Suryaa.co.in

Andhra Pradesh

అవినీతి…అధికారం..అహంకారంతో నియంతలా మారిన జగన్

• ప్రజల జీవితాలను దౌర్జన్యంగా నిర్దేశించే పనిలో ఉన్నారు
• రాష్ట్ర రాజధానికి దారేది? దశాబ్ద కాలంగా రాజధాని లేని రాష్ట్రం చేశారు
• అమరావతే రాజధాని అని ఢిల్లీ నుంచి గుర్తు చేసే దౌర్భాగ్యం
• విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
• క్యాపిటివ్ మైన్స్ కేటాయించేలా ఉమ్మడిగా పోరాటం చేస్తాం
• జనసేన-టీడీపీలను నిండు మనసుతో గెలిపించండి
• పోలీసు వ్యవస్థను రాజీపడని ఉన్నత వ్యవస్థగా తీర్చిదిద్దుతాం
• పోటీ చేసిన అన్ని స్థానాల్లో… మద్దతు ఇచ్చిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత సీఎం పదవిపై మాట్లాడదాం
• ముఖ్యమంత్రి ఎవరూ అనేది నేను, చంద్రబాబు కలిసి మాట్లాడుకొని నిర్ణయిస్తాం
• వచ్చే ప్రభుత్వంలో జనసేన పూర్తి స్థాయి అధికారం పంచుకుంటుంది
• విశాఖపట్నం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘రాష్ట్రం విడిపోయి దశాబ్ధం అవుతోంది.. మన రాజధాని ఏది అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. అత్తారింటికి దారేది అంటే మూడు గంటల సినిమాతో కథ చెప్పవచ్చు. అయితే రాజధానికి దారేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఢిల్లీ నుంచి ఎవరో చెబితేగానీ మనకు తెలియడం లేద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. 2024లో జనసేన – తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని, ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి.. యువతకు చక్కటి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. శాంతి భద్రతలు పక్కాగా అమలు చేస్తామనీ… పోలీస్ వ్యవస్థకు పునర్ వైభవం తీసుకొచ్చి, రాజీలేని పోలీసు వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం తీరంలో ప్రతి 30 కిలోమీటర్లకు జెట్టీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సుందరపు వెంకట సతీష్ గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశాఖలో ఎంవీపీకాలనీలోని ఎ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఉత్తరాంధ్ర అంటే చైతన్యం నిండిన నేల. అందరినీ గుండెలకు హత్తుకునే నేల. తెలుగువాడిలో ఆంధ్ర అనే భావన రగిలించిన నేల. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల. ఇలాంటి ప్రాంతం నుంచి ప్రజలు, యువత జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోవడం బాధ కలిగిస్తోంది. జనసేన పార్టీ పెట్టి, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిలబడ్డాను అంటే దానికి ఉత్తరాంధ్ర ఇచ్చిన మనో ధైర్యమే కారణం. నాకు నటనలో ఓనమాలు నేర్పించి, నాలో భయాలను పోగొట్టింది. మన తరాన్ని కాపాడుకుంటూ… వచ్చే తరానికి బంగారు భవిష్యత్తు అందించేలా నా వంతు కృషి చేసి ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటాను.

ఈ ప్రాంత యువతకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా నిండు మనసుతో ప్రయత్నిస్తాను. కొద్ది రోజుల క్రితం మత్స్యకారుల బోట్లు కాలిపోతే … బాధితులకు పార్టీ తరఫున రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఆ డబ్బు వాళ్ల కష్టాలు తీరుస్తుందని కాదు… మీ కష్టంలో మేము అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. నేను ఏ రోజు పదవి కోసం పాకులాడలేదు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేయాలని వచ్చాను.

నేను ముందుండి పోరాటం చేస్తాను అంటే ఒక్కరూ స్పందించలేదు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించగానే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ లాగా చూడకండి. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు చేయడం కోసం 32 మంది బలిదానాలు చేశారు. ప్రతి తెలుగువాడికి చాలా భావోద్వేగంతో కూడుకున్నది.

అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రంలో చాలా గొడవలు తలెత్తే అవకాశం ఉందని చెప్పాను. జై తెలంగాణ నినాదానికి ఎంత ఉద్వేగం ఉంటుందో ‘విశాఖ హక్కు – ఆంధ్రుల హక్కు’ అన్న నినాదానికి కూడా అంతే ఉద్వేగం ఉందని చెప్పాను. ఇవన్ని చెబితేనే కేంద్ర పెద్దలు మన మాటలను గౌరవించి ఇంత వరకు ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు.

గతంలో కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులతో మనస్ఫూర్తిగా చెప్పినమాట ఏమిటంటే… మీరంతా కలిసి వస్తానంటే ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి అప్పీల్ చేద్దాం. గట్టిగా పోరాటం చేద్దాం అని సూచించాను. ప్లాంటుకు కావల్సిన క్యాప్టివ్ మైన్స్ తీసుకొద్దాం అని చెబితే… ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా దీని మీద మాట్లాడలేదు. ప్రతి సమస్యను రాజకీయంగా చూడకూడదు. కొన్ని సమస్యలు వేలాది జీవితాలతో ముడిపడి ఉంటాయి. ప్లాంటు విషయంలో రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే.. సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచనే లేదు.

గతంలో కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటిస్తే … కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేసి దాన్ని ఆపగలిగాం. ప్రస్తుతం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వరంగ సంస్థగా ఉంది అంటే దానికి ఒక కారణం జనసేన పార్టీ చేసిన పోరాటం ఉంది. ఇప్పటి కూడా ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు నువ్వు చెప్పిన మాట వల్లే ప్రైవేటీకరణ ఆగిందని చెబుతారు. ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణగా జనసేనకు అండగా నిలబడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా బలమైన పోరాటం చేస్తాం.

వైసీపీ నాయకులకు యువత భవిష్యత్తు పట్టదు
వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే … కనీసం వాళ్లు సకాలంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల గురించే తప్ప యువత భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోతున్నారు. నిజమైన రాజకీయ నాయకులు అయితే ఈ ఐదేళ్లు నిరుద్యోగ యువతకు ఎంత విలువైన కాలమో తెలిస్తే తప్పులు చేయరు. జ్యాబ్ క్యాలెండర్ సకాలంలో ఎందుకు విడుదల చేయలేకపోయారో కనీసం జవాబు చెప్పేవారు లేరు. రాజకీయాలు అంటే ఒక బురద.. పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని యువత భావిస్తున్నారు. నిజంగా రాజకీయాల్లో యువత పాత్ర ఉండాలంటే వారి కోసం నిలబడే వ్యక్తులు ఉండాలి.

దెబ్బ తిన్నా నిలబడే వ్యక్తులు ఉంటే వారు మారుతారు. నేను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటే వందల కోట్లు సంపాదించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ జీవితం నాకు తృప్తినివ్వదు. ఒక పాతికేళ్లు కష్టపడి యువతకు మంచి భవిష్యత్తు చూపించగలిగితే వందల కోట్ల కన్నా ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఓటమి విలువ యువతకు బాగా తెలుసు. ఏదైనా ప్రవేశ పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వారికి తెలుసు. నేను దశాబ్ధ కాలంగా ఓటమి మీద ఓటమి తీసుకుంటూ ఎదుగుతున్నాను. అబ్రహం లింకన్ ఎన్నోసార్లు ఓడిపోయారు.

లాయర్ ఎన్నికలు, సెనేటర్ ఎన్నికలు ఇలా ప్రతీ చోట ఓటమి చవిచూశారు. అయినా ప్రయత్నం ఆపకపోవడం వల్ల అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. జీవితంలో ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. నిజాయతీగా నిలబడి నడిచి చూపించడమే. నాకు పదవే కావాలి అనుకుంటే బీజేపీలో జాయిన్ అయితే కోరుకున్న పదవి దక్కేది. నాకు కావాల్సింది పదవులు కాదు… మార్పు.

ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే.. ఆనాడు ఎందుకు మాట్లాడలేదు?
రాజధాని చర్చ వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్ర మీద ప్రేమ, మమకారం లేదా? ఈ ప్రాంతానికి రాజధాని రావడం ఇష్టం లేదా? అన్నట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతుంటారు. వారందరికి నేను ఒకటే అడుగుతున్నా… ఉత్తరాంధ్ర దోపిడీకి గురవుతుంటే మీరంత ఎక్కడున్నారు? ఉద్ధానం కిడ్నీ సమస్యతో వేలాది మంది మృత్యువాతపడుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు?

తెలంగాణలో 29 కులాలకు బీసీ జాబితా నుంచి తీసేస్తే ఎందుకు మాట్లాడలేదు? ఎన్నికల సమయంలో ఒకరికి ఒకరు సహకరించుకుంటారు కదా.. కనీసం దీనిపై ఒక వివరణ అయినా ఎందుకు రాబట్టలేకపోయారు? ఇది ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం కాదా? ఏ అధికారం లేకపోయినా ఈ ప్రాంత సమస్యలపై శ్రీ అమిత్ షా గారి వంటి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతుంటే… కనీసం మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడలేకపోయారు. దీనిని ఏమంటారు?

మహిళలపై దాడుల్లో రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు 40 శాతం పెరిగిపోయాయి. మహిళలపై దాడుల్లో దేశంలోనే మన రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది. దాదాపు 30 వేల మంది మహిళలు, యువతులు అదృశ్యమైపోయారు. దీనిపై ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ ఏనాడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. నేను దీనిపై మాట్లాడితే కొంతమంది వైసీపీ నాయకులు హేళన చేశారు. వాళ్లంత ఒకటి గుర్తు పెట్టుకోవాలి. బలమైన సమాచారం ఉంటే తప్ప నేను మాట్లాడను. పోలీస్ ఎఫ్ ఆర్ ఐ నమోదు కానీ కేసులు కూడా మా దగ్గరకు వస్తాయి.

విశాఖలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమంలో అనకాపల్లి నుంచి వచ్చిన తల్లిదండ్రులు ‘మా అమ్మాయి అదృశ్యమై రెండేళ్లు అవుతుంది.. ఇప్పటి వరకు ఎక్కడుందో మాకు తెలియడం లేదు’ అని ఆమెకు తీసుకెళ్లిన కారు నెంబర్లతో సహా మా దగ్గరకు వచ్చి చెప్పారు. మాకు చెప్పిన వారం రోజుల్లో యువతిని పోలీసులు గుర్తించారు. రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడితే సగం సమస్యలు పరిష్కారమవుతాయి.

దందుపాళ్యం గ్యాంగులు రెచ్చిపోతున్నాయి
వైసీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకునేవారిగా వారిని మార్చారు. పోలీస్ యూనిఫాం విలువ తెలిసినవాడిగా చెబుతున్నా పోలీస్ శాఖకు పునర్వైభవం తీసుకొస్తాం. ప్రజల కోసం సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తాం. రాజకీయ నాయకులకు కొమ్ము కాసే అధికారులను పక్కన పెట్టి చట్టాలకు లోబడి ప్రజల శాంతిభద్రతలు కాపాడే అధికారులను ముందు వరుసలో నిలబెడతాం.

నా సినిమాను ఇబ్బంది పెట్టాలని చీఫ్ సెక్రటరీ నుంచి తహశీల్దార్, పోలీసులు వరకు థియేటర్ల దగ్గర పెట్టారు. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే నేను నష్టపోతానని జగన్ అనుకుంటున్నారు. అలాంటి పనులు మేము చేయం. పోర్టు ప్రాంతంలో చీకటి పడితే దండుపాళ్యం గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. ఆడవాళ్లపై దాడులు చేసి దోచుకుంటున్నారని అక్కడ మహిళలు చెప్పారు. పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించగలిగితే అలాంటి చీకటి గ్యాంగులకు అణిచివేయవచ్చు. జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ను బలంగా అమలు చేస్తాం.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి మంగళగిరి కార్యాలయంలో ఉంటే భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యను చెప్పుకోవడానికి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరత వల్ల కార్మికుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందారు. మీరొచ్చి దీనిపై మాట్లాడాలి అని అడిగారు. ఓడిపోయిన నేనొచ్చి మాట్లాడితే జనం వస్తారా? నా మాట వింటారా అని అడిగాను. కచ్చితంగా వస్తారు.. వింటారు అని కొందరు సందేహంగా చెప్పారు. ఎవరొచ్చిన రాకపోయినా నేను మాత్రం నేను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేస్తాను. ఎన్ని అవమానాలు, ఓటమిలు ఎదురైనా నా సిద్ధాంతాలను వదలను అని చెప్పి వస్తే దాదాపు 2 లక్షల మంది ప్రజలు రోడ్డు మీకు వచ్చారు. ఎప్పుడు లేనిది ఆ రోజు నా కళ్లు చమర్చాయి. అంతటి ప్రేమని అందించింది ఉత్తరాంధ్ర. ఆ పిచ్చి ప్రేమకు నేను దాసుడిని.

టీడీపీ వెనుక కాదు కలిసి నడుస్తున్నాం
పొత్తులో భాగంగా మనం నిలబడ్డ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించి… మద్దతు ఇచ్చిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఆలోచిద్దాం. నేను, చంద్రబాబు కూర్చొని దీని గురించి ఆలోచిస్తాం. మీ గుండెల్లో ఉన్న అభిమానం ఓట్లుగా మారాలి. ఆ అభిమానం మనల్ని అధికారంలో కూర్చోబెట్టాలి. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను ఇస్తే కనీసం క్యాప్టివ్ మైన్స్ తీసుకురాలేకపోయారు. అధికారం లేకపోయిన ఎంత చేశానో మీకు తెలుసు.

మనం బలమైన స్థానాల్లో గెలవగలిగితే రాష్ట్రం కోసం ఇంకెంత చేస్తానో ఆలోచించండి. పొత్తు ను విడగొట్టాలని కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశంకు బీ పార్టీ అంటూ కామెంట్లు చేస్తారు. దానిని మీరు పట్టించుకోకండి. మనం తెలుగుదేశం వెనుక నడవడం లేదు. తెలుగుదేశం పార్టీ పక్కన నడుస్తున్నాం. మనం ఒంటరిగా బరిలోకి దిగితే గతంలో కంటే ఓట్లు శాతం పెరుగుతుంది అయితే అధికారం తీసుకొచ్చే బలం ఉంటుందో లేదో తెలియదు. యువత భవిష్యత్తు కోసం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు.

విశాఖతో నాకు ఎంతో అనుబంధం ఉంది. నటనలో ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నాను. యాక్టింగ్ క్లాసులు పూర్తయ్యాక అన్నయ్య చిరంజీవి గారితో ఒకటే చెప్పాను. ఇక్కడ నేర్చుకున్న పాఠాలు నాలోని బిడియాన్ని పోగొట్టాయి. పదిమందిలో మాట్లాడితే ఏమైపోతుందో అన్న భయాన్ని చెరిపేశాయి. నాకు ఇంతటి ధైర్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాను. ఆ రోజు ఉత్తరాంధ్ర నాకు ఇచ్చిన ఆ ధైర్యమే రాజకీయల్లో నిలబెట్టింది.

ఆ ధైర్యమే జగన్ ను ఎదుర్కొనేలా చేసింది. ఆ ధైర్యమే కిరాయి గుండాలతో పోరాడేలా చేసింది. 2024లో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించేలా కూడా ఆ ధైర్యమే చేస్తుంది. మీ భవిష్యత్తును బంగారుమయం అయ్యేలా చూస్తుంది. రాగానే అద్భుతాలు చేస్తానని చెప్పాను. ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో మాత్రం చూపిస్తాను.

అవినీతి డబ్బు ఎక్కువై… నియంతృత్వ పోకడలు వస్తున్నాయి
దశాబ్దంపాటు దెబ్బలు తింటూ వచ్చాను. ఇప్పుడు అడుగుతున్నాను.. జనసేన – తెలుగుదేశం పార్టీలను నిండు మనసుతో గెలిపించండి. మరోసారి వైసీపీ వైపు చూస్తే మీ భవిష్యత్తును మీరే కాలరాసుకున్నట్లే అవుతుంది. వైసీపీకి బై బై చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీలోని నాయకులు అయిదేళ్లుపాటు చక్కగా ఇసుక తిన్నారు… మైనింగ్ చేసుకున్నారు… కల్తీ మందు అమ్మారు. కనిపించిన ప్రతీచోటా దోచుకున్నారు. జానీ సినిమాలో ఓ పాట ఉంది. రావోయి మా కంట్రీకి… రంజుగా లైఫ్ ఉన్నది.. బంబడు లైఫున్నది అంటూ ఓ పాట ఉంది. ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితికి ఆ పాట సరిగ్గా సరిపోతుంది.

గంజాయితో, మద్యంతో నిండిన రాష్ట్రంలో వాటిని అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు వేల కోట్లు దోచుకున్నారు. ఎంత డబ్బు ఉన్నా వీరికి సరిపోవడం లేదు. ఒకరి వద్దనే అంత డబ్బు ఉంటే కచ్చితంగా ఆ మనిషిలో నియంతృత్వ భావజాలం వస్తుంది. నా మాటే వినాలి.. నేను చెప్పినట్లు మిగిలిన వారంతా చేయాలి అనే నియంత ఆలోచన వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోంది అదే. నువ్వు ఏం చేయాలి..? ఎలా బతకాలి..? ఏం తినాలి..? ఏం బట్టలు వేసుకోవాలో కూడా వారే చెబుతున్నారు. మన బతుకులను నిర్దేశించడానికి వారు ఎవరు..? వారికి ఏం అధికారం ఉంది?

