Suryaa.co.in

Andhra Pradesh

ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం జగన్మోహన్ రెడ్డిదే

మిమ్మల్ని రోడ్డుపై ఎండలో నిలబెట్టింది తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాదు
56 లక్షల మంది వృద్ధులలో ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు
ఇతరులపై బురద చల్లి రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రభుత్వ అధికారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి కుట్ర
ఈ కుట్ర ను ప్రజలు, ప్రత్యేకించి పింఛన్ లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి… ప్రతిపక్షాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి
56 లక్షల మందికి లక్షాపాతిక వేల మంది గ్రామ సచివాలయ సిబ్బంది పింఛన్లను పంపిణీ చేయలేరా?
అడ్రసుల ఆధారంగా పోస్ట్మాన్లు ఉత్తరాలను పంపిణీ చేయడం లేదా?
అలాగే ఒక్కొక్క ఉద్యోగి వార్డు పరిధిలో 50 మందికి పింఛన్లను పంపిణీ చేయడానికి ఏమైనా ఇబ్బందా?
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

పింఛన్ల కోసం నడిరోడ్డుపై ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. వృద్ధాప్య పింఛన్లు తీసుకునే 56 లక్షల మంది లో ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని ఆయన కోరారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులతో కలిసి మండుటెండల్లో వృద్ధులను నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారన్నారు. ఆ కుట్రను ప్రజలు… వృద్ధులు గ్రహించాలని కోరారు.

బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వృద్ధులను రాచిరంపాన పెట్టి, ఆ నింద ను తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వేయాలన్న దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంటే… వృద్ధులు అంటే ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందా? అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, కపట ప్రేమ, దొంగ ప్రేమను జగన్మోహన్ రెడ్డి చూపెడుతున్నారని ధ్వజమెత్తారు.

జగన్మోహన్ రెడ్డి దొంగ ప్రేమల గురించి ఆయన చెల్లెలే ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులను వేధిస్తున్న సెర్ఫ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలన్న రఘురామకృష్ణంరాజు, పింఛన్ల పంపిణీకి లక్ష 25 వేలమంది గ్రామ సచివాలయ సిబ్బందిని ఎందుకని ఉపయోగించుకోవడంలేదంటూ ప్రశ్నించారు. అధికారులు ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఎందుకు కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వారికి అంత దరిద్రం ఏమి పట్టిందని విస్మయాన్ని వ్యక్తం చేశారు . వృద్ధాప్య పింఛన్ల పంపిణీ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులను వెంటనే విధుల్లో నుంచి తప్పించాలన్నారు. అలాగే లక్షా పాతిక వేలమంది గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి, లబ్ధిదారులకు పింఛన్లను అందజేయాలన్నారు.

ఎండలో వృద్ధులు నిలబడడానికి కారణం జగన్మోహన్ రెడ్డేనన్నది పచ్చి నిజం

వృద్ధులు కొద్దిగంటలు మండుటెండలో నిలబడడానికి జగన్మోహన్ రెడ్డే కారణమన్నది పచ్చి నిజమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాగా, ఎండకాటుకు గురిచేసిన ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే దెబ్బతో కొట్టి మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి వీలు లేనంత దరిద్రంగా ఓడించి పంపించాలని కోరారు. ఈ ఉన్మాద ప్రభుత్వం వృద్ధుల అన్న కనికరం కూడా లేదని, కేవలం ఇతరులపై నిందలు వేసి , రాజకీయ లబ్ధి పొందడానికి వృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు . ఇటువంటి కిరాతక ప్రభుత్వాన్ని గద్దలింపాల్సిన అవసరం మనందరిపై ఉందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

ఈసీ నిర్ణయాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకునే ప్రయత్నం

వృద్ధాప్య పింఛన్లు పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదన్న ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పాలక పక్షానికి అనుకూలంగా మలిచి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా పరోక్షంగా అధికార పార్టీకి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సెర్ఫ్ అధికారి మురళీధర్ రెడ్డి లు రెడీ అయిపోయారన్నారు.

