Home » పేదల రక్తం తాగే జలగ జగన్ రెడ్డి

పేదల రక్తం తాగే జలగ జగన్ రెడ్డి

నేను విదేశాల నుండి పెట్టుబడులు తెస్తే.. జగన్ విదేశాల నుండి డ్రగ్స్ తెచ్చాడు
ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు..కొండల్ని ఆనకొండల్లా మింగేశాడు
విశాఖను ఐటీ కేపిటల్‌గా, ఆర్ధిక రాజధానిగా చేసిన ఘనత మనది
టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాక జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది
కూటమి సభలకు దళిత నియోజకవర్గాల్లో భారీ స్పందన మార్పులకు సంకేతం
అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నపుడే
వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం అందించే బాధ్యత నాది
పాయకరావుపేట ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు

పాయకరావుపేట : పాయకరావుపేట దద్దరిల్లింది. అటు సముద్రం.. ఇటు జనసముద్రం. పాయకరావుపేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండె పగిలిపోవడం తధ్యం. ఒకవైపు నా ప్రాణ సమానమైన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు.. మరోవైపు జనసేన, బీజేపీ కార్యకర్తలు. ముగ్గురు కలిశాక వేరే వారికి చోటుందా? గెలిచే అవకాశం ఉందా? అందుకే కొత్త కొత్త డ్రామాలకు తెరలేపారు.

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఈ రోజు. అలాంటి రోజున ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గానికి రావడం అదృష్టంగా భావిస్తున్నా. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను, కేంద్రం నుండి నిధులు తెచ్చే బాద్యత సీఎం రమేష్ తీసుకుంటాం. ఆ మహనీయునికి ఈ వేధిక మీద నుండి నివాళులర్పిస్తున్నా. అంబేద్కర్ ఆ రోజే చెప్పారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా.. అమలు చేసే వారు మంచివారు కాకుంటే ప్రజలకు మెరుగైన ఫలితాలు అందవన్నారు.

జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు వస్తారని అప్పుడే ఆయన ఆలోచించారు. రాజ్యాంగం మంచిదే. కానీ, రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యక్తే దుర్మార్గుడు. నేను హామీ ఇస్తున్నా.. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ చేతికి నేను పదునైన కత్తినివ్వలేను. కానీ, వజ్రాయుధం లాంటి ఓటు ఇస్తున్నానని చెప్పారు. ఇక్కడ యువత అదే అంటున్నారు.. నా మొదటి ఓటు చంద్రబాబుకేనని చెబుతున్నారు. కూటమిని గెలిపించండి.. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే బాధ్యత నాది.

తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ ఆశయాల్లోంచి పుట్టుకొచ్చింది. సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం. ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, 40 ప్రతిపాదనలను అమలు చేసి చూపించాం. ఒకప్పుడు రెండు గ్లాసుల సిద్దాంతంతో దళితుల్ని అవమానిస్తే.. దాన్ని కమిషన్ ఏర్పాటు చేసి నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పది దళిత నియోజకవర్గాల్లో సభలు పెట్టా. ఎక్కడ చూసినా ఇదే స్పందన. రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని పాతాళంలోకి తొక్కి పెట్టేందుకు సిద్ధమైపోయారు.

దళిత ద్రోహి ఈ జగన్ రెడ్డి. 27 దళిత పథకాలు రద్దు చేశాడు. ఇక్కడే డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడని ముద్రవేసి చంపేశారు. మాస్కులు అడిగిన పాపానికి చిత్రహింసలు పెట్టారు. డాక్టర్ సుధాకర్ ఆత్మశాంతించాలంటే వైసీపీని ఓడించాలి. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరికైనా ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయి, ధరలు పెరిగాయి. చెత్తపై కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేస్తున్నాడని ఆడ బిడ్డలు ఆక్రోశిస్తున్నారు. జాబ్ క్యాలెండర్, డీఎస్సీపై ఎన్నో హామీలిచ్చాడు. ఒక్కసారైనా ఉద్యోగమిచ్చాడా?

జాబు రావాలంటే.. బాబు రావాలి. కూటమి అధికారంలోకి రావాలి. ప్రజల్ని అభిమానించే పవన్ కల్యాణ్ ని, బీజేపీ నాయకుల్ని గెలిపించాలి. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, మన యువత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేదే మా ఆశయం. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది. కూటమిని గెలిపించండి చాలు. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసి చూపిస్తాను. అంబేద్కర్ కు భారతరత్న అవార్డు రావడానికి కృషి చేసింది ఎన్టీఆర్. యునైటెడ్ ఫ్రంట్ లో భాగంగా గౌరవించాం. పక్కనే బాలయోగిని లోక్ సభ స్పీకర్ని చేశాం. దళితుల శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అనితను పొలిట్ బ్యూరో సభ్యురాలిగా చేయడమే కాకుండా, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించాను.

ఉత్తరాంధ్ర మొత్తాన్ని జగన్ రెడ్డి ఊడ్చేశాడు. కొండల్ని ఆనకొండల్లా మింగేశాడు. ప్రశాంతమైన ప్రాంతాన్ని హింస, అశాంతికి నిలయంగా మార్చాడు. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల విలువైన 70 వేల ఎకరాల భూముల్ని మింగేశాడు. రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. పేదలకు ఇళ్లు కట్టించలేదు కానీ, తనకు ప్యాలెస్ కట్టించుకున్నాడు. సెంటు పట్టాల పేరుతో దగా చేశాడు. ఇళ్లు పూర్తి చేయలేదు. కానీ, అప్పులపాలయ్యారు.

నేను హామీ ఇస్తున్నా.. నా పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను కట్టించిన టిడ్కో ఇళ్లను సైతం పేదలకు పంచకుండా పాడుబెడుతున్నాడు. ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. ఇంటి స్థలం దక్కని వారికి రెండు సెంట్లు ఇచ్చి, ఇళ్లు కట్టించే బాధ్యత నాది.

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రానికి కంపెనీలు తెస్తుంది. కానీ, జగన్ రెడ్డి కంపెనీలు తరిమేశాడు. లూలూ, అదానీ డేటా సెంటర్, మిలీనియం టవర్స్ నుండి కంపెనీలు తరిమేశాడు. నేను వస్తే.. పరిశ్రమలొస్తాయి.. జగన్ రెడ్డి వస్తే గంజాయి వస్తుంది. డ్రగ్స్ వస్తుంది. విశాఖ నగరాన్ని ఐటీ కేపిటల్ గా, ఆర్ధిక రాజధానిగా చేయాలని తలిచాను. కానీ జగన్ రెడ్డి గంజాయికి రాజధానిగా మార్చాడు. మనం విదేశాల నుండి పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తే.. జగన్ రెడ్డి విదేశాల నుండి డ్రగ్స్ తెచ్చాడు.

ఈ మధ్య కాలంలో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ తీసుకొచ్చాడు. భూ వివాదాలకు నిలయంగా మారిపోయింది. ఆ భూ వివాదాలు ఏ స్థాయికి చేరాయంటే.. అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. ఈ ప్రభుత్వంలో బాగుపడింది జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి తప్ప మరొకరు ఎవరూ బాగుపడలేదు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడే నాయకత్వాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటా.

పేదల గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డిని అడుగుతున్నా.. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం పేదల్ని ఉద్దరించడమా? పేదల బలహీనతను ఆసరాగా చేసుకుని, కల్తీ, నాసిరకం మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నాడు. రూ.60 ఉండే క్వార్టర్ రూ.200 చేశాడు. మిగిలిన రూ.140 ఎవరి జేబుల్లోకి పోతోంది? పేదల రక్తం తాగే జలగ ఈ జగన్ రెడ్డి. రూ.5తో కడుపు నింపే అన్న క్యాంటీన్లు రద్దు చేసినోడు పేదల మనిషా?

వరాహ నది పక్కనే ఉన్నా.. ఎవరికైనా ఇసుక దొరుకుతోందా? మేం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక ఇచ్చే బాధ్యత నాది. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.1000 ఉంటే ఇప్పుడు రూ.6-7 వేలకు చేరింది. వేలం పాట పాడినట్లు ఇసుక పాట పాడుకుంటూ పేదల జీవితాల్ని చిత్తు చేస్తున్నాడు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైన్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, సెటిల్మెంట్లు, స్కీము స్కీమునా స్కాములతో దోపిడీ తప్ప చేసిందేమీ లేదు. కుంభకోణాలు పోయి.. కష్టబడే ప్రభుత్వం రావాలంటే ఎన్డీఏను గెలిపించాలి. కుంభకోణాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేసే బాధ్యత నాది.
మేము సూపర్ సిక్స్ ప్రకటించాం.

మా మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆరు కాదు పది ఇద్దామన్నారు. మనం ఇచ్చే కార్యక్రమాలతో పాటు కేంద్ర పథకాలను కలుపుకుంటే ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మనం మహాశక్తి అంటే.. కేంద్రం నారీ శక్తిగా ప్రకటించింది. ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1500 ఇస్తా. తల్లికి వందనం పథకంతో బడికి వెళ్లే ప్రతి బిడ్డకూ రూ.15000 ఇస్తాం. ప్రతి ఆడబిడ్డకూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తా.

గతంలో దీపం పథకంతో ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ధరలు పెరిగాయి. ఆ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. జగన్ రెడ్డి రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నాడు. జగన్ రెడ్డి అప్పు చేసి రూ.10 ఇస్తున్నాడు. కానీ, నేను సంపద సృష్టించి ప్రతి ఒక్కరికీ ఇచ్చే ప్రతి రూపాయినీ రెట్టింపు ఆదాయం సృష్టించే మార్గం చూపిస్తాను. ఆడ బిడ్డని ఆర్ధిక శక్తిగా తయారు చేస్తా. దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నా తెలుగు ఆడబిడ్డని నిలుపుతా.

కేంద్రం యువ శక్తి అని ప్రకటించింది. మనం యువగళం అన్నాం. రెండింటినీ కలిపి ప్రతి యువకుడికీ నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. ప్రతి ఆటో డ్రైవర్ కు న్యాయం చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాను. వృద్ధులకు ప్రతి నెలా రూ.4000 పెన్షన్ ఇస్తా. దివ్యాంగులకు రూ.6000 ఇస్తా. అది కూడా ఏప్రిల్ నెల నుండే పెంచిన మొత్తాన్ని జూన్లో అందిస్తాను. రేషన్ షాపుల్లో పంచే బియ్యాన్ని కూడా పందికొక్కులా బొక్కిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం అందించే బాధ్యత నాది.

ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మొత్తం నియోజకవర్గాన్ని ఊడ్చేశాడు. గతంలో నక్కపల్లిలో ఏపీఐఐసీ ఏర్పాటు చేశాను. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తా. పెట్రో కెమికల్ కారిడార్ పూర్తి చేస్తా. ఇక్కడి యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలా అవకాశాలు కల్పిస్తాను. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి హబ్ గా మారుస్తాను. అప్పట్లోనే రూ.150 కోట్లతో వాటర్ ప్రాజెక్టు ఇచ్చాను. కానీ, మిగిలిన పనులు చేయకుండా జగన్ రెడ్డి దగా చేశాడు. దాన్ని పూర్తి చేసి తాగునీరిచ్చే బాధ్యత నాది.

మత్స్యకారులకు మినీ హార్బర్, రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చిసి సమస్యలన్నీ పరిష్కరిస్తాను. పాయకరావుపేటలో అంబేద్కర్ ఉద్యానవానాన్ని పూర్తి చేస్తాను. వెంకటేశ్వరస వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాను. ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి ప్రారంభిస్తామన్న జగన్ రెడ్డి దగా చేశాడు. కానీ, నేను న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. తమలపాకుల పరిశ్రమను అభివృద్ధి చేస్తాను.

జగన్ రెడ్డికి ఢిల్లీలో అడుగు పెట్టా వణుకు పుడుతుంది. కానీ, మన పార్లమెంటు అభ్యర్ధిగా సీఎం రమేష్ ని నిలబెడుతున్నా. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వంగలపూడి అనితను గెలిపించుకుందాం. భారీ మెజార్టీతో గెలిపించేందుకు సంకల్పం చేద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం.

 

Leave a Reply