-హోంమంత్రి సుచరిత
చారిత్రక కట్టడమైన జిన్నాటవర్ సాక్షిగా గుంటూరులో జాతీయతా భావం పెల్లుబికింది. దేశభక్తి ఉప్పొంగింది. త్రివర్ణ శోభితమైన జిన్నాటవర్ వద్ద మువ్వన్నెల జాతీయ జెండా ముచ్చటగా రెపరెపలాడింది. “హిందూ-ముస్లిం భాయీ భాయీ” అన్న నినాదంతో గుంటూరు మార్మోగింది.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇటీవల కొందరు బీజేపీ నేతలు గుంటూరులో జిన్నాటవర్ పేరు మార్చాలనీ… లేదంటే దాన్ని కూల్చేస్తామనీ… ప్రకటించిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో గుంటూరు నగరపాలకసంస్థ అధికారులు తొలుత జిన్నాటవర్ చుట్టూ ఫెన్సింగ్ వేసి తర్వాత టవర్ మొత్తానికి జాతీయ జెండా రంగులు వేయించారు. అందులో భాగంగా జిన్నాటవర్ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన దిమ్మెపై ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం ఎగురవేశారు.
ఈ సందర్భంగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో మేకతోటి సుచరిత మాట్లాడుతూ, గుంటూరులో మతతత్వ శక్తులు మొదలుపెట్టిన కుట్రపూరిత ఆటలకు జాతీయతా భావంతో చక్కని ముగింపు ఇచ్చామని తెలిపారు. ఇదొక చారిత్రక ఘటనగా ఆమె వర్ణించారు. ఎందరో వీరుల త్యాగఫలమైన స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తూ కేవలం రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం సిగ్గుచేటని విమర్శించారు.
అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల్లో జాతీయతా భావాల పెంపుకు కృషి చేయాలనీ, కానీ దురదృష్టవశాత్తు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అందుకు విరుద్ధంగా ప్రజల్లో మత విద్వేషాలు నింపేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ కులమతాలకు అతీతంగా పరిపాలన చేస్తూ ప్రజలందరి మనన్నలు పొందుతున్నారని తెలిపారు.
శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, దేశం యావత్తూ గుంటూరు వైపే తలెత్తి చూసేలా జిన్నాటవర్ వేదికగా వెల్లివిరిసిన మతసామరస్యం మన దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రతిరూపమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు కళ్ళుంటే ఈ ఉప్పొంగిన దేశభక్తిని చూడాలనీ… చెవులుంటే ఇక్కడ మార్మోగుతున్న జాతీయతా భావ నినాదాలు వినాలనీ… ఆయన హితవు పలికారు. మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే… దానికి సమాధానంగా గుంటూరు ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో వారు గమనించాలని చురకలంటించారు.
అయినా దేశభక్తి, జాతీయత గురించి మీరు చెప్తే తెలుసుకునే స్థితిలో తాము కానీ దేశ ప్రజలు కానీ లేమని లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతి గాంచడమే కాక జాతిపితగా యావత్ భారతీయులచే కీర్తించబడుతున్న పూజ్య గాంధీజీని కిరాతకంగా హత్య చేసిన గాడ్సేను పూజించే బీజేపీ నేతలకు అసలు దేశభక్తి గురించి మాట్లాడే నైతికత లేదని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు అన్ని మతాల వారు కలిసి మెలిసి పోరాడారనీ… ఇప్పుడు కూడా అలానే కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నామనీ తెలిపారు.ఈ సమైక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జిన్నాటవర్ వద్ద జాతీయ జెండా ఎగరేయడం బీజేపీ నేతలకు చెంపపెట్టుగా అప్పిరెడ్డి అభివర్ణించారు.
ఇంకా జిన్నాటవర్ పేరు మార్చాల్సిందే… లేదంటే కూలుస్తామనీ… అడ్డగోలు వాదనలు చేసే గాడ్సే వారసులు తొలుత మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వమే బ్రిటీష్ వారు కట్టిన అనేక తాగు, సాగునీటి డ్యాంలు, క్రైస్తవ మిషనరీ సంస్థలు కట్టించిన ఆసుపత్రులు, విద్యాసంస్థలను ఏం చేయాలనుకుంటారో చెప్పాలని లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. సర్ ఆర్ధర్ కాటన్ కట్టారు కాబట్టి దవళేశ్వరం డ్యామ్‌ను, విదేశీ సంస్థలు కట్టించాయి కాబట్టి సెయింట్ జోసఫ్ ఆసుపత్రి, విద్యా సంస్థలను కూల్చేయాలా అని ఆయన వారిని సూటిగా ప్రశ్నించారు. పార్టీ మేనిఫెస్టోనే పవిత్ర ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించే ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో తమకు ప్రజా ప్రయోజనాలు తప్ప కులమతాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మతోన్మాదుల ఆటలు సాగనివ్వబోమనీ, మైనారిటీల హక్కులు, మనోభావాలు కాపాడడంలో ముందుంటామనీ ఆయన తేల్చి చెప్పారు. జగన్ ఆదేశం, పార్టీ నిర్ణయం మేరకు జిన్నాటవర్ పేరు మార్చే ప్రసక్తే లేదని మరోమారు లేళ్ళ అప్పిరెడ్డి పునరుద్ఘాటించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, రాజకీయ ఎదుగుదలకు మతాన్ని అడ్డుపెట్టుకునేవారి ఆటలు ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వకూడదన్నారు. జిన్నాటవర్ గురించి మాట్లాడే బీజేపీ నేతలు దానికి ముందుగా అద్వానీ స్వయంగా పాకిస్తాన్ వెళ్ళి జిన్నా దేశభక్తుడు అని కొనియాడిన సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. జిన్నా స్వాతంత్య్ర సమరయోధుడే కాక గాంధీజీ, తిలక్ తరుపున న్యాయపోరాటం చేసిన ప్రముఖ న్యాయవాదిగా కూడా దేశానికి అనేక సేవలు అందించారని తెలిపారు.
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, గుంటూరులో స్వాతంత్య్రానికి పూర్వం కట్టిన జిన్నాటవర్ మన ప్రాంత వాసుల ప్రేమాభిమానాలను నిదర్శనమని తెలిపారు. ప్రపంచంలోనే లౌకికవాదులుగా మన భారతీయులకు ఉన్న ప్రత్యేక గుర్తింపును చెడగొట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయనీ, మనం చైతన్యవంతులుగా వాటిని ఎప్పటికప్పుడు సంఘటితమై తిప్పికొడుతూ ఉండాలనీ ఆయన కోరారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం ఒక్క మన దేశానికే సాధ్యమని స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలు రాజకీయంగా తమ ఉనికిని చాటుకునేందుకు మన లౌకికవాదానికి వక్రభాష్యాలు చెప్పడం హేయమని విమర్శించారు. నగర నడిబొడ్డున ఈ రోజున జాతీయ జెండా ఎగరేయడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ, జిన్నాటవర్ సాక్షిగా భారతీయుల ఐకమత్యాన్ని చాటిచెప్పిన ఘనత మన గుంటూరు వాసులకే దక్కుతుందన్నారు. ఈ దేశం ఏ ఒక్క కులానికో లేక మతానికో సొంతం కాదనీ… అందరిదీ అని ఎలుగెత్తి చాటారు.
గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ, చారిత్రక జిన్నాటవర్‌పై జాతీయ జెండా ఎగిరిన ఈ రోజు గుంటూరు చరిత్రలోనే చెరిగిపోని శుభదినమని తెలిపారు. జిన్నాటవర్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూసిన బీజేపీ నేతల దుష్ట పన్నాగం సమాజానికి మంచిది కాదన్న ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తామంతా కులమతాలకు అతీతంగా భరతమాత ముద్దు బిడ్డలం – భారతీయులం అని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ జెండా ఎగురవేయడానికి ముందుగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. చివరగా శాంతి కపోతాలను ఎగరేసి సమతామమతల భావనలతో ఘనంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, ప్రభుత్వ సలహాదారులు (మైనారిటీ సంక్షేమం) ఎస్‌ఎమ్ జియావుద్దీన్, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ లాలుపురం రాము, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, షేక్ సజీల, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, జిల్లా గ్రంధాలయసంస్థ ఛైర్మన్ బత్తుల దేవానంద్, పలు కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.