పింఛన్లు పొందుతున్న వారిలో 8.5 లక్షల మంది వికలాంగులకు, వీల్ చైర్ లో కూర్చొని ఉండే వారికి మాత్రమే ఇంటికి వెళ్లి పింఛన్ సొమ్ము అంద చేయాలని నిర్ణయించారన్నారు. 80 ఏళ్ల వృద్ధులైన సరే గ్రామ సచివాలయానికి వచ్చి పింఛన్ సొమ్ము తీసుకోవాలని పేర్కొన్నారని తెలిపారు . గ్రామ సచివాలయానికి వెళ్లి వృద్ధాప్య పింఛనులు తీసుకునేవారు, టీడీపీ వల్లనే తమకు ఈ అన్యాయం జరిగిందని శాపనార్థాలను పెట్టాలని ఉద్దేశంతోనే ఈ కుట్ర చేశారన్నారు. తక్షణం ఈ కుట్ర లో భాగస్వాములైన అధికారులను బదిలీ చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

పింఛన్లను గ్రామ సచివాలయ సిబ్బంది పంపిణీ చేయలేరా?

రాష్ట్రంలో లక్ష 25 వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారు 56 లక్షల మంది
లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయలేరా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఒక ఉద్యోగి ఇంటింటికి వెళ్లి 50 మందికి పింఛను మొత్తాన్ని అందచేయలేరా? అని నిలదీశారు. లక్ష 25 వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ, వాళ్లకు వృద్ధాప్య పింఛన్లు పొందే వారి ఇంటి అడ్రస్సులు తెలియని స్టుపిడ్ లాజిక్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అడ్రస్ తెలియదని చెప్పి, అడ్రస్ లేని వాళ్లకు పింఛన్లు ఇస్తున్నారరా వెధవల్లారా? అంటూ మండిపడ్డారు.

పింఛన్లు పొందే ప్రతి ఒక్కరి అడ్రస్ కాగితాలపై ఉంటుందని, ఆ అడ్రస్ ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేయాలని సూచించారు. అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలన్న ఆయన, లక్ష 25 వేల మంది ఉద్యోగులు ఒక్కొక్కరు 50 మంది ఇళ్లకు వెళ్లి ఇవ్వలేరా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోస్ట్మాన్ అడ్రస్ చూసుకొని రోజుకు 50 మంది ఇళ్లకు వెళ్లి ఉత్తరాలు పంపిణీ చేయడం లేదా అని నిలదీశారు.

పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పగించిన ఈపాటికే సజావుగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జరిగి ఉండేదన్నారు. అసలు ఈ ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి ఉందా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉండి ఉంటే, వృద్ధుల్ని ఈ విధంగా ఎందుకు వేధిస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు . ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రతిపక్షాలు తెలియజేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

మొదటి విడత రాలిన నవరత్నాలు… రెండవ విడత మరికొందరికి బదిలీ తప్పదేమో?

ప్రభుత్వ పెద్దలకు పాలేరుల్లాగా పనిచేస్తున్న తొమ్మిది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం తొలి విడతగా బదిలీ చేసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పాల్ రాజ్, హన్బు రాజ్, జాషువా లతో పాటు ఐఏఎస్ అధికారి గౌతమి, లక్ష్మీ షా, పి. రాజబాబు లను బదిలీ చేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో ఇన్చార్జ్ డిజిపిగా వ్యవహరిస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని కూడా బదిలీ చేసే అవకాశం ఉందన్నారు.

ఎన్నికల నిబంధనలో మేరకు ఇన్చార్జ్ అధికారులను బదిలీ చేయనున్నారని తెలిపారు. అలాగే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రఘురామిరెడ్డి, ఓవర్ ఇంటలిజెన్స్ ప్రదర్శించే సీతారామాంజనేయులు ఇటువంటి అధికారులను రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందాలంటే ఇటువంటి అధికారులను విధుల నుంచి తప్పించాలన్నారు. అప్పుడే ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం ప్రజలకు ఏర్పడుతుందని తెలిపారు. నిన్నటి దెబ్బతోనైనా పోలీసులు ఇప్పటికైనా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆశిస్తూ, ఎన్నికలను సజావుగా శాంతియుత వాతావరణం లో నిర్వహించడానికి మరిన్ని బదిలీలు చేయాలన్నారు. ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఉండాలా?, అధికారంలో నుంచి పోవాలా?? అనే దానికోసమే జరుగుతున్నాయన్న ఆయన, ఆ వ్యక్తి అధికారంలో ఉండకూడదని ఉద్దేశంతో ఎటువంటి వ్యక్తిగత బేషజాలు లేకుండా, నీ పార్టీ ఎక్కువ నా పార్టీ తక్కువ అన్న బేధాలు లేకుండా మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయన్నారు.. మొదటి నుంచి నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. అందుకే ఈ కూటమిలో సభ్యుడిగా భాగస్వామినయ్యానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

జీవితంలో మొదటిసారి ఆయన చెప్పిన నిజం ఇదే

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో దేవుడికి ప్రజలకు తెలుసునన్న జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో మొట్టమొదటిసారిగా నిజం చెప్పారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు . దేవుడికి ప్రజలకు తెలిసిన వ్యక్తిని తాను కాదని నమ్మించే ప్రయత్నాన్ని చేస్తున్నారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారు, చేయించిన వారు నిసిగ్గుగా రోడ్లపై తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా రెడ్డి చెప్పారన్నారు.. అన్నయ్య ఎంత దుర్మార్గుడైనప్పటికీ చిన్నప్పటి నుంచి షర్మిల కు అన్నయ్య అంటే విపరీతమైన అనురాగమన్నారు .

ఎంపీ సీటు ఇవ్వకపోయినా, ఎంతగా అన్యాయం చేసినా షర్మిల మాత్రం , 2019 ఎన్నికల్లో కాళ్లు అరిగేలా తిరిగిందన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత లేదన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఉన్న కనీసం సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఇంతకుముందు నా అక్కా చెల్లెమ్మలని తరచూ జగన్మోహన్ రెడ్డి అనేవారని, ఇప్పుడు నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారన్నారు . అక్కా చెల్లెమ్మలు అన్నప్పుడు బహుశా షర్మిల, డాక్టర్ సునీతా రెడ్డి గుర్తుకు వస్తున్నారేమోనని అపహాస్యం చేశారు. ఇప్పుడున్న వ్యక్తి నా అన్నయ్య కాదని షర్మిలా రెడ్డి తేల్చి చెప్పిందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

వైయస్ వివేకానంద రెడ్డిని ఆల్మోస్ట్ చంపింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిల చెప్పినప్పటికీ, హత్య చేసిన వారితో కలిసి తిరుగుతున్నారని పేర్కొందని గుర్తు చేశారు. ఇటువంటి రాక్షసుల మధ్య కష్టమని భావించి చిన్నాన్న నన్ను కడప లోక్ సభ నుంచి పోటీ చేయాలని కోరితే, ఆయన్ని దారుణంగా చంపేశారని షర్మిల అన్నారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం పై సిబిఐ విచారణ కోరిన డాక్టర్ సునీతా రెడ్డి పై జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడి చేశారన్నారు. ఆ తరువాత కనీసం ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. సిబిఐ విచారణ కోరిన డాక్టర్ సునీతా రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదో, తెలిసి పోలేదా అని అన్నారు .

తొలుత సిబిఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ ను తీసుకువచ్చి దానిపై చర్చించకూడదని ఆంక్షలు పెట్టించారన్నారు . న్యాయస్థానాలను, కోర్టు ఆర్డర్లను జగన్మోహన్ రెడ్డి చక్కగా వాడుకున్నారని,లేకపోతే అప్పుడే తేలిపోయేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సిబిఐ ఎంక్వయిరీ ని ముందు ఒక పథకం ప్రకారమే కోరారని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు విచారణ జరిపితే అసలు దోషులు ఎవరో తెలిసిపోయి ఉండేదని అన్నారు. నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వయిరీ ని కోరినట్లుగా జగన్మోహన్ రెడ్డి బిల్డప్ ఇచ్చి, ముఖ్యమంత్రి కాగానే కేసు తేలకుండా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారన్నారు.

ఈ కేసులో సీరియస్ గా ముందుకు వెళ్లిన మహంతి అనే యువ అధికారిని రాష్ట్రం వదిలిపోయేలా ఒత్తిళ్లు చేశారన్నారు. ఇంత దారుణం చేసి , డాక్టర్ సునీతా రెడ్డి కేసు వేస్తానంటే భయపెట్టే విధంగా మాట్లాడారన్నారు. ఇప్పటికే తనపై 11 సిబిఐ కేసులు ఉన్నాయని, ఇది 12వ కేసు అవుతుందని జగన్ మోహన్ రెడ్డి పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి బిజెపిలో చేరుతారని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా సునీతా రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు.

బిజెపిలో చేరితే ఆయన ఏమైనా పునీతుడు అవుతారా అంటూ నిలదీశారు. ఎందుకు ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, అవసరమైతే నేను సాక్షి ఛానల్ కు వస్తానని, నువ్వు కూడా రావాలని డాక్టర్ సునీతా రెడ్డి చాలెంజ్ చేసిన విషయం తెలిసిందేనన్నారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే సునీతా రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరించాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

24వ తేదీన సుప్రీం కోర్టు లో అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ

కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని డాక్టర్ సునీతారెడ్డి దాఖలు పిటిషన్ ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అవినాష్ రెడ్డి తనను బెదిరిస్తున్నారని, అతని బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ కోర్టు ముందుకు రానుందని చెప్పారు. తనని బెదిరించడమే కాకుండా, జైల్లో ఉన్న సమయంలో 20 కోట్ల రూపాయల ను ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని దస్తగిరి వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. అక్కడ, ఇక్కడ చనిపోయిన వ్యక్తి కేసులో స్వాంతన చేకూరుతుందేమో చూడాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఈ కేసులో ఇంకా ముందుకు వెళితే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందన్న ఆయన, వైయస్ వివేకా హత్యకు గురైన రోజు తెల్లవారుజామున 5:30 గంటలకే జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఉందని, అయితే ఆ విషయాన్ని ఆయన ఎందుకు చెప్పలేదన్న విషయం వద్దే విచారణ నిలిచిపోయిందన్నారు. విచారణ ముందుకు సాగితే, ఏమైనా జరగవచ్చుననే అనుమానాలు ఉన్నాయన్నారు. పులివెందులలో సిబిఐ అధికారి రాంసింగ్, డాక్టర్ సునీతా రెడ్డి ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పై వైయస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డితో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కేసులను పెట్టించారన్నారు.

మెజిస్ట్రేట్ ఇచ్చిన సింగల్ లైన్ ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఒక దర్యాప్తు అధికారిపై కేసు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్న ఆయన, ఈ కేసు హైకోర్టు సింగల్ బెంచ్ జడ్జి ముందుకు రాగా ఆయన గట్టిగానే ప్రశ్నించారని తెలిపారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసును కొట్టివేస్తారని అనుకున్నప్పటికీ, నెల రోజులపాటు వాయిదా వేశారన్నారు. ఇది ఒక చెత్త కేసు అని, దీన్ని కొట్టివేయడం ఖాయమన్నారు. తండ్రి హత్య కేసులో హంతకులను పట్టుకొమ్మంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, కృష్ణారెడ్డి తో కలిసి కేసు పెట్టించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూశారన్నారు.

సాక్షి దినపత్రిక లో వాళ్లే ఎందుకు మర్డర్ చేయకూడదని డాక్టర్ సునీతా రెడ్డి, ఆమె భర్తపై అసత్య కథనాలన్నీ రాశారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. దస్తగిరి అంతా చెప్పేశాడు. వివేకం అనే యూట్యూబ్ సినిమాలో చూపెట్టింది తక్కువ అని డాక్టర్ సునీతా రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారని, అంతకంటే దారుణంగానే ఆయన పట్ల వ్యవహరించారని ఆమె చెప్పారన్నారు. ఇంత నీచమా, అడ్డం వస్తారని సొంత చిన్నాలనే చంపేస్తారా? అన్న రఘురామకృష్ణంరాజు, చెల్లెళ్లను బజారు పాలు చేస్తారా? అంటూ మండిపడ్డారు.

తండ్రిని హత్య చేయడమే కాకుండా కన్న కూతురిపై అబాండాలు వేస్తారా అంటూ ప్రజలు దీన్ని నమ్ముతారా, నమ్మి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు దొంగ కోడి కత్తి, బాబాయి హత్య నిన్ను, నన్ను గెలిపించింది కదా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇప్పుడు ఏమి కొత్త డ్రామా ఆడుతారు అని, జగన్మోహన్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడే అయితే సిబిఐ విచారణ కోరాలన్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో తెలుసు కాబట్టి ఆయన సిబిఐ విచారణ కోరరని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి, ఐ ప్యాక్ డ్రామాలు అందరికీ తెలిసినవే

జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణం చేస్తుంటారని, ఆయనకు బయట ఎవరైనా పిలిచిన వెంటనే వినిపిస్తుందని, వాహనాన్ని ఆపి దిగి వెళ్లి అంగవైకల్యంతో బాధపడే వారిని, ఇతర దీర్ఘకాలిక జబ్బులు వేధిస్తున్న వారిని పలకరిస్తుంటారని రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవన్నీ ఐప్యాక్ డ్రామాలంటూ అభివర్ణించారు. ముందుగా నిర్ణీత దూరంలో అంగవైకల్యంతో బాధపడే వారినో, దీర్ఘకాలిక జబ్బులతో సతమతమవుతున్న వారినో కూర్చోబెట్టి, మీడియా ముందు కెమెరాల ముందు జగన్మోహన్ రెడ్డి మనసున్న మనిషి లాగా నటిస్తుంటారని విమర్శించారు.

కెమెరాలలో వారి అంగవైకల్యాన్ని చూపిస్తూ, జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నట్లుగా నటించే దృశ్యాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తూ గొప్ప మానవతావాదిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదంతా ముందస్తుగా ప్రణాళికతో ఆడుతున్న డ్రామా అని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. గతంలోనూ పాదయాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచారంలోనూ ఇదేవిధంగా డ్రామాలు ఆడారన్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని సభలు పెడుతుంటే ప్రజలేమో మేము నీకు ఓటు వేసేందుకు సిద్ధంగా లేమని అంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలు వెలవెల పోతుంటే, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలకు జనాలు పోటెత్తుతున్నారని చెప్పారు.

తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు… నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను

తెలుగుదేశం, బిజెపి పార్టీలలో ఇటీవల చేరిన వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం మాట దేవుడెరుగు, కనీసం ఒక్క మాటైనా మాట్లాడినట్టు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తానేదో ఎమోషనల్ గా చెప్పిన విషయాన్ని ఇంటూరి రవికుమార్ అనే వ్యక్తి తాను రాజకీయాలనుంచి తప్పుకోనున్నట్లుగా, విచార వదనంతో ఉన్న ఫోటోను జోడించి తంబునెల్ తో వీడియో చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు .

పేటీఎం కూలీలు ఎన్ని కారు కూతలు కూసిన నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. నాకు అలసట అన్నదే లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. కొంతమంది యూట్యూబర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, అవహేళన చేయాలని చూస్తే సహించేది లేదని ఒకరిద్దరి పేర్లను ప్రస్తావిస్తూ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. రచ్చబండ కార్యక్రమాన్ని ఎక్కువగా మహిళలు తిలకిస్తుంటారని అందుకే తాను అసభ్య పదజాలాన్ని ఎప్పుడు ఉపయోగించడం లేదని చెప్పారు. ఎవరైనా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవహేళన చేయాలని చూస్తే మాత్రం వారికి తగిన శాస్తి చేయనున్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు.

LEAVE A RESPONSE