Home » జగన్ కు తన ఓటమి అర్ధమైంది

జగన్ కు తన ఓటమి అర్ధమైంది

• ఈసారి ఓటు… ప్రజల కోసం ప్రజలే వేసుకునే ఓటు
• భవిష్యత్తును ఆలోచించి కూటమికి ఓటు వేయాలి
• వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయింది
• మైనార్టీల భద్రత, భరోసాకు కూటమిది హామీ
• ప్రజల కోసం తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది
• దెబ్బ ఓ వైపు తగిలితే మరో వైపు బ్యాండేజీ వేసుకునే పెర్ఫామెన్స్ నాయకులను నమ్మకండి
• విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్

‘జగన్ కు తన ఓటమి అర్ధం అయింది. ఏం చేయాలో తెలియక గొంతు నుంచి బేల మాటలు వస్తున్నాయి. స్వరంలో వణుకు మొదలైంది. ప్రతిపక్షాలన్నీ కలిసి తనను ఓడించడానికి వస్తున్నాయని ప్రజల దగ్గర సింపతీ పొందాలని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షాలన్నీ నీపై విజయం సాధించడానికే వస్తాయి. నిన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని మరింత నాశనం చేయడానికి ప్రతిపక్షాలు లేవ’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రంలో ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తున్నారని జగన్ మొత్తుకుంటున్నాడు… అధికారులు బదిలీ కావడానికి జగన్ చేసిన తప్పులే కారణమని తెలిపారు. స్వామి భక్తిని చాటి, విధ్వంసానికి సహకరించిన అధికారులను నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ బదిలీలు చేస్తుంది… ఆ విషయం జగన్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన విధ్వంసం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇప్పుడు జగన్ కు తన ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే, ఏం మాట్లాడాలో తెలియక ప్రజల ముందు పశ్చాత్తాపం మాటలు, సింపతీ డైలాగులు కొడుతున్నాడని అన్నారు.

గురువారం సాయంత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో జరిగిన వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘వైసీపీ నాయకులు గత అయిదేళ్లలో చేయని అరాచకం లేదు. తిట్టని బూతు లేదు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి సతీమణి అని చూడలేదు.. సగటు మహిళా ప్రజాప్రతినిధులు అని చూడలేదు. రోడ్లపై నుంచి బయటకు వచ్చే మహిళలను వదల్లేదు. వీరి రౌడీయిజానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాధితులే. అలా గత అయిదేళ్లలో రెచ్చిపోయిన ప్రతి వైసీపీ రౌడీలకు చెబుతున్నాను. మీరు వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు. ఇకనైనా మీ దురాగతాలు ఆపండి. మీరు చేసిన ప్రతి విషయం మాకు గుర్తుంది.

అంబేద్కర్ గారు చెప్పినట్లు పాలించేవాడికి మనసు లేకపోతే మీరిచ్చిన అధికారం ఎందుకు పనికిరాదు. ముస్లిం మైనార్టీలకు ఈ దేశం మీద హక్కుంది. ముస్లిం మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మొదట ముందుకు వచ్చి పోరాడేది పవన్ కళ్యాణ్. దేశ సమగ్రత కోసం ఆలోచనలు, జాతీయ భావాలు ఉన్నవాడిని. కూటమి ప్రభుత్వం వస్తే మైనార్టీలకు భద్రత ఉండదని జగన్ విష ప్రచారం మొదలుపెట్టాడు. నేను ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేయను. ప్రధాని మోదీ గారు సైతం ముస్లిం మైనార్టీల కోసం ఆలోచించే నాయకుడు. హజ్ యాత్రకు భారత్ దేశం నుంచి అధికంగా వెళ్లాలని సౌదీ రాజుతో ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో ముస్లింల పవిత్ర హజ్ యాత్రకు దేశం నుంచి చాలామంది వెళ్తున్నారు.

18 లక్షల మంది ముస్లిం మైనార్టీలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. వారి ఉన్నతికి ఎప్పటికి అప్పుడు తగిన విధంగా ప్రాధాన్యం ఇస్తూనే ఉంది. మైనార్టీల భద్రతకు, బతుకు భరోసాకు, వారి ప్రొత్సాహానికి కూటమి ప్రభుత్వం పూర్తి హామీ ఉంటుంది. ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వంలో 50 ఏళ్లకు పింఛను అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గాలకు, ఖబరిస్థాన్ లకు స్థలాల కేటాయిస్తాం. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం, నూర్ భాషా కార్పొరేషన్ ఏటా రూ.100 కేటాయింపు ఉంటుంది. దుల్హాన్ పథకంలో రూ.లక్ష ప్రోత్సాహకం అందించి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం.

జగన్ మాటలకు విశ్వసనీయత లేదు
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ అంటూ జగన్ కొత్త రాగం పాడుతున్నాడు. గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తానని మోసం చేసిన వ్యక్తి జగన్. మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతానని నమ్మబలికిన వ్యక్తి జగన్. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని చెప్పి నిలువునా ముంచేసిన వ్యక్తి జగన్. అసలు అలాంటి వ్యక్తి చెప్పే మాటలు నమ్మగలమా..? అతడి మాటలకు విశ్వసనీయత ఉంటుందా..? మైనార్టీలు ఆలోచించాలి. నాలుగు శాతం రిజర్వేషన్ అంశాన్ని జగన్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తెరపైకి తెచ్చాడు తప్పితే, మరేమీ కాదు.

కాపు రిజర్వేషన్లను సైతం రాష్ట్రంలో 1950 తర్వాత తీసేశారు. వారు కూడా రిజర్వేషన్లు కోరుతున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలంటే మొదట వారికి ఉపాధి చూపించాలి. అసలు ఉపాధి, ఉద్యోగాలు తీయని జగన్ రిజర్వేషన్ కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వాలంటీర్లు ఉద్యోగం ఇస్తున్నానని జగన్ చెబుతున్నాడు. రూ.5 వేలతో కుటుంబాలను నెట్టుకురావడం సాధ్యమేనా..? దీన్ని యువత ఆలోచించాలి.

నేరస్తులను వైసీపీ ప్రోత్సహిస్తోంది
విజయవాడ దుర్గమ్మ రథం వెండి సింహాలు పోతే ఈ వైసీపీ ప్రభుత్వానికి పట్టదు. కాల్ మనీలో అరెస్టు అయిన వారిని దుర్గగుడి పదవుల్లో నియమిస్తుంది. ఓ వైపు కంటికి దెబ్బ తగిలితే మరోవైపు ప్లాస్టర్ వేసుకునే నాయకులను ప్రోత్సాహం ఇస్తుంది. అదేం గులకరాయో తెలీదు కాని ముఖ్యమంత్రికి తగిలిన తర్వాత 360 డిగ్రీల్లో అక్కడున్న మరో నాయకుడికి బలంగా తగిలింది. పాపం దానికి అస్కార్ లెవెల్ యాక్టింగు, పెద్ద బ్యాండేజీ వేసుకొని ఎన్నికల్లో సింపతీ డ్రామాలు వేస్తారు. అంతటి పెర్ఫార్మెన్స్ నాకు రాదు.

విజయవాడ వన్ టౌన్ లో భయంకరమైన డ్రైనేజీ దుర్గంధం వెదజల్లుతోంది. ప్రతి రోజూ ఇక్కడ ఉండేవారు ఎలా బతుకుతున్నారా అనిపిస్తుంది. డ్రైనేజీ సమస్యను కూటమి ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో తీరుస్తాం. కొండలపై బతుకుతున్న వారికి ప్రత్యేక ఆరోగ్య సమస్య నా దృష్టికి వచ్చింది. పక్షవాతం విపరీతంగా వస్తోంది. ఇది కూడా ఉద్దానం లాంటి సమస్యే. దీనిపై దృష్టి పెడతాం. సమగ్ర అధ్యయనం చేసి, కొండలపై ఉండే పేదలకు తగిన ఆరోగ్య భరోసా ఇస్తాం. . ఓటు బాధ్యతతో వేయండి. ఈ సారి మీ భవిష్యత్తును ఆలోచించి వేయండి. నాకు ఖుషి లాంటి పది హిట్లు వచ్చినా ఆనందం లేదు. ప్రజల కోసం తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. మీ కోసం బలంగా నిలబడతాను.

జనసేన నాయకులకు జనసైనికులే బలం
రాష్ట్రంలో గూండాల పాలన నుంచి రక్షించాలని, అచారక పాలన నుంచి విముక్తి ఇవ్వాలని, బూతులు మాట్లాడేవారి నుంచి ఆడబిడ్డలను బయటపడేయాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని కోరాను. పెద్దలను కలిసినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు, నష్టాలను చెప్పాను. చివరికి బీజేపీ నాయకత్వం కూటమిలో చేరేందుకు ముందుకు వచ్చింది. అలాంటి సమయంలో వారు కోరింది ఒక్కటే. అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ ప్రాతినిధ్యం ఉండాలని, బలమైన గొంతు వినిపించేవారు కావాలని చెప్పారు. దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వారు కావాలని కోరారు. దీంతోనే ఈ సీటును సుజనా చౌదరికి కేటాయించాం. కూటమి ప్రభుత్వంలో ఎవరికి సీటు ఇచ్చినా అంతే క్రమశిక్షణగా పనిచేస్తున్నాం.

వంగవీటి రంగా ఆశయాలు చట్టసభల్లో వినిపించాలి
నాకెంతో అభిమాన నాయకులు వంగవీటి మోహన రంగా పేరు ప్రస్తావించకుండా విజయవాడ రాజకీయాలు ఉండవు. రంగా ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు వంగవీటి రాధా . ఆయనెందుకో ఈ మధ్య రాజకీయాల మీద అలిగారు. రాధా ని ఎన్నోసార్లు రాజకీయంగా యాక్టివ్ కావాలని, క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అడిగాను. రంగా ఆశయ సాధనకు, ఆయన ఆలోచనలను విజయవాడ ప్రజలకు పంచాలని కోరాను. ఇక్కడి రాజకీయాలకు అవసరం అని చెప్పాను.

అయితే అప్పుడు నిశ్శబ్దంగా ఉన్న రాధా కీలక సమయంలో జూలు విడిల్చి, కూటమి కోసం బలంగా పనిచేయడం ఆనందం నింపింది. వైసీపీలో ఆత్మ గౌరవం తాకట్టు పెట్టలేక వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాధా గొంతు మళ్లీ చట్టసభల్లో వినిపించాలని కోరుకుంటున్నాను. వంగవీటి రంగా స్ఫూర్తి, ఆశయాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను.

కూటమి నుంచి విజయవాడ ఎంపీగా బరిలో ఉన్న కేశినేని చిన్ని కి సైకిల్ గుర్తుపై, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి కి కమలం పువ్వు గుర్తుపై, విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్న గద్దె రామ్మోహన్ కి సైకిల్ గుర్తుపై, విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బొండా ఉమా కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి’’ అని కోరారు. ఈ సభలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, టీడీపీ నాయకులు జలీల్ ఖాన్, బేగ్, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply