Suryaa.co.in

Andhra Pradesh

తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకున్న జగన్

– ఎక్స్ వేదికగా విరుచుకుపడిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి: తిరుమల సందర్శనాన్ని రద్దు చేసుకోవటం ద్వారా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన్ రెడ్డి తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.

ఈమేరకు శుక్రవారం నాడు ఎక్స్ లో ట్వీట్ చేశారు . జగన్ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, హిందూమతం, ఆచార సంప్రదాయాల పట్ల ఆయన వ్యతిరేకత ఈ తాజా చర్య ద్వారా సుస్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. తిరుమల వెంకటేశ్వరుని ఆలయ సందర్శనానికి ముందు డిక్లరేషన్ పై సంతకం చేయటం ఇష్టం లేనందునే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని, హిందూ మతం పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరిని ఇది బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు.

దళితులు హిందువులేనని, వారు తిరుమలేశుని దర్శించుకునేందుకు హక్కు కలిగి వున్నారని తెలిపారు. జగన్ కు బహుశా ఇది తెలిసి ఉండకపోవచ్చని, దళితులందరూ క్రైస్తవులేనంటూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. జగన్ చెబుతున్నది సెక్యులరిజం కాదని, సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించటమేనని ఆయన స్పష్టం చేశారు.

గురుద్వారాలను సందర్శించే సిక్కు మతేతరులు తమ తలలను కప్పుకుంటారన్న విషయం జగన్ కు తెలిసి వుండకపోవచ్చని మంత్రి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE