Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో త్వరలోనే జైలర్ సినిమా సీన్ రిపీట్ అవుతుంది

– కిలో బంగారానికి ఎంత అవుతుందో జగన్మోహన్ రెడ్డి కి తెలుసా?
– మళ్లీ నరసాపురం నుంచి లోక్ సభ సభ్యుడిగానే పోటీ చేస్తా
– ఒక మహిళను అవమానిస్తే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ అవమానమే
– ఓడిపోయాక జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయా?
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి కానీ తండ్రి లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఆయన నిజ స్వరూపం తెలిసిపోయి ఉంటుంది. రాష్ట్రంలో త్వరలోనే రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా సీన్ రిపీట్ అవుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. జైలర్ చిత్రంలో కథానాయకుడైన రజినీకాంత్ కుమారుడు పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్నతమైన స్థానంలో ఉండి దొంగతనాలను చేస్తుంటాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న రజినీకాంత్ అతన్ని చంపాలని ఆదేశిస్తారు. రాష్ట్రంలోనూ రేపు అటువంటి సీన్ రిపీట్ అవుతుందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి గురించి మా పార్టీ నాయకులు కూస్తున్న కారు కూతలు వింటే బాధనిపిస్తోంది. విదేశాల్లో మా పార్టీకి ఓ ప్రతినిధి ఉన్నాడు. వాడు మరింత వరస్ట్ గా మాట్లాడుతున్నాడు. అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సిఐడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు కూడా చేతులెత్తేశాయి.

నన్ను గతంలో దూషించి తప్పించుకున్నాడు. కానీ మహిళల గురించి అనుచితంగా మాట్లాడినందుకు టైగర్ కా హుకుం వస్తుందని అనిపిస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఒక రాష్ట్ర అధ్యక్షురాలు అయిన మహిళ గురించి అనుచితంగా మాట్లాడిన పట్టించుకోకపోతే, మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్న రక్షణ ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

పనికిమాలిన యాప్ లు పెడుతున్నారు. కానీ మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండి పడ్డారు. దావోస్ లో ఆ వ్యక్తితో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్ను ప్రేమించే వ్యక్తి, నువ్వు చాటుగా ప్రేమిస్తూ, మాట్లాడిస్తున్న వ్యక్తిపై ఎటువంటి చర్యలు ఉండవు కానీ, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటివారు ఏమి మాట్లాడకపోయినా ఆయన ఇంటి పైకి మాత్రం పోలీసులను పంపించి వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఒక మహిళను అవమానిస్తే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ అవమానమేనని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. టైగర్ ఎవరని విదేశాల్లో ఉన్న మా పార్టీ ప్రతినిధి ప్రశ్నిస్తూ, వీడియో విడుదల చేస్తే టైగర్ ఎవరో తెలుస్తుందన్నారు..

హవ్వ… జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై కూడా ఫోటోలా?
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై కూడా నవరత్నాలు, పార్టీ రంగులు, ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రేపు పొద్దున రాష్ట్రంలో మా పార్టీ ఓడిపోవడం ఖాయం. ఓడిపోయాక అప్పుడు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయా అంటూ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, జనన మరణ ధ్రువీకరణ పత్రాలపై తన ఫోటోలను ముద్రించుకున్న దాఖలాలు లేవు. ఈ సర్టిఫికెట్ ను తీసుకొని పొరుగు రాష్ట్రానికి వెళితే, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటూ నిలదీశారు.

ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి సర్టిఫికెట్ ఉంటుందా అని వారు ప్రశ్నిస్తే… పిచ్చి, ఫోటోల పిచ్చితో మా ముఖ్యమంత్రి ఇలాగే సర్టిఫికెట్లను ముద్రించారని చెప్పగలమా? అని అన్నారు. పార్టీ రంగులు, నవరత్నాలు, ఫోటోల గొడవ ఏంటి అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రేపు జగనన్న పచ్చబొట్టు పథకాన్ని ప్రవేశపెట్టి, పచ్చబొట్టు వేసుకున్న వారికే పింఛన్ ఇస్తామని అంటారేమోనని అపహాస్యం చేశారు. రోడ్లు బాగాలేవని అంటున్నవారికి గుంటలో పడి దెబ్బలు తగిలితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అందజేస్తున్నాం.

శాశ్వతంగా వికలాంగులు అయితే వికలాంగులకు ప్రత్యేక పథకాన్ని అందిస్తున్నామని ఒక అధికారి, బాధితుడితో అంటున్నట్లుగా ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కార్టూన్ జోక్ గా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉందన్నారు. రాష్ట్రంలో జగనన్న రోడ్లు వేయరని ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికైనా ఫోటోల పిచ్చి తగ్గించుకొని పాలనపై దృష్టి పెడితే మంచిదని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. అయినా ఇప్పటికే, సమయం మించిపోయిందని, ప్రజలు అప్రమత్తమైయ్యారని చెప్పారు.

పరిణితి చెందిన నాయకుడు చంద్రబాబు నాయుడు
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రజల ముందుకు రానున్నారని ప్రజలకు కిలో బంగారం ఇస్తాం… బెంజ్ కారు ఇస్తామని వాగ్దానాలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు . కిలో బంగారానికి ఎంత అవుతుందో జగన్మోహన్ రెడ్డి కి తెలుసా? కిలో బంగారానికి తక్కువలో తక్కువగా 60 లక్షల రూపాయల అవుతుంది. బెంజ్ కార్ కు 40 లక్షల రూపాయలు కావాలి.

అంటే ఒక్కొక్క మనిషికి కోటి రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎందుకు చెబుతారు… ప్రజలకు ఏది కావాలో అదే ఆయన చేస్తారు. అయినా బుద్ధి ఉన్నవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న బుద్ధిలేని మాటలను నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. ఏడాదికాలంగా ఇదే విషయాన్ని ప్రజలకు వేలం వెర్రిగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటుంటే అసహ్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పరిణితి చెందిన నాయకుడు… ప్రజలకు ఏది అవసరమో, అదే చేస్తారన్నారు.

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఈ పేర్లు ఉండవు
తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో ఏర్పడనున్న ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు మహానుభావుల పేర్లను పెట్టి, ప్రస్తుతమున్న జగనన్న, వైయస్సార్ పేర్లను తొలగించడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు, లేదంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్లను పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి, వైయస్సార్ పేర్లతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు చదివి వినిపించారు.

పీఎం కిసాన్ పథకానికి వైయస్సార్ రైతు భరోసా అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. వైయస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో ముద్రించి, పిఎం కిసాన్ అనే పేరును కనిపించి కనిపించినట్లుగా ముద్రిస్తున్నారు. రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 7500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,500 రూపాయలను ఇస్తుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్లు తెలుసుకొని 5300 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లుగా తెలిసిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రచారం కల్పించడానికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో వేసి, మరొకవైపు మా వాడి ఫోటో వేసుకోవచ్చు. కానీ అలా కాకుండా జేబులో నుంచి సొమ్ము తీసి ఇచ్చినట్లుగా బిల్డప్ ఇస్తూ, తన తండ్రి ఫోటో, తన ఫోటోను ముద్రించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి , రాజశేఖర్ రెడ్డిపేర్లను పెట్టడం జరిగిందన్న రఘురామ కృష్ణంరాజు , వాటి పేర్లను తొలగించి రానున్న ప్రజా ప్రభుత్వంలో లబ్ద ప్రతిష్టులైన వారి పేర్లను పెట్టి, వారిని గౌరవిస్తామన్నారు.

ఎదుటివారిని గౌరవిస్తే మన గౌరవం పెరుగుతుంది. అంతేకానీ తనను తానే గౌరవించుకుంటే గౌరవం తగ్గుతుందన్నారు. ఈ విషయం క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి కి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బైబిల్లో ఈ విషయాన్ని చెప్పడం జరిగిందని తెలిపారు. తన వ్యక్తిగత కంపెనీలకు జగతి, జనని అని వివిధ పేర్లను పెట్టుకుంటూ… ప్రజాధనంతో అమలు చేసే సంక్షేమ పథకాలకు మాత్రం తన పేరు, తన తండ్రి పేరు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉంది. సొంత కంపెనీలకు తమ పేర్లు పెట్టుకుంటే అవి తమ కంపెనీలేనని తెలిసిపోతుందని కాబోలు వేరే పేర్లు పెట్టుకొని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం తమ పేర్లను పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

షర్మిలని తీవ్రంగా ట్రోల్ చేసిన జగనన్న సోషల్ మీడియా వారియర్స్
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల ని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వారియర్స్ తీవ్రంగా ట్రోల్ చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గతంలో తనను ఇదేవిధంగా ట్రోల్ చేసేవారని, ఇప్పుడు షర్మిల ని అదేవిధంగా ట్రోల్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి ఆ పార్టీ నాయకత్వమే కారణమని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొంటూ, అయినా షర్మిల ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారోనని పరోక్షంగా విమర్శించారు.

సజ్జల వ్యాఖ్యలతో జూనియర్ మిల్లెట్ రంగంలోకి దిగి సోషల్ మీడియాలో షర్మిల ని తీవ్రంగా ట్రోల్ చేయించారన్నారు. సజ్జల వ్యాఖ్యలపై షర్మిల గారు స్పందిస్తూ వెలుగులుంటే తెలంగాణ అని, చీకట్లు ఉంటే ఆంధ్రా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కి షర్మిల హితవు పలుకుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు. షర్మిల ని అవసరం ఉన్నంతవరకు వాడుకొని వదిలేశారు.

ఆమె జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎన్నో బూట్ల జతలు అరిగిపోయి ఉంటాయి. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు అడ్డుకున్నారు. కానీ అదే షర్మిల తెలంగాణలోను విజయవంతంగా పాదయాత్రను నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ని చిన్న వయసులోనే పిసిసి అధ్యక్షుడిని, మంత్రిని, నాలుగు సార్లు ఎంపీని, ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించడం దారుణం. తల్లితో చెల్లితో సంబంధం లేకుండా నడిరోడ్డుపై వదిలేసి, ప్రతి ఒక్కరికి మీ బిడ్డనే నేను అంటూ, మీ అన్నయ్యను, మీ మావయ్యను అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి.

ముందు తల్లితో బాబు అని, చెల్లితో అన్నయ్య అని , మేనల్లుడు మేనకోడలితో మావయ్య అని పిలిపించుకోవాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నషర్మిల గారు, రేపు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోను భర్తతో కలిసి ఆ పార్టీకి మద్దతు ఇవ్వనుంది. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది ఏ పార్టీపై ఉంటుందో అందరికీ తెలుసునని, నేను చెప్పనని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

విధినిర్వహణలో నియమావళిని ఉల్లంఘించిన సంజు , సుధా ని శిక్షించాలి
విధి నిర్వహణలో నియమావళిని ఉల్లంఘించి, హైదరాబాద్, ఢిల్లీలో మీడియా సమావేశాలను నిర్వహించిన సిఐడి చీఫ్ సంజయ్ ని, రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ని శిక్షించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. వీటికైనా ఖర్చును వారి నుంచి వసూలు చేయాలని సత్యనారాయణ అనే వ్యక్తి వేసిన పిటీషన్ లో తాను ఇంప్లిడ్ అయినట్లు తెలిపారు. న్యాయమూర్తి సమక్షంలో ఇచ్చిన 164 స్టేట్మెంట్ ను సంజయ్ , సుధాకర్ రెడ్డి బహిర్గతం చేయడం కచ్చితంగా నియమావళిని ఉల్లంఘించడమేనని తెలిపారు.

నరసాపురం నుంచి మళ్లీ లోక్ సభ సభ్యుడిగానే పోటీ చేస్తా
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానానికి టిడిపి, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎంపీలు ఎవరు తిరిగి పోటీ చేయడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ, తాను మాత్రం ఎంపీ గానే పోటీ చేస్తాను. ఎంపీగా ఇతరులు పోటీ చేయడానికి అనాసక్తి ప్రదర్శించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు..

LEAVE A RESPONSE