జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో ట్విస్ట్

-విషమంగా బాధితురాలు కాజల్ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి
– నిమ్స్‌ నుంచి మహారాష్ట్రకు రహస్యంగా తరలించిన నిందితులు

జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో రెండున్నర నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఇద్దరు మహిళలు, మరో చిన్నారి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరు బయటికి రావడం, కారులో ఆయన కుమారుడు ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ యాక్సిడెంట్‌ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే చివరికి కారు నడిపిన యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ కారులో ఎమ్మెల్యే కొడుకున్నాడని నిర్ధారించారు. అయితే ఈ ఘటనలో తల, నడుము భాగాల్లో తీవ్రంగా గాయపడిన చిన్నారి తల్లి కాజల్‌ చౌహాన్‌ను ముందుగా అపోలో ఆస్పత్రికి.. అక్కడి నుంచి పంజాగుట్ట నిమ్స్‌కి తరలించారు. అక్కడ కొద్దిగంటలు చికిత్స అందించిన తర్వాత నిందితుల తరపు వ్యక్తులు చడీచప్పుడు లేకుండా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు తరలించారు.

అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాజల్‌ను చేర్పించి వైద్య ఖర్చులు తామే భరిస్తామని నిందితులు ఆమె కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారు కనిపించకుండా పోవడంతో కాజల్‌కు వైద్య ఖర్చలు భరించలేకు కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి కావడంతో డబ్బులు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని డాక్టర్లు చెబుతుండటంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఎవరైనా దాతలు ఆదుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. మరోవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలిని రహస్యంగా నిమ్స్‌ నుంచి ఎలా డిశ్చార్జ్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply