Suryaa.co.in

Andhra Pradesh

అహంకారంతో అందర్నీ దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి

-జగన్ సార్ వన్స్ మోర్ అంటున్న సాక్షి అడ్వర్టైజ్మెంట్ దారులు… జగన్ సార్ నో మోర్ అంటున్న రాష్ట్ర ప్రజలు
– ఐదేళ్లలో జనాలకు దూరమైన జగన్ … పది నెలల్లో ప్రజలకు చేరువైన నారా లోకేష్
– జగన్ పాదయాత్రకు సంపూర్ణ సహకారాన్ని అందించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన జగన్ ప్రభుత్వం
– నారా లోకేష్ ఇంపోర్టెడ్ లీడర్ కాదు… పీపుల్స్ లీడర్
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో అందరినీ దూరం చేసుకున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు . అమాయకత్వాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు భరిస్తారు కానీ అహంకారాన్ని ఎవరు సహించరు. ఈ ఐదేళ్లలో వ్యక్తిగతంగా కలుసుకోవడానికి పార్టీ కి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏ ఎమ్మెల్యేను, ఎంపీ ని కదిపి మనసు విప్పి మాట్లాడినా వారు కన్నీళ్లు పెట్టుకునేది ఒక్కటే తక్కువ… అంత బాధతో మాట్లాడుతున్నారన్నారు .

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎమ్మెల్యేలంటే పురుగుల కంటే హీనంగా జగన్మోహన్ రెడ్డి చూశారన్నారు . నిన్న, మొన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక పదిమంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలతో వేరువేరుగా ముఖాముఖిగా కేవలం 65 నుంచి 70 సెకండ్ల వ్యవధి పాటు మాట్లాడారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో ముఖాముఖి 65 నుంచి 70 సెకండ్ల పాటు మాట్లాడడం అంటే ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే, రానున్న రోజుల్లో పార్టీ లో మరిన్ని పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి . ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవాన్ని కోరుకుంటారు. దానికోసమే రాజకీయాల్లోకి వస్తారు. 90 మంది ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేయడానికి పనికి రాకుండా పోయారంటే, పనికిరాని పనులను చేసింది ఎవరు? అని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. విజయవాడలో మల్లాది విష్ణు తో పాటు, గొడ్డు చాకిరీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పనికిరాని వారయ్యారు. నరసాపురం నియోజకవర్గ పరిధిలో ప్రసాద్ రాజు కూడా ఎమ్మెల్యే టికెట్ లేదని, ఎంపీ టికెట్ ఇస్తామన్నట్లు తెలిసింది. ప్రతి ఒక్కరిని అవమానించే విధంగా మారుస్తామని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని సీతారాం కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. తన స్థాయిని పక్కనపెట్టి, శాసనసభలో పార్టీ సైనికుడి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి కోసం తమ్మినేని సీతారాం అంకిత భావంతో పనిచేశారు. స్పీకర్ హోదా లో ఉండి కూడా తన స్థాయిని మరిచి మాట్లాడిన వ్యక్తికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే ఎంతో సమర్థవంతుడని చెప్పి మంత్రివర్గంలోకి తీసుకున్న జోగి రమేష్ కూడా ఇప్పుడు పనికిరానివాడయ్యాడు.

ప్రజల్లో ఒక్క వ్యక్తిపైనే హేహ్య భావం ఉంది. ఆ హేహ్య భావాన్ని అందరికీ సమానంగా పంచి, ప్రజలకు తనమీద గొప్ప భావం ఉన్నట్లుగా చిత్రీకరించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడే తప్ప ఇది మరొకటి కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రజల కోసం నిజాలు చెప్పే క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకొచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు. పార్లమెంటులో రైల్వే శాఖ గురించి అనుబంధ ప్రశ్న వచ్చినప్పుడు కోటిపల్లి, నరసాపురం మధ్య రైల్వే పనులు వేగవంతం చేయాలని నేను కోరడం జరిగింది. దానికి, కోటిపల్లి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా పార్టీ ఎంపీ… తన ప్రాంత సమస్యను ఎలా లేవనెత్తుతారని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. టికెట్ వస్తుందని ఆశాభావంతోనైనా ఆ ఎంపీ ఉండి ఉండవచ్చు , మర్యాదతోనైనా కావచ్చు… లేకపోతే రఘురామకృష్ణం రాజు ఏది మాట్లాడినా గిల్లికజ్జాలను పెట్టుకోవాలని ఇచ్చిన క్లాసు వల్ల కాబోలు, సదరు ఎంపీ ఈ విధంగా మాట్లాడి ఉంటారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

చరిత్ర లో విజయవంతమైన సభలలో యువ గళం ఒకటి కానుంది
చరిత్రలో విజయవంతమైన సభలలో ఒకటిగా యువ గళం బహిరంగ సభ నిలవనుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకోవడానికి పది నెలల క్రితం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఐదేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు నెలల వ్యవధిలోనే ప్రజా దర్బార్, రచ్చబండ కార్యక్రమాలను ప్రారంభిస్తానని చెప్పి, ఇప్పటివరకు ప్రారంభించింది లేదు.

అప్పుడప్పుడు బటన్ నొక్కే కార్యక్రమానికి అడుగు బయట పెట్టే జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు ఆక్సిజన్ పంచే చెట్లను నేల కూలుస్తున్నారు. భీమవరం లో 150 ఏళ్ల వయసున్న మహా వృక్షాన్ని నేలపాలు చేశారు.. ఇలా ప్రజల నుంచి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ను పంచే చెట్లను నేలకూల్చడం దారుణం. ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి జనాలకు దూరమైతే, పది నెలల వ్యవధిలో ప్రజలకు నారా లోకేష్ చేరువయ్యారని సుస్పష్టమవుతుంది. యువ గళం సభ లో నారా లోకేష్ తన వాణిని వినిపించనున్నారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ హాజరు కానున్నారు.

రాష్ట్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన బహిరంగ సభలలో ఒకటిగా యువ గళం బహిరంగ సభ నిలవనుంది. యువ గళం పాదయాత్ర ప్రారంభించక ముందు నారా లోకేష్ ను వై కాపా నాయకులు, నాయకురాళ్లు పప్పు, ముద్దపప్పు అంటూ పిలిచేవారు. ప్రజలతో మమేకమైన తరువాత నారా లోకేష్ ముద్దపప్పు కాదు. తెలుగువారికి ఎంతో ప్రీతి ప్రాత్రమైనా ఆవకాయ తో కలిపిన ముద్దపప్పు అన్నము లాంటి వారు. ఆవకాయతో కలిపిన ముద్దపప్పు అన్నం తెలుగు వారందరికీ ఎంత ఇష్టమో, ఇప్పుడు నారా లోకేష్ కూడా అందరికీ అంతే ఇష్టమైన వ్యక్తిగా మారారు. పాదయాత్ర పరిణామ క్రమాన్ని చూసిన తర్వాత లోకేష్ మాట్లాడుతున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

పది నెలల పాటు ఒక వ్యక్తి ప్రజలతో కలిసి నడిస్తే ఇంతలా మార్పు సాధ్యమా అని ఆశ్చర్యపోతున్నారు. గతంలో పాదయాత్ర చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పదవిని స్వీకరించారని, మీరు కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ముఖ్యమంత్రి పదవికి కాదు ప్రజలకు మరింత చేరువవుతానని నారా లోకేష్ చిన్న వయసులో ఎంతో పరిపక్వతతో సమాధానం చెప్పారు. ఈ సమాధానాన్ని ఆ వయసు ఉన్న నాయకుడి నుంచి ఎవరు ఊహించి ఉండరు.

ఎవరో కొంతమంది పనికిమాలిన వారు తప్పితే, ప్రతి ఒక్కరూ నారా లోకేష్ ప్రసంగానికి కితాబునిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ సహకారాన్ని అందించారు. అదే నారా లోకేష్ పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా సహాయ నిరాకరణను చేపట్టింది. పోలీస్ సెక్షన్ 30 విధించడం, వాహనాల్ని సీజ్ చేయడం, మాట్లాడుతున్న మైకు లాగేసుకోవడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇదేవిధంగా అవరోధాలను కల్పించి ఉంటే ఆయన అడ్రస్ లేకుండా పోయేవారు.

ప్రభుత్వం ఎన్ని అవరోధాలను కల్పించిన నారా లోకేష్ మొక్కవోని దీక్షతో పాదయాత్రను కొనసాగించారు. ప్రజలతో మమేకమయ్యారు. యువతను కలిసి సెల్ఫీలు దిగారు. అన్ని వర్గాల వారిని కలుసుకున్నారు. వారితో ముఖాముఖి ముచ్చటించారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలను ఒడిసిపట్టారు.. వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. నారా లోకేష్ ఇంపోర్టెడ్ లీడర్ కాదు… పీపుల్స్ లీడర్ అని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారన్నారు.
అయినా వైకాపా అధికారంలోకి రావడానికి కోడి కత్తి సంఘటన, బాబాయి హత్య వంటి సంఘటనలను జగన్మోహన్ రెడ్డి అనువుగా మలుచుకున్నారు. ఇప్పుడు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి పై కేసులు పెట్టించే చెత్త ప్రయత్నాలన్నీ చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

సెంటిమెంట్ ను రాజేసిన ఆ రెండు సంఘటనలు
వైకాపా అధికారంలోకి రావడానికి కోడి కత్తి కేసు, బాబాయ్ హత్య వంటి ఘటన ప్రజల్లో సెంటిమెంటును రాజేశాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన జన్మ దినోత్సవ కేక్ ను కోడి కత్తి, గొడ్డలి ద్వారా కట్ చేస్తే… తన విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆ రెండు ఘటనలని గుర్తు చేసుకున్నట్లు అవుతుందని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గర్వంగా జరుపుకునే ఆఖరి పుట్టినరోజు ఇదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అప్పుడే కొంతమంది వ్యక్తులు సాక్షి దినపత్రికలో జగన్ సార్ వన్స్ మోర్ అని అడ్వర్టైజ్మెంట్లను వేయిస్తున్నారు.

కానీ ప్రజలు మాత్రం జగన్ సార్ నో మోర్ అని తమ మనసుల్లో అనుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో జరుపుకునే పుట్టిన రోజు వేడుకలకు సాక్షి దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్లు వేసేవారు ఉండరు. సాక్షి యాజమాన్యమే ఎవరో ఒకరి పేరిట అడ్వర్టైజ్మెంట్లు వేసే దుస్థితి నెలకొంటుంది. మద్య నిషేధం గురించి గతంలో మంత్రి రోజా చేసిన ప్రసంగం వీడియో ఫుటేజ్ ను ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.

మద్యం వల్ల మహిళలపై దాడులు జరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధం చేపడుతారని, మద్య నిషేధం అమలు చేయకపోతే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగరని రోజా చెప్పారు. మద్య నిషేధం మాట దేవుడెరుగు రెండున్నర దశాబ్దాల పాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చే విధంగా అరువు తెచ్చారు.

తన చెల్లి షర్మిల ను ఎలా చూసుకుంటారో, రాష్ట్రంలోని మహిళలను జగన్మోహన్ రెడ్డి అలాగే చూసుకుంటారన్న రోజా వ్యాఖ్యలు మాత్రం అక్షరాలా నిజం అనిపిస్తుంది. చెల్లిని ఎలా వదిలేశారో, రాష్ట్ర మహిళలను అలాగే వారి మానాన వారిని వదిలేశారు. బర్రెల అక్కకు ఇచ్చిన విలువ కూడా షర్మిల కు ఇవ్వడం లేదని ప్రజలు అంటున్నారన్నారు

LEAVE A RESPONSE