సేవాలాల్ ఆశయాలను నీరుగారుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం : ఎం.ఏ షరీఫ్

-బంజారాలు ఏకతాటిపైకి వచ్చి జగన్ రెడ్డిని గద్దెదించాలి : ఎం. ధారు నాయక్
– టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్టీ సెల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ 285వ జయంతి వేడుకలు

బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ 285 వ జయంతి వేడుకలు టిడిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొని బంజారాల అభివృద్ధికి సేవాలల్ చేసిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న శాసనమండలి మాజీ చైర్మన్, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ షరీఫ్ మాట్లాడుతూ.. ‘బంజారాలకు టిడిపి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. సేవాలాల్ మహరాజ్ బంజారాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన కృషి వల్లే నేడు బంజారాలు ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారు. సేవాలాల్ ఆశయాలను అమలు చేయగలిగేది రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల్లోని ప్రతీ తెగ నష్టపోయింది.

గుంటూరులో డయేరియా సోకి ఇటీవల పద్మ అనే గిరిజన మహిళ మృతి చెందడం ఎంతో బాధాకరం. ఏజెన్సీలతో పాటు మైదాన ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యలు పోవాలంటే చంద్రబాబు నాయుడిని సి.ఎంను చేసుకోవాలన్నారు.

ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధారు నాయక్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సేవాలాల్ ఆశయాలకు తూట్లు పొడుస్తోంది. జగన్ రెడ్డికి గిరిజనుల పేరు ఉచ్ఛరించే నైతిక అర్హత లేదు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది డోలీ మరణాలు చోటుచేసుకుంటున్నా.. జగన్ రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదు. గిరిజన యువతను ఉన్నత విద్యకు దూరం చేసి గంజాయికి బానిసలుగా చేశాడు.

జీవో నెం -3 ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే జగన్ రెడ్డి కనీసం కోర్టులో అప్పీల్ చేయలేదు. గిరిజనుల అటవీ హక్కుల చట్టం-2006 ను ఉల్లంఘించి వందలాది గిరిజనుల భూములను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారు. జగన్ రెడ్డిని అధికారం నుంచి దించకపోతే గిరిజన అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. గిరిజనులంతా ఏకతాటిపైకి రావాలి. గిరిజనుల సత్తా జగన్ రెడ్డికి చాటాలి’ అని అన్నారు.

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ.. గిరిజనులు జగన్ రెడ్డి నిజస్వరూపం తెలుసుకోవాలి. జగన్ రెడ్డి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ట్రైబల్ సబ్ నిధులను దారిమళ్లించారు. గిరిజనులు సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు అమలు చేస్తే.. జగన్ రెడ్డి గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన 16 సంక్షేమ పథకాలను రద్దు చేశాడన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మనోహర్ నాయక్, గోపీ నాయక్, హనుమంతు నాయక్, రమేష్ నాయక్, బాలాజీ నాయక్, సాంబా నాయక్, రాముడు నాయక్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply