ఏపీలో జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ పథకంలో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు రూ.285.35 కోట్లను సీఎం జగన్ జమ చేశారు.
జగనన్న చేదోడు పథకం ద్వారా షాపులు ఉన్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు, షాపులు ఉన్న 98,439 మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులు ఉన్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40.81 కోట్లు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం రూ.583.78 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. లంచాలకు, వివక్షకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా నుంచి సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.