు అన్నీ కలిపితే రాష్ట్ర వాస్తవిక బడ్జెట్ రెండు లక్షల 40 వేలకు మించదు. అంటే రూ.50 వేల కోట్ల మేరకు బడ్జెట్లో కోత విధించక తప్పదు. అంటే కేటాయింపులు బారెడు ఖర్చు మూరెడుగా బడ్జెట్ ఉండనుంది. దీన్ని బట్టి ఇది బోగస్ బడ్జెట్, అవాస్తవిక బడ్జెట్, అంకెల గారడి బడ్జెట్ అనక తప్పదు.