Suryaa.co.in

Andhra Pradesh

విశాఖలో జనసేనానికి జనహారతి

  • శనివారం పెందుర్తి నియోజక వర్గం వెళ్లిన పవన్ కళ్యాణ్
  • బీచ్ రోడ్డు నుంచి సుజాత నగర్ వరకు అడుగడుగునా జనసేన శ్రేణుల స్వాగతం
  • సమస్యలు చెప్పుకొన్న జన సామాన్యం
  • సమస్యలు వింటూ సాగిన పవన్ కళ్యాణ్
  • ప్రతి సమస్యపై గళం విప్పుతానని హామీ

వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ప్రతి అడుగులో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నపట్టికీ పవన్ కళ్యాణ్ బయటికి వస్తున్నారంటే ఆ ఆంక్షల కంచెలు దాటుకుని వేలాదిగా రోడ్ల మీదకు వస్తున్నారు. శనివారం పెందుర్తి నియోజకవర్గం, సుజాత నగర్ లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జనసేనానికి జనం ప్రతి అడుగులో ఘన స్వాగతం పలికారు. బీచ్ రోడ్డు నుంచి పోలీసులు తీవ్ర ఆంక్షలు అమలు చేసినప్పటికీ పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. కైలాసగిరి, సింహాచలం, వేపగుంట, సుజాత నగర్ ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి పవన్ కళ్యాణ్ కి జేజేలు పలికారు.

  • బారులు తీరిన జనం
    సింహాచలం, వేపగుంట, సుజాతనగర్ కూడళ్లలో పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. హల్లో ఏపీ.. బైబై వైసీపీ నినాదాలతో హోరెత్తించారు. సింహాచలం – అడవివరం వద్ద ఆడపడుచులు పవన్ కళ్యాణ్ కోసం ఆప్యాయంగా జామ పండ్లు తీసుకురాగా వాటిని స్వీకరించారు. తనకోసం పండ్లు తెచ్చిన ఆడపడుచులను ఆప్వాయంగా పలుకరించారు.

సుజాతా నగర్ ప్రధాన రహదారి నుంచి వరలక్ష్మి ఇంటి వరకు అపార్ట్ మెంట్ల వాసులంతా పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా రోడ్ల మీదకు వచ్చేశారు. పవన్ కళ్యాణ్ ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు.

  • సమస్యలపై వినతుల వెల్లువ
    సుజాతనగర్ కు పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న విశాఖ వాసులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు వచ్చారు. ప్ల కార్డుల ద్వారా సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

సింహాచలం వద్ద సింహాచలం పంచ గ్రామాల సమస్య పరిష్కరించాలంటూ బాధిత ప్రజలు ప్లకార్డులతో పవన్ కళ్యాణ్ వాహన శ్రేణి వద్దకు వచ్చారు. తమ సమస్యపై వినతిపత్రం అందచేశారు. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. వేపగుంట వద్ద ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ ని కలిశారు. గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం ఇవ్వలేదని, మా గ్రామ యువతపై పెడుతున్న అక్రమ కేసులు ఎత్తివేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బ్యానర్లు ప్రదర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ని కోరారు.

గ్రీన్ టాక్స్ పేరిట జరుగుతున్న దోపిడిని అప్పలరాజు అనే ట్రక్కు డ్రైవర్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పక్క రాష్ట్రం తమిళనాడులో కేవలం రూ. 200, తెలంగాణలో రూ.500  కట్టించుకుంటుంటే, మన రాష్ట్రంలో రూ. 6660 ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ టాక్స్ వసూళ్లపై మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ బాధిత ట్రక్కు డ్రైవర్లకు భరోసా ఇచ్చారు.

  • జనసంద్రం మధ్యనే తిరుగు ప్రయాణం
    సుజాతనగర్ నుంచి తిరుగు ప్రయాణంలోనూ జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదే ఉన్నారు.  పెందుర్తి వెళ్లేప్పటికంటే తిరుగు ప్రయాణంలో రెట్టింపు ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం జన సంద్రం మధ్య సాగింది.

LEAVE A RESPONSE