– ప్రస్తుత మద్యం ఉత్పత్తి కంపెనీలన్నీ బాబు చలవే
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు బాబు హయాంలో అనుమతులు పొందినవేనని, వాటిలో టీడీపీ నాయకులు, వారి బంధువులవే ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా పలూ అంశాలు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క మద్యం డిస్టిలరీకి గానీ, బ్రూవరీకి గానీ అనుమతివ్వలేదని అన్నారు. జగన్ ది సంక్షేమ బ్రాండ్ అయితే నారా వారిది సారా బ్రాండ్ అని ఎద్దేవా చేసారు.
ఆపద్ధర్మ సీఎంగా ఉన్న సమయంలోనే డజన్ల కొద్దీ చీప్ లిక్కర్ బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుదని, అయ్యప్ప, భవానీ, ఆంజనేయ మాలలు ధరిస్తే తాగడం తగ్గిస్తున్నారంటూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఘనత కూడా ఆయనదేనని చంద్రబాబు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సారా చరిత్ర మెత్తం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని అన్నారు. నారావారిది సారా బ్రాండ్ అయితే జగన్మోహన్ రెడ్డిది సంక్షేమ బ్రాండ్ అని అన్నారు.
నారావారి హయాంలో ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ బీర్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ వంటి సారా బ్రాండ్ లు ప్రవేశ పెడితే, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసా, దిశ, వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి లెక్కకు మించి సంక్షేమ బ్రాండ్ లు అమలు చేసారని అన్నారు. చంద్రబాబు హయాంలో 14 కొత్త డిస్టలరీలకు అనుమతులిచ్చి ప్రజల ఆరోగ్యం పాడుచేస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పడనున్న జిల్లాలలో 16 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.
పోలవరం ఎత్తు ఒక్క ఇంచ్ కూడా తగ్గదని చెబుతున్నప్పటికీ పచ్చ మీడియా గింజుకోవడం మాత్రం ఆపడం లేదని అన్నారు. నానాటికీ కనుమరుగవుతున్న టీడీపీ ఉనికిని కాపాడుకోవాలన్నదే వారి ఆరాటమని, ఆ బాధతోనే తప్పుడు కథనాలను వండి వారుస్తోందిని అన్నారు. పచ్చకుల మీడియా రాతలను నమ్మడం జనం ఎప్పుడో మానేశారని అన్నారు.