-అడుక్కోవడానికి చిప్పకూడా మిగల్చలేదు
-అహర్నిశలు కష్టపడతాం..గతవైభవం తెస్తాం!
-ఈమని రచ్చబండసభలో యువనేత నారా లోకేష్
మంగళగిరి/దుగ్గిరాల: అయిదేళ్లపాలనలో జగన్ హైకోర్టు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టారు, రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం నుంచి పిల్లలు చదువుకునే స్కూళ్ల వరకు వదల్లేదు, 12లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి అడుక్కోవడానికి చిప్పకూడా లేకుండా చేశారని యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు.
దుగ్గిరాల మండలం ఈమని రచ్చబండ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… అహర్నిశలు కష్టపడి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. జగన్ నిర్వాకం కారణంగా వ్యవసాయరంగం నిర్వీర్యమైంది. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వస్థానంలో రాష్ట్రాన్ని నిలిపారు. అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కెజి నుంచి పిజి వరకు సిలబస్ లో సమూల మార్పులు తెస్తాం, నైతికవిలువలు, సామాజిక బాధ్యతతో కూడిన పాఠ్యంశాలు ప్రవేశపెడతాం. మెగా డిఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. విద్య,వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తాం.
జగన్ ఎన్నికల్లో ఒంటరిగా వస్తానని చెప్పి శవాలతో వస్తున్నారు, 2014లో తండ్రి శవం, 2014లో బాబాయి శవంతో వచ్చారు, ఇప్పుడు 32మంది వృద్ధులను చంపి శవరాజకీయం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత వాలంటీర్లతోనే వృద్ధులకు 4వేల పెన్షన్ అందజేస్తాం. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పేదల పక్కా ఇళ్లనిర్మాణానికి 5నుంచి 7లక్షలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇస్తున్న 1.8లక్షలు ఏ మూలకు సరిపోవడంలేదు.
మేం అధికారంలోకి వచ్చాక మెరుగైన టెక్నాలజీతో పేదలకు ఇళ్లునిర్మించి ఇస్తాం. జగన్ మాదిరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ మేం కాదు, అయిదేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి తీరుతామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.