జగన్ తప్పులతో పంచాయతీ నిధులకు మంగళం
పంచాయతీల నిధులను వైసీపీ కొల్లగొట్టింది. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా నిలిపేసింది. దీనికి వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అడ్డగోలు విధానాలే కారణం. 2019 నుంచి 2023 వరకు రూ.1328 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2030 కోట్లు ఆగిపోయాయి. మొత్తంగా 2019 సంవత్సరం నుంచి రూ.3359 కోట్లు ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపేసింది. కేంద్రం ఇచ్చిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు మళ్లించడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా గ్రామ సచివాలయాల పేరుతో పంచాయతీల అధికారాన్ని వైసీపీ నిర్వీర్యం చేసే కుట్ర చేసింది. రాజ్యాంగ నిబంధనలను పక్కన పెట్టేసింది. సర్పంచుల అధికారం, వారి విధులను నిర్వీర్యం చేస్తున్న సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకం అని ఇప్పటికే దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పంచాయతీల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్ని వ్యవస్థలను, వ్యక్తుల జీవితాలను వైసీపీ ప్రభుత్వం క్రమక్రమంగా ధ్వంసం చేస్తోంది.

తెప్ప తగలేసిన జగన్.. మళ్లీ ఓట్లు కొనడానికి వస్తాడు
ఓటు అనే బోటు మీద సముద్రం దాటిన జగన్ దాటగానే తెప్ప తగులబెట్టాడు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో డబ్బుతోనే గెలుద్దామని జగన్ భావిస్తున్నాడు. ప్రజలు మాత్రం ఆలోచించి ఓటేయండి. నేను నిలబడే చోట రూ.100 కోట్లు నుంచి రూ.150 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈసారి జగన్ పంచే డబ్బు ప్రజలందరిదీ అని గుర్తు పెట్టుకోండి.

మన జేబులో నుంచి బెదిరించో, భయపెట్టో లాక్కున్న డబ్బు మనకే పంచడానికి వస్తున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్ పంచే డబ్బును తీసుకున్నా, మీ భవిష్యత్తును ఆలోచించి మాత్రం జనసేన – తెలుగుదేశం కూటమికి అండగా నిలబడండి. వచ్చే దశాబ్ధం పాటు జగన్ లేని ఆంధ్రాను తీసుకొచ్చేలా అవకాశం ఇవ్వండి. బంగారు ఆంధ్రప్రదేశ్ ను తయారు చేసే బాధ్యతను మేం తీసుకుంటాం.

వచ్చే ప్రభుత్వంలో జనసేన కచ్చితంగా బాధ్యత తీసుకుంటుంది. అధికారం తీసుకుంటుంది. అన్ని స్థాయిల్లోనూ కచ్చితంగా బాధ్యతతో కూడిన అధికారాన్ని పంచుకుంటుంది. ఒంటరిగా నేను పార్టీని తీసుకొచ్చాను. నాతోపాటు ప్రయాణం చేసిన నా సహచరులను జాగ్రత్తగా కాపాడుకుంటాను. కచ్చితంగా ఈసారి రాష్ట్ర సుస్థిరత, సమైక్యత, అభివృద్ధి గురించి ఆలోచించి ప్రజలంతా ఓటేయండి. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుందో బేరీజు వేసి నిర్ణయం తీసుకోండి.

నేను స్వతహాగా సోషలిస్టు భావజాలం నిండిన వ్యక్తిని. వచ్చే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏ మాత్రం ఆగవు. నా సొంత డబ్బునే ప్రజలకు ఇచ్చిన వాడిని. ప్రజా ధనాన్ని కచ్చితంగా వారికి పంచడంలో మరింత ఆనందం నాకు ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతం సైతం ఈ రోజు నుంచి వైసీపీ విముక్త జిల్లాలుగా ప్రకటిద్దాం. ఇక్కడి నుంచి వైసీపీ అనేది కనిపించకుండా చేద్దాం. సుందరపు వెంకట సతీష్ ని పార్టీలోకి రావాలని గతంలోనే ఆహ్వానించాను. ఇప్పుడు ఆయన పార్టీలోకి వచ్చి, ప్రజలకు అండగా నిలబడతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి సానుభూతిని తెలియజేస్తున్నాను.

పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడిన తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఎన్నికలకు మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపి, బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఈ మూడు నెలలు చాలా సమన్వయంతో, సమష్టిగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీతో పొరపొచ్చాలు లేకుండా ముందుకు వెళ్దాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ పేరుతో మన వెనుక వచ్చే కార్యకర్తల కడుపు మాడ్చేయవద్దు. ప్రతి నాయకుడు ఎలక్షనీరింగ్ బలంగా చేయాలి. ప్రతి ఓటు మనకు పడేలా ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలి. పోలింగ్ బూతులో మనకు ఓటు పడే వరకు తగిన జాగ్రత్తతో ఎన్నికలు చేద్దాం. విజయదుంధుబి మోగిద్దాం’’ అన్నారు.

LEAVE A RESPONSE