2016 లోనే తనకు కుట్ర అంతా తెలుసన్న కరకట్ట కమల్ హాసన్ 2022 వరకు తన నోటికి కుట్లు ఎందుకు వేసుకున్నాడు?
– 23 శాతం హెరిటేజ్ సంస్థ భూమి రింగ్ రోడ్ భూసేకరణలో కోల్పోయే విధంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడమే చంద్రబాబు, లోకేశ్ లు చేసిన పాపమా? ప్రజా రాజధాని అమరావతితో పాటు, రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంపై దూరదృష్టితో ఆలోచించడమే చంద్రబాబు చేసిన తప్పా?
• ఆళ్ల రామకృష్ణా రెడ్డి పొంతనలేని మాటలు.. అసెంబ్లీలో పేర్నినాని పిచ్చి వాగుడు.. సీఐడీ అఫిడవిట్లో అధికారులు నమోదుచేసిన వివరాలు గమనిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంపై ప్రభుత్వం చేస్తున్న వాదనంతా అసత్యాలు.. అభూత కల్పనల మయమని స్పష్టమవుతోంది
• ఈ ప్రభుత్వం చెబుతున్నట్టు నిజంగా లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ ను తానే స్వయంగా పెన్నుతో గీస్తే, తమ సంస్థకు చెందిన భూములు పోయేలా గీస్తాడా?
• హెరిటేజ్ సంస్థకు రాజధానిప్రాంతంలో ఉన్న మొత్తం భూమిలో దాదాపు 23శాతం భూమి (2.15ఎకరాలు) రోడ్డు నిర్మాణంలోపోయేలా చూస్తూ..చూస్తూ లోకేశ్… చంద్రబాబు రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను అమలు చేస్తారా?
• దీన్నిబట్టే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కు.. చంద్రబాబు, లోకేశ్ లతో పాటు వారి కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదని అర్థమవుతోంది
• సీఐడీ అధికారులు తుగ్లక్ రెడ్డి దెబ్బకు ఇంకా గొప్ప తుగ్లక్ ల్లా మారారు అనడానికి వారు తయారు చేసిన అఫిడవిట్ లోని అంశాలే నిదర్శనం
• విభజనానంతర ఏపీలో ఎన్నికలు జరక్కముందే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో తెలియకముందే హెరిటేజ్ సంస్థ తమ వ్యాపార అవసరాలకోసం విజయవాడ గుంటూరు నగరాల మధ్య భూమి కొనాలని మార్చి21, 2014న సంస్థ 155వ బోర్డు సమావేశంలో నిర్ణయించింది నిజం కాదా?
• రింగ్ రోడ్ నగరం మధ్యగుండా వెళితే తప్పేంటి అన్న వింతవాదన తన అఫిడవిట్ ద్వారా తెరపైకి తీసుకొచ్చి నవ్వుల పాలవుతున్న సీఐడీ అధికారులు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
విభజనానంతరం నూతన రాష్ట్ర రాజధానికి కీలకంగా ఉండేలా ఆనాడు ఏపీ ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రతిపాదన తెరపైకి తెచ్చారని, మొత్తంగా మూడు రింగ్ రోడ్లు రాజధాని నిర్మాణంలో భాగమయ్యేలా ఉండాలని సంకల్పించి, ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) తో పాటు, ఒక అవుటర్ రింగ్ రోడ్ (ORR), మరో రీజినల్ రిండ్ రోడ్ (RRR) నిర్మాణ దిశగా గొప్ప ఆలోచన చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనసహా, నాటి ప్రభుత్వ నిర్ణయాలు, దానికి సంబంధించిన వాస్తవాలను ఆధారాలతో సహా ప్రజలకు, పాత్రికేయులకు వివరించారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే … “ చంద్రబాబు దూరదృష్టిలో భాగంగా రాజధానిలో అమలు చేయాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, నీతిమాలిన వైసీపీనేతలు, మంత్రులు అసెంబ్లీ, మండలిలో ఇష్టమొచ్చినట్టు కారుకూతలు కూశారు. నిన్న అసెం బ్లీలో పేర్నినాని మాట్లాడుతూ, హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ గా ఉన్న నారాలోకేశ్ కుట్రపూ రితంగా కొన్నికోట్ల రూపాయల లబ్ధిపొందాలనే దురాలోచనతోనే రాజధాని అమరావతి సమీపంలో ముందే భూములు కొని, ఆ భూముల పక్కగా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేలా లోకేశే ఒక మ్యాప్ గీశాడని ఇష్టమొచ్చినట్టు చెప్పుకొచ్చాడు. రాజకీయం జీవితం ముగింపుదశలో ఉన్న పేర్నినాని నోటి నుంచి ఇంతకంటే మంచి వ్యాఖ్యలు వస్తాయా? పేర్ని నాని పెర్ఫార్మెన్స్ చూశాక… ఆయన రాజకీయ రిటైర్మెంట్ తర్వాత డ్రామా కంపెనీలో మంచి నటుడిగా రాణిస్తాడనే నమ్మకం కలిగింది. నానికి ఇష్టమైతే మా పార్టీ సాంస్కృతిక విభాగం సహకారంతో మంచి డ్రామా కంపెనీలో ఉద్యోగం కల్పిస్తాను.
అసెంబ్లీలో పేర్నినాని చెప్పింది విన్నాక ఆయన రాజకీయ నాయకుడిగా కంటే డ్రామా ఆర్టిస్ట్ గా బాగా రాణిస్తాడు అనిపించింది
వైసీపీ ఆరోపిస్తున్నది ఏమిటంటే… నారా లోకేశ్ భవిష్యత్ లో ఏపీ రాజధానిగా అమరావతి ప్రకటింపబడుతుందున్న విషయం తెలిసి, ఆ ప్రాంతానికి దగ్గరలో కంతేరు లో హెరిటేజ్ డైరెక్టర్ హోదాలో వారి సంస్థ తరుపున కారుచౌకగా భూములు కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించాడని.
వాస్తవం ఏమిటంటే…. 21-03-2014న హెరిటేజ్ సంస్థ 155వ బోర్డ్ మీటింగ్ లో బయ్యవరం, ఉప్పల్, అనంతపురం, చిత్తూరు, విజయవాడ/ గుంటూరుతో పాటు, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ నిమిత్తం భూములు కొనాలని బోర్డులోని దాదాపు 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానిం చారు. మార్చి 2014లో హెరిటేజ్ బోర్డ్ నిర్ణయం తీసుకునే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నారు. నాటికి ఇంకా సార్వత్రిక ఎన్నికలు జరగలేదు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియని స్థితి. అలాంటి సమయంలో సంస్థ తరుపున విజయవాడ-గుంటూరు మధ్యలో భూములు కొనాలని బోర్డు నిర్ణయం తీసు కుంటే అది లోకేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందనే ముందుచూపుతో చేసిన కుట్రెలా అవుతుంది?
అప్పటికి విభజనానంతర ఏపీ రాజధాని ఏదో కూడా ప్రజలకు తెలియదు. అలాంటి సమయంలో ముందే భూములు కొని వాటి విలువ పెంచుకోవ డానికి లోకేశే స్వయంగా నూతన రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మ్యాప్ గీశాడని పేర్నినాని చెప్పడం ఆయనలోని నటనా చాతుర్యం కాక మరేమిటి? నాడు హెరిటేజ్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ప్రెసిడెంట్ అయిన ఎం. సాంబశివరావు సీఐడీ వారికి కూడా స్వయంగా లిఖితపూర్వకంగా 31-12-2022న తెలియచేశారు. ఈ ప్రభుత్వ అధీనంలోని సీఐడీ విభాగం విచారణపేరుతో హెరిటేజ్ సంస్థను సంప్రదిం చినప్పడు, సంస్థ ప్రెసిడెంట్ సాంబశివరావు తమసంస్థ మార్చి 2014లో చేసిన తీర్మానం కాపీని మరియు భూముల కొనుగోలుకు సంబంధించిన ఇతర తీర్మాన ప్రతులను స్వయంగా సీఐడీకి అందించారు. మార్చి 2014లోనే తమసంస్థ భూములు కొనాలని తీర్మానించిన కాపీని హెరిటేజ్ సంస్థ అందచేసినా, ఆ వాస్తవాన్ని సీఐడీ ఎందుకు తొక్కిపెట్టింది? వైసీపీ ప్రభుత్వం అనుకున్నట్టు ఆటలు సాగాలనే ఈ పనిచేశా రా? ఇది కుట్రకాక మరేమిటి?
