Suryaa.co.in

Andhra Pradesh

రైతు సంక్షేమ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కి లేదు

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట: అయిదేళ్లు అధికారం వెలగబెట్టి అన్నివిధాలుగా రైతుల ఉసురు తీసిన జగన్‌ రెడ్డి మొసలికన్నీళ్లు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చిలకలూరిపే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం, రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఏపీని నిలిపిన ఘనుడికి అసలు రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. వైకాపా అయిదేళ్ల పాలనలో రైతులకు అప్పులు, ఆత్మహత్యలు, కన్నీళ్లే మిగిలినా కనీసం ఏ ఒక్కర్ని పరామర్శించిన పాపాన పోని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు.

పంటల బీమా చెల్లించలేదు, రైతులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి.. నిప్పులు చెరిగారు. అయిదేళ్ల ఏలుబడిలో కనీసం అయిదుసార్లు కూడా రైతుల్ని కలవని వ్యక్తి, తుపాను బాధితులను చూడ్డానికి కూడా రెడ్‌కార్పెట్‌ లపై వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ఏదేదో మాట్లాడడం చూస్తుంటే వింతగా ఉందన్నారు. జగన్ పాలనలో సగటున ఏడాదికి 1100మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారనే విషయాన్ని మరిచి పోయారా నిలదీశారు.

తెగుళ్లతో నష్టపోయిన మిరప రైతులకు పరిహా రం ఇవ్వకుండా తుపానులతో నష్టపోయిన ధాన్యం రైతులను కనీసం ఆదుకోకుండా ఇప్పుడు వచ్చి ఉత్తుత్తి ప్రేమలు ఒలకబోయడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ అయిదేళ్ల పాలనలో మొత్తం రూ.10వేల కోట్ల వరకు రైతులకు బకాయిలు పెట్టి వారిని నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE