– టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
జగన్ రైతు వ్యతిరేక విధానాలతో పాలిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని రైతాంగం వ్యవసాయం చేయలేమనే దుస్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విధానాలతో రైతులు పంట విరామం చేపట్టే పరిస్థితి నెలకొందని వివరించారు. పెట్టుబడి రాయితీ ఎత్తేశారని, యాంత్రీకరణకు కోతపెట్టారని నిమ్మల పేర్కొన్నారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని అన్నారు. ఈసారి టీడీపీ – జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, జగన్ ప్రభుత్వం చేసిన దోపిడీని వెనక్కి కక్కిస్తామని స్పష్టం చేశారు.
సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం అంటే ఏంటో చూపించాలి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
తాడేపల్లిగూడెం జెండా సభకు టీడీపీ, జనసేనే నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జెండా ఎగరాలని అభిలషించారు. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం అంటే ఏమిటో చూపాలని పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ-జనసేన శ్రేణుల్లో చిచ్చుపెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ-జనసేన కలయికను స్వాగతించి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు.