సీఎం బటన్ నొక్కి 20 రోజులవుతున్నా.. డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ కాని నగదు

– సీఎం సభలకు బలవంతంగా డ్వాక్రా మహిళల తరలింపు
– సభలకు రాకుంటే పథకాలు కట్ చేస్తామని బెదిరింపులు
– బెదిరించి మరీ ప్రభుత్వ సభలకు, ఆసరా వారోత్సవాలకు తరలించడం నిరంకుశం కాదా?
– తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత బహిరంగ లేఖ

11.02.2024
బహిరంగ లేఖ
శ్రీ కేఎస్ జవహన్ రెడ్డి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,
అమరావతి

విషయం: బటన్ నొక్కి 20 రోజులవుతున్నా జమ కాని ఆసరా 4వ విడత సాయం, ఆసరా సొమ్ముపై ప్రశ్నిస్తే కుంటిసాకులు, సీఎం సభలకు బలవంతంగా డ్వాక్రా మహిళల తరలింపు, సభలకు రాకుంటే పథకాలు కట్ చేస్తామని బెదిరింపులు వంటి అంశాల గురించి ….

నాలుగో విడత ఆసరా నగదు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత నెల 23వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభలో ప్రకటించారు.

సీఎం బటన్ నొక్కి 20 రోజులవుతున్నా నేటికీ డ్వాక్రా మహిళల ఖాతాల్లో నగదు జమ కాని విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆసరా ఉత్సవాలు జాతర మాదిరి ఊరూరా వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల గ్రూపులకు చెక్కులు కూడా పంచారు. కానీ నగదు పడలేదు. డబ్బులు ఎందుకు పడలేదంటే అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పకపోగా కొన్నిచోట్ల బెదిరింపులకు దిగుతున్నారు. మహిళలందరికీ రుణమాఫీ కింద వైఎస్సాఆర్ ఆసరా పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాలకు లబ్ధి శూన్యం.

గత టీడీపీ హయాంలో డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా కోటిమంది మహిళలు ఒక్కొక్కరు సమానంగా రూ. 20 వేలు లబ్ధిపొందారు. జగన్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. పైగా నేడు రాష్ట్రంలో కోటీ 14 లక్షలమంది డ్వాక్రా మహిళలుంటే 79 లక్షలకే ఆసరా కుదించారు. ఈ రకంగా 35 లక్షలమందికి మొండిచేయి చూపారు. మరోవైపు డ్వాక్రా మహిళలను ఆసరా వారోత్సవాలకు, రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరుకుగా మార్చేశారు. జిల్లా, మండలం, ఊరు ఇలా ఎక్కడ సభలున్నా పొదుపు మహిళలను బలవంతంగా తరలిస్తున్నారు.

రామని మొండికేస్తే సంక్షేమ పథకాల్లో కోత పెడతామంటూ బెదిరింపులకు దిగడం దుర్మార్గం కాదా? సంక్షేమ ఫలాలు పొందడం ప్రజల హక్కు కాదా? బెదిరించి మరీ ప్రభుత్వ సభలకు, ఆసరా వారోత్సవాలకు తరలించడం నిరంకుశం కాదా? పైగా సభ పూర్తయ్యే వరకూ బయటకు వెళ్లకూడదంటూ పోలీసులతో బారికేడ్లు పెట్టి కట్టడి చేయడం అమానుషం. ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చే దాకా మండుటెండలో గంటల తరబడి ఎండలో నిలబడలేక ఉక్కుపోతకు గురై సొమ్మసిల్లిపడిపోతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ర్యాంపుల నిర్వహణ, జనరిక్ మెడికల్ షాపుల నిర్వహణ వంటివి డ్వాక్రా మహిళలకు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో డ్వాక్రా మహిళలను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇటు ఆసరా సాయం అందక, అటు సంక్షేమం అమలు కాక పొదుపు సంఘాల సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్వాక్రా మహిళలకు వెంటనే ఆసరా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

– ఆచంట సునీత
తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు

 

Leave a Reply