హెరిటేజ్ సంస్థ నిర్ణయాలు.. ఆ సంస్థ భూములు కొన్న వివరాలు తొక్కిపెట్టి కావాలనే సీఐడీ సదరు సంస్థపై, లోకేశ్ పై వైసీపీతో బురద
2014 మార్చిలో హెరిటేజ్ సంస్థ చేసిన తీర్మానం ఆధారంగా కంతేరులో జూలై 1, 2014న సర్వే నెంబర్లు 27.. 28.. 58..62.. 63 లలో 7.21 ఎకరాలు కొనుగోలుకు ఆ సంస్థ ఆమోదం తెలిపి, భూములు కొనుగోలు చేసింది. ఆ భూమిపక్కనే ఉన్న భూము ల యజమానులు తమ భూములు అమ్ముతామని హెరిటేజ్ సంస్థ వారికి చెప్పడంతో తరువాత జూలై 30న జరిగిన సంస్థ బోర్డ్ మీటింగ్ లో ఆ భూములు కూడా కొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా 7.21 ఎకరాల పక్కనే ఉన్న గిరిధర్ అనే వ్యక్తికి చెందిన 2.46 ఎకరాలు, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 3.20 ఎకరాలతో పాటు, ఎల్.ఈ.పీ.ఎల్ ప్రాజెక్ట్స్ కు చెందిన 1.35 ఎకరాలభూమిని కొనుగోలు చేయాలని తీర్మానించి, భూములు కొనడం జరిగింది.
కానీ సెప్టెంబర్ 22, 2014న గతంలో లింగమనేని సంస్థలనుంచి కొనుగోలు చేసిన 4.55 ఎకరాలభూమి పలు న్యాయ పరమైన వివాదాల్లో చిక్కుకున్న విషయాన్ని గ్రహించి, కొనుగోలు ఒప్పం దాన్ని సెప్టెంబర్ 22, 2014న జరిగిన సంస్థ బోర్డ్ మీటింగ్ లో రద్దు చేసుకోవాలని తీర్మానించి దాన్ని అమలు పరచడమైనది. నిజంగా భారీగా భూములు కొని.. ఆ భూముల పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్ వేసుకొని ధరలు పెంచుకొని, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనే లోకేశ్ కు, హెరిటేజ్ సంస్థకు ఉంటే కోర్టు వివాదాల్లో ఉన్నభూమిని ఎందుకు వదిలేస్తారు? టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వివాదాలు పరిష్కరించుకోవడం వారికి తెలియకా…లేక చేతకాకా? అధికారం చేతులో ఉండగా ఇటువంటి వివాదాలు పరిష్కరించుకోలేక నాలుగున్నర ఎకరాల విలువైన భూమిని వదులుకుంటారా?
హెరిటేజ్ సంస్థకుగానీ, లోకేశ్ కు గానీ అధికారాన్ని అడ్డంపెట్టుకొని తమ స్వప్రయోజనం కోసం పనులు చక్కబెట్టుకునే దురాలోచన లేదు కాబట్టే.. లింగమనేని సంస్థ నుంచి కొన్న భూమి వివాదాల్లో ఉందని తెలిశాక వద్దనుకొని వదిలే శారు. అదీ లోకేశ్ .. ఆయన కుటుంబం … హెరిటేజ్ సంస్థ విశ్వసనీయత. లింగమ నేని సంస్థ నుంచి కొన్న భూమి వద్దనుకున్నాక హెరిటేజ్ సంస్థ ఫైనల్ గా కంతేరు గ్రామం వద్ద కొనుగోలు చేసిన మొత్తం భూమి కేవలం 9.67 ఎకరాలు మాత్రమే. ఇదీ హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోలు వెనకున్న వాస్తవం. ఈ వివరాలన్నీ హెరిటేజ్ సంస్థ సీఐడీకి తెలియచేసినా.. కావాలనే సదరు విచారణా విభాగం ఈ వివరాలు తొక్కి పెట్టి, హెరిటేపై, లోకేశ్ పై నిరాధార ఆరోపణలు చేయిస్తోంది.
హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుట్ర మొత్తం తనకు 2016 లోనే తెలుసని కరకట్ట కమల్ హాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి, స్వయంగా సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలియపరిచింది నిజం కాదా? .. మరి 17-02-2018న చంద్రబాబు సర్కార్ IRR అలైన్ మెంట్ పై అభ్యంతరాల స్వీకరణ కోసం పత్రికా ప్రకటనలు ఇస్తే దేనికి ఆళ్ల మౌనం వహించాడు?
హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోలు వ్యవహారం అలా ఉంటే, మంగళగిరి వైసీపీ ఎమ్మె ల్యే కరకట్ట కమల్ హాసన్ అయిన ఆళ్లరామకృష్ణారెడ్డి కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. తాను సీఐడీ వారికి 09-05-2022న ఇచ్చిన ఫిర్యాదులో 2016లోనే తనకు హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన భూముల వ్యవహారం మరియు దానివెనుక దాగి ఉన్న కుట్ర మొత్తం తెలుసునని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కొంతమంది సన్నిహితుల ద్వారా తనవద్దకు చేరాయని చెప్పాడు. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన భూములపై మరియు దాని వెనకున్న కుట్రగురించి 2016లోనే అన్నీ తెలిసినప్పుడు, అభ్యంత రాలు ఉన్నాయని తనకు అనిపించినప్పుడు నాటి టీడీపీప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ గురించి తెలియచేస్తూ 17-02-2018న ఏవైనా అభ్యంతరాలుంటే నెలరోజుల లోపు తెలియచేయాలని సీఆర్డీఏ ద్వారా ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చినప్పుడు తన వద్ద ఉన్న ఆధారాలను ఆళ్ల సీఆర్డీఏ ముందు ఎందుకు ఉంచ లేదు?
కుట్ర, కుంభకోణం జరిగిందంటున్న కమల్ హాసన్ నాడు సీఆర్డీఏకి ఫిర్యాదు చేయకుండా, 2022లో కుట్ర కూనిరాగాలు తీయడం వైసీపీప్రభుత్వ రాజకీయ ఎత్తుగడలో భాగం కాదా? ఇన్నర్ రింగ్ నిర్మాణ ప్రతిపాదనలపై అభ్యంతరాల స్వీకరణ కోసం పత్రికా ప్రకటన ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం నాటి రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా 03-07-2018న తొమ్మిది మంది ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీని కలిసి తన వాదనను ఆళ్ల ఎందుకు చెప్పలేదో ఆయ నే సమాధానం చెప్పాలి. అప్పుడు తాగి ఏ కట్టమీదో పడుకున్న కరకట్ట కమల్ హాసన్ నేడు అకస్మాత్తుగా మేల్కొని కట్టు కథలు అల్లడం ముమ్మాటికీ తాడేపల్లి ప్యాలెస్ దర్శకత్వంలో బురద జల్లడమే.
ఆనాడు టీడీపీప్రభుత్వం వేసిన కమిటీ 05-07-2018 నుంచి 15-07-2018 వరకు పదిరోజుల్లో దాదాపు 9సార్లు సమావేశమైతే, ఆ కమిటీ ముందు దాదాపు 1185 మంది తమ అభ్యంతరాలు, వాదనలు తెలియ చేశారు. అంతమంది నిర్భయంగా కమిటీ ముందుకు వచ్చి మాట్లాడితే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లకు మాత్రం వెళ్లడానికి కాలుకదల్లేదు. ఆనాడు నోరెత్తకుండా ఇప్పుడు కట్టుకథలతో సీఐడీకి ఫిర్యాదు ఇవ్వడాన్ని ఏమనాలి? 1185 మంది ఇచ్చిన సూచనలన్నీ పరిగణనలోకి తీసుకొని, అభ్యంతరాలన్నీ పరిష్కరించాకే ప్రజలందరి సమ్మతితో నాటి ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన డ్రాఫ్ట్ ను ఫైనల్ చేసి, దానికి సంబంధించిన గెజిట్ ను 31-10-2018 విడుదలచేసింది. ఇదంతా గమనిస్తే నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరించిందో అర్థమవుతోంది.
చంద్రబాబు, లోకేశ్ లు వారికి, వారి సంస్థకు మేలు కలిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చలేదు అనడానికి నాటి సీఆర్డీఏ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్లోని సర్వే నెంబర్లే నిదర్శనం
ఆనాడు టీడీపీప్రభుత్వం విడుదలచేసిన ఇన్న్ రింగ్ రోడ్ డ్రాఫ్ట్ లో ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏఏ సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరణకు అవసరమవుతుందో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా హెరిటేజ్ సంస్థ భూముల కొన్న కంతేరు గ్రామంలో సర్వే నెంబర్లు 1, 2, 3, 4, 5 లతో పాటు, 17, 25, 26, 27, 28 లు కలిపి దాదాపు 53 సర్వేనెంబరల్లోని భూమిని సేకరించాలని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో 2014 జూలైలో కంతేరు గ్రామ పరిధిలో హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 9.67 ఎకరాల భూమిలో సర్వే నెంబర్ 27, 28లలో 2.15 ఎకరాల భూమి ఉంది. అంటే హెరిటేజ్ కొనుగోలు చేసిన మొత్తం భూమిలో సర్వే నెంబర్లు 27, 28లలో దాదాపు 23శాతం భూమి ఉంది.
నిజంగా నారా లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్వయంగా పెన్నుతో తానే గీస్తే, హెరిటేజ్ సంస్థ భూమిఉన్న సర్వే నంబర్ల మీదుగా రింగ్ రోడ్ అలైన్ మెంట్ గీత గీస్తారా? కొన్న మొత్తం భూమిలో పావువంతు భూమి రోడ్ నిర్మాణంలో పోతుందని తెలిస్తే, ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? లోకేశే పెన్నుతో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ గీస్తే, తన సంస్థ భూమిని పోగొట్టుకునేలా గీస్తారా? చంద్రబాబు, లోకేశ్ సహా నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, రోడ్లు ఎలా పూర్తిచేయాలని ఆలోచించింది తప్ప, తమభూములు కాపాడుకోవాలనో..లేక వాటికి మంచి డిమాండ్ వచ్చేలానో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళికలు మార్చలేదు. అలా మార్చిందని వైసీపీ ప్రభుత్వం.. సీఐడీ చేస్తున్న వాదనంతా కూడా అసత్యాలమయం.
చంద్రబాబు, లోకేశ్ లు వారికి, వారి సంస్థ అయిన హెరిటేజ్ కు మేలు కలిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చలేదు అనడానికి నాటి సీఆర్డీఏ గెజిట్ నోటిఫికేషన్లోని సర్వే నెంబర్లే సాక్ష్యం. నిజంగా చంద్రబాబు, లోకేశ్ లు తప్పు చేసుంటే హెరి టేజ్ సంస్థ భూము లున్న 27, 28 సర్వే నెంబర్లను భూ సేకరణ గెజిట్ నోటిఫికేషన్లో లేకుండా చేసేవారు. కానీ ఆ విధంగా జరగలేదంటే అది నారా లోకేశ్ , చంద్రబాబుల నిజాయితీకి తార్కా ణం. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం ద్వారా చంద్రబాబు, లోకేశ్ వారి భూముల ధరలు పెంచుకొని కోట్లరూపాయల లబ్ధి పొందారంటున్న సీఐడీ ఆరోపణలు ఎంత పచ్చి బూటకమే ఇక్కడే అర్థమవుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి అని చెప్పిచెప్పి చివరకు ఏమీ తేల్చలేకపోయిన సీఐడీ, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వ్యవహారంలో చంద్రబాబు ని అర్జంట్ గా విచారించాలని, అందుకోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరడం సిగ్గుచేటు. యువగళం పాదయాత్ర తాను పున: ప్రారంభిస్తున్నట్టు లోకేశ్ ప్రకటించిన తర్వాత అకస్మాత్తుగా సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఎఫ్.ఐ.ఆర్ లో ఆయన ఏ14గా మారిపోతారు. ఇది కేవలం ఆయన్ని ప్రజలమధ్యకు వెళ్లకుండా చేసిన కుట్రగా స్పష్టంగా అర్థమవు తోంది.
సుర్బానా సంస్థను కుట్రపూరితంగా తెరపైకి తెచ్చి, రాజధాని మరియు ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు, లోకేశ్ లు గీయించారంటున్న సీఐడీ ఆరోపణలు నిజమా లేక అసెంబ్లీలో పేర్నినాని చెప్పినట్టు సుర్బానా గీసిన అలైన్మెంట్ ను చంద్రబాబు చెత్తబుట్టలో పడేసి స్టుప్ సంస్థచే తిరిగి అలైన్మెంట్ సిద్ధం చేయించారన్నది నిజమా?
రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా నాటి టీడీపీప్రభుత్వం సుర్బానా అనే కంపెనీతో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను తమకు నచ్చినట్టు గీయించిదని, దాన్ని స్టుప్ అనే సంస్థతో ఆమోదింప చేయించిందనే ఆరోపణ కూడా అవాస్తవమే. సుర్బానా సంస్థ తయారుచేసిన డ్రాఫ్ట్ చంద్రబాబు, లోకేశ్ లకు నచ్చలేదని, దానిని చెత్తబుట్టలో పడేసి, స్టుప్ అనే మరో కన్సల్టెంట్ ను తీసుకొచ్చి, IRR అలైన్ మెంట్ డ్రాఫ్ట్ సిద్ధం చేశారని పేర్నినాని నిన్న అసెంబ్లీలో చెప్పిన మాట నిజంకాదా? ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మొత్తం చంద్రబాబు, లోకేశ్ తమకు నచ్చినట్టు సుర్బానా సంస్థతో గీయించుకున్నారని సీఐడీ చెబుతుంటే, పేర్నినాని ఆ సుర్బానా సంస్థ ఇచ్చిన డ్రాఫ్ట్ ను చంద్రబాబు, లోకేశ్ లు చెత్తబుట్టలో పడేశారని పేర్నినాని చెప్పడం ఏమిటి? ఈ రెండు వాదనల్లో ఏది నిజం? పేర్నినాని నిన్న అసెంబ్లీలో చెప్పింది నిజమైతే సీఐడీ అఫిడవిట్ లో ఫైల్ చేసిన సమాచారమంతా అవాస్తవమేగా?
రింగ్ రోడ్ కి వింత భాష్యం చెప్పిన సీఐడీ నూతన రాజధాని అమరావతి మధ్యగా వెళ్లే విజయవాడ బైపాస్ ను రింగ్ రోడ్ గా ఎందుకు పరిగణించలేదని వారి అఫిడవిట్లో హాస్యాస్పద ఆరోపణ
సీఐడీ తన అఫిడవిట్లో ఇన్నర్ రింగ్ రోడ్ పై కొత్త భాష్యం చెబుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ నగరం నడిబొడ్డు గుండాకూడా వెళ్లవచ్చని, నగరం బయట నుంచే కాదని సీఐడీ చెప్పడం చూస్తే నవ్వు ఆగడంలేదు. అలానే రాజధాని అమరావతికి ఉపయుక్తంగా విజయవాడ బైపాస్ రెడీగా ఉంటే, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారని కూడా అఫిడవిట్లో ఈ తుగ్లక్ సీఐడీ చెప్పింది. రాజధాని అమరావతికి అనుసంధానంగా విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాలను కలుపుతూ నాటి టీడీపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రతిపాదన తెరపైకి తెస్తే, సీఐడీ వారేమో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అమరావతి మధ్యగుండా కూడా వెళ్లవచ్చని చెప్పడం సదరు విభాగం అధికారుల మేథాసంపత్తికి నిదర్శనం.
ప్రపంచం లో ఎక్కడైనా ఏ నగరానికైనా రింగ్ రోడ్ అనేది నగర సరిహద్దును ఆనుకొని, దాని చుట్టూ ఏర్పాటు చేయబడుతుంది. ఎక్కడా కూడా నగరాల మధ్యగుండా రింగ్ రోడ్ ఏర్పడదు. కానీ దురదృష్టం కొద్దీ నేడు ఏపీ సీఐడీ వారు రింగ్ రోడ్ అర్థాన్నే మార్చేసే విధంగా వారి అఫిడవిట్లో తుగ్లక్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లెంత తెలివైన వాళ్లో.., వాళ్ల బుర్రలను పూర్తిగా వైసీపీప్రభుత్వానికి తాకట్టుపెట్టేసి, ఎంతబాగా జగన్ రెడ్డి చెప్పిందానికి డూడూబసవన్నలా తలాడిస్తున్నారో ఇక్కడే అర్థమవుతోంది. ఇక్కడ సీఐడీ చెప్పేదాని ప్రకారం ఒక రింగ్ రోడ్ ని రింగ్ రోడ్డులా నిర్మించాలనుకోవడమే చంద్రబాబు చేసిన నేరం. గొప్ప మేథావులైన సీఐడీ అధికారులు వేసిన అఫిడవిట్లో విజయవాడ నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎప్పుడో 2010లో రాష్ట్ర విభజనకు పూర్వం రూపకల్పన చేసిన బైపాస్ ను రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ గా పరిగణించాలని ప్రతిపాదన చేయడంద్వారా సీఐడీ కోర్టులో దఖలు పరిచిన అఫిడవిట్ మొత్తం పెద్ద జోక్ గా మారిందనే చెప్పాలి. బైపాస్ కు.. ఇన్నర్ రింగ్ రోడ్ కు తేడా తెలియని ఇలాంటి మేథావులు మరలా ఢిల్లీ వెళ్లి మరీ అక్కడి మీడియాకు నిస్సిగ్గుగా అసత్యాలు చెబుతారు.
భవిష్యత్ ను దృష్టిలోపెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా, రాష్ట్రాభివృద్ధికి కీలకంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ పై చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తప్పా?
స్టుప్ కన్సల్ టెన్స్ వారు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కొరకు మూడు ప్రతిపాద నలు చేయగా వాటిలో ఉత్తతమైన ప్రతిపాదనను చంద్రబాబు మరియు నాటి ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన సీఆర్డీఏ కార్యవర్గం ఆమోదించగా, దానిపై నేడు అకారణం గా నిందలు మోపుతున్నారు. వాస్తవాలు పరిశీలిస్తే నాటి ప్రభుత్వం ఎంపిక చేసిన ఆప్షన్ పూర్తిగా అమరావతి నగర సరిహద్దుల గుండా వెళుతూ, ఎక్కడా నగర అంతర్గ త ట్రాఫిక్ కు ఇబ్బంది కలగనీయకుండా రూపొందింపబడింది. స్టుప్ వారు ప్రదిపాదిం చిన మరో ఆప్షన్లో కొంతభాగం అమరావతి నగర సరిహద్దులోపల పయనిస్తూ అంతర్గత రోడ్డుగా కూడా వ్యవహరిస్తుంది. కానీ ఆ ప్రతిపాదన అమలైతే రింగ్ రోడ్ పై పయనించే భారీ వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం మరియు ట్రాఫిక్ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తద్వారా అమరావతి నగర ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగక మానదని భావించి కొంత తక్కువ ఖర్చుతో ఈ ప్రతిపాదన అమలయ్యే అవకాశం ఉన్నా కూడా, ప్రజల సౌకర్యార్థం తిరస్కరింపబడింది.
ఆనాటి ప్రభుత్వం ఎంపిక చేసిన రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రతిపాదన అమలుకు మిగతా ప్రతిపాదనల కంటే దాదాపు రూ.780కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందు తున్న రాజధానిలో భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులకు ఆస్కారం ఇవ్వకూడదని, ప్రజలను సౌకర్యవంతంగా ