గుంటూరు నగరంపై జనసేన ప్రత్యేక దృష్టి

గుంటూరు నగర రాజకీయాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గుంటూరులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ ను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నేరెళ్ల సురేష్ ను ప్రత్యేకంగా పిలిపించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

గుంటూరు నగరంలో జనసేన వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం దిశానిర్దేశం చేశారు. పార్టీ కమిటీలు, నగరంలో కీలక నాయకుల పని తీరు గురించి ఆరా తీశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తీరును తెలుసుకున్నారు. నగరంలోని రెండు నియోజకవర్గాలూ పార్టీకి ఎంతో కీలకం అని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. వచ్చే ఎన్నికలు పార్టీకి కీలకం అని, ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను పోలింగ్ బూత్ వరకు తీసుకుని వెళ్ళాలి అన్నారు.

ఇందుకు అనుగుణంగా శ్రేణులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. రాజకీయంగా ఏ చిన్న విషయం అయినా, ఇబ్బంది వచ్చినా పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. కచ్చితంగా గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల్లో బలంగా జనసేన సత్తా చూపేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

Leave a Reply