Suryaa.co.in

Andhra Pradesh

ఇది మానవత్వం లేని ప్రభుత్వం

– ప్రజల గురించి అస్సలు పట్టింపులేదు
– గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం
– జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది
– ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాల సందర్శన
– మాధవపురం, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేటలో పర్యటించిన వైయస్‌ జగన్
– కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ పర్యటన

పిఠాపురం: ఏలేరు రిజర్వాయర్‌ దగ్గర పరిస్థితి చూస్తే, విజయవాడ గుర్తుకొస్తోంది. ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేదు. తుపాన్‌పై ముందే సమాచారం ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం రివ్యూ నిర్వహించలేదు. కలెక్టర్లతో మాట్లాడలేదు. ప్రత్యేక అధికారులను జిల్లాలకు పంపించాలి. కానీ, సీఎం చంద్రబాబు ఆ పని చేయలేదు. సీఎస్‌ కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు.

సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసి ఉంటే,స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించి, ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని, ముందు జాగ్రత్తలు చేపట్టే వారు. కానీ, అవేమీ చేయలేదు. అన్నీ గాలికొదిలేశారు. నేను చంద్రబాబును అడుగుతున్నాను. ఏలేరు రిజర్వాయర్‌ సామర్థ్యం దాదాపు 23 టీఎంసీలు. సెప్టెంబరు 1న ఏలేరు రిజర్వాయర్‌కు 9950 క్యూసెక్స్‌ ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, ఆ మొత్తం కిందకు వదలాలి. ఎందుకంటే దిగువన కాలువ సామర్థ్యం 14 వేల క్యూసెక్స్‌.

అలా అప్పుడు నీరు వదిలి ఉంటే, ఆ కాలువ కూడా పొంగకుండా ఉండేది. కానీ ప్రభుత్వం ఏం చేసింది. కేవలం 300 క్యూసెక్స్‌ మాత్రమే వదిలిపెట్టింది. సెప్టెంబరు 4న 5400 క్యూసెక్స్‌ వస్తే, బయటకు పంపింది కేవలం 300 క్యూసెక్స్‌ మాత్రమే. అయినా రిజర్వాయర్‌లో పరిస్థితిని చూసి, ఏ మాత్రం ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేదు. ఫ్లడ్‌ ఫ్లో కుషన్‌ ఏర్పాటు చేయలేదు. పైనుంచి నీరొస్తున్నా నిర్లక్ష్యం చూపారు. కేవలం 300 క్యూసెక్స్‌ మాత్రమే వదిలారు.

దీంతో 9వ తేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్‌ పూర్తిగా నిండింది. దీంతో కిందకు 21500 క్యూసెక్ప్‌ వదిలారు. 10వ తేదీన 25270 క్యూసెక్స్‌ వదిలారు. అంటే, కాలువ సామర్ధ్యాన్ని మించి నీరు వదిలారు. ఇవన్నీ వాస్తవాలు. ఇది మానవత్వం లేని ప్రభుత్వం. ప్రజల గురించి అస్సలు పట్టింపులేదు. అబద్దాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్‌కు తమ్ముడు అవుతాడు. పచ్చి అబద్ధాలు చెబుతాడు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా దిట్ట. ఇక ఆయనకు నిత్యం వంత పాడే మీడియా ఉంది.

ఒకవైపు ఈ వాస్తవాలు ఇలా ఉంటే.. ఏలేరు ఆధునికీకరణ పైన చంద్రబాబు అబద్దాలు చెప్పారు. ఏ కెనాల్‌ ఆధునికీకరణ అయినా, అందులో నీళ్లు లేనప్పుడు, క్రాప్‌ హాలీడే ప్రకటిస్తే తప్ప, అది సాధ్యం కాదు. తొలుత ఏలేరు కాలువ ఆధునికీకరణను 2008లో వైయస్సార్‌ చేపట్టారు. రూ.38 కోట్లతో పనులు చేపట్టారు. ఆ తర్వాత ఎవరూ ఆ పని చేయలేదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక, అంచనాలు పెంచారు తప్ప, పనులు మాత్రం చేయలేదు.

నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు కూడా పెద్దగా లేవు. 2015లో అంచనాలు రూ.295 కోట్లకు పెంచినా, పనులు పూర్తి చేయలేదు. మా ప్రభుత్వం వచ్చాక, వరసగా వర్షాలు కురవడంతో, కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 4 ఏళ్లు, వర్షాలు లేవు. అయినా పనులు ఎందుకు చేయలేదు?

ప్రజలను ఇబ్బందుల పాలైనా, ఇప్పుడు కూడా చంద్రబాబు మమ్మల్ని వేలెత్తి చూపుతున్నాడు. ఎక్కడ, ఏం జరిగినా.. దానికి కారణం జగన్‌ అంటున్నాడు. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా, ప్రతి దానికి మమ్మల్నే నిందిస్తున్నాడు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థనలనూ నాశనం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. పంటల బీమా ప్రీమియమ్‌ కూడా కట్టడం లేదు.

వ్యవసాయ సీజన్‌ మొదలైంది. వారికి అందాల్సిన సున్నా వడ్డీ పంట రుణాలు ఏమయ్యాయి? పెట్టుబడి సాయం రైతు భరోసా ఏమైంది? రూ.20 వేలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఆర్బీకేలు ఉండేవి. ఇన్సూరెన్స్‌ ఉండేది. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఉండేది.

రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. గతంలో రైతులకు ఎంత వచ్చేది? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే కనుక జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది. సీజన్‌ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లం.

గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో అది కేవలం రూ.15 వేలు మాత్రమే. ప్రీమియమ్‌ కట్టి ఉండే వాళ్లం కాబట్టి రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు బీమా పరిహారం వచ్చేది. దాంతో పాటు, పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ కింద దాదాపు రూ.5 వేల వరకు.. అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అంది ఉండేది.

కానీ, ఈ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడు. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నాడు. కానీ ఎలా? ఈ–క్రాపింగ్‌ లేదు. ఆర్బీకేలు లేవు. వ్యవస్థ లేదు. ఇంకా ఇన్సూరెన్స్‌ గురించి చెప్పడం లేదు. భరోసా గురించి మాట్లాడడు. ఇన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా, చంద్రబాబు మాట్లాడడు.

పవన్ కు పాపం ఏమీ తెలియదు
వరద బాధితులను ఆదుకోకుండా ప్రభుత్వమంతా ఫొటోలకే పరిమితమైంది. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్.. కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఏమీ తెలియదు. కానీ చంద్రబాబు పవన్ను మించిపోయాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్’ అని విమర్శించారు.

LEAVE A RESPONSE