– బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ..
– నిందితులు ఎవరైనా ఏ కులానికి చెందిన వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. …
– నియోజకవర్గ కాపు నాయకులు
కందుకూరు: గుడ్లూరు లో జరిగిన దుర్ఘటనను కొంతమంది నాయకులు కులాలకు ఆపాదించడం సిగ్గుచేటని కందుకూరు కాపు నాయకులు మండిపడ్డారు.n కందుకూరు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఈరోజు అనగా శనివారం సాయంత్రం నియోజకవర్గ కాపు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
గుడ్లూరులో జరిగిన దుర్ఘటన అందర్నీ బాధించిందని, బాధిత కుటుంబానికి అందరూ మద్దతు తెలియజేస్తుంటే కొంతమంది నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అలాంటి వాళ్ళని ప్రజలందరూ గమనిస్తున్నారని విమర్శించారు..
కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక కులానికి చెందిన వ్యక్తిగా ఆపాదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా శిక్షించమనే మనస్తత్వం శాసనసభ్యులు వారిదని కాపు నాయకులు తెలిపారు..
ఈ దుర్ఘటన జరిగిన వెంటనే స్థానిక శాసనసభ్యుల వారు పోలీసు అధికారులకు నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని వారికి సూచించారని, దానికి అనుగుణంగా చట్టం తనపని తను చేసుకుపోతూ పోలీసు వారు నిందితులను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారని వారు తెలిపారు..
కానీ కొంతమంది తమ ఉనికిని చాటుకునేందుకు దుర్ఘటనను రెండు పార్టీలు మరియు రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు…
మీరు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టిడిపి జనసేన బంధాన్ని విడతీయలేరని వారు ముక్తకంఠంతో తెలిపారు..
ప్రశాంతంగా ఉన్న కందుకూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల్లో అలజడి సృష్టించి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నారని, ఇది కులాలకు లేదా పార్టీలకు సంబంధించిన విషయం కాదని కేవలం వారి వ్యక్తిగత కారణాలతో ఈ దుర్ఘటన జరిగిందని వారు పదేపదే నొక్కి చెప్పారు.
ఈ దుర్ఘటనలో చనిపోయిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు టిడిపి కార్యకర్త అని, అతను తెలుగుదేశం పార్టీలో తీసుకున్న సభ్యత్వాన్ని మీడియాకు చూపించారు.. ఇద్దరి మధ్య గొడవను రాజకీయం చేస్తూ కొంత మంది పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని వారికి భవిష్యత్తులో వారి కులానికి చెందిన వారు మరియు ప్రజలు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు..
శుక్రవారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చూస్తానని, మరియు చనిపోయిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్యకు ఏదైనా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు…
కందుకూరులో శాంతి భద్రతల విషయంలో ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా ఏ కులానికి చెందిన వారైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోమని స్థానిక శాసనసభ్యుల వారు పోలీసులు వారికి తెలియజేసి ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో టిడిపి జనసేన మైత్రి బంధాన్ని విడగొట్టడానికి కొంతమంది కుల రాజకీయాలు చేస్తున్నారని, వారు ఎంత ప్రయత్నించినా అది జరగదని తెలుసుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చాలా ముక్కు సూటిగా వ్యవహరిస్తున్నారని కాపు నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కాపు నేతలు హాజరయ్యారు…