జగన్ జమానాలో దళిత గిరిజనులు బతకడం కష్టమే

– దళితులు గిరిజనులే లక్ష్యంగా జగన్ మూక దాడులు
– భయభ్రాంతులను చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర
-దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే చోద్యం చూస్తారా?
– వైసిపి గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి
– దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్

దర్శి : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది వైసిపి గూండాల ఆలోచనగా కన్పిస్తోందని ఆరోపించారు.

ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్దంగా ప్రత్తిపాడులో వైసిపి అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటుచేశారని, దీనిని ప్రశ్నించేందుకు వెళ్లిన టిడిపి అభ్యర్థి, మాజీ సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన బూర్ల రామాంజనేయులు వాహనంపై వైసిపి గూండాలు స్వైరవిహారం చేసి ఆయనపై దాడికి ప్రయత్నించారని అన్నారు.

బహిరంగ సభకు అడుగడుగునా ఇబ్బందులు
ఈ నెల 17న చిలకలూరి పేటలో ఈ రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నిర్మించే విధంగా గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుస్తున్న దుర్మార్గమైన చీకటి పాలనను అంతమొందించాలని దానికి ప్రజలంతా కంకణదారులు కావాలని అనేటువంటి మహా సంకల్పంతోనే టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ప్రజానికానికి ఓక దిశా నిర్దేశం పేరుతో ‘‘ ప్రజా గళం’’ ఏర్పాటు చేశారన్నారు.

ప్రజల గొంతుక, ప్రజల అవసరాలు, ప్రజల ఆలోచన అన్నీ చర్చకు వచ్చే విధంగా సభను నిర్వహించడం జరిగిందని, ఆ సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా మూడు పార్టీల అగ్ర నాయకులు కలిసి ప్రజలకు దిశా నిర్దేశం చేశారన్నారు. దేశ ప్రధాని బహిరంగ సభకు వస్తే అడుగడుగునా ఇబ్బందులు కలిగించారని, ఇది ఒక కుట్రపూరితమైన చర్యలుగా కన్పిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ కి పోలీసులు ఉన్నారా? ఉంటే వారు పోలీసు విధులు నిర్వహిస్తున్నారా?

300 ఎకరాల స్థలంలో సభను ఏర్పాటు చేసి 100 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి, లక్షలాది మంది ప్రజలు వచ్చినా సైకర్యాలు సమర్థవంతంగా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తే పేరుకు మాత్రమే పోలీసు యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు టీవీలో ఊదరగొట్టారు తప్ప ఆచరణలోకి వచ్చినప్పుడు సభను జయప్రదం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ఈ రాష్ట్ర పోలీసు యంత్రాగం చేతగానితనంవల్ల విఫలమయ్యాందా లేక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం సభను విఫలం కలిగించిందా? గత ఐదు సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా, ప్రతిపక్ష పార్టీలపైన దమనకాండ చేస్తున్నారని విమర్శించారు.

పోలీసులు నిజాయితీగా విధులు నిర్వర్తించకుండా జగన్మోహన్ రెడ్డి కింద బానిసలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీలు ఎన్ని దౌర్జన్యాలు, అరాచకాలు చేసినా కనీసం వాళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకోరని, ఫలితంగా ఈ ప్రభుత్వం నేరస్తులకు, నేరపూరిత ఆలోచనలు కలిగిన వారికి అడ్డాగా మారిందన్నారు.

Leave a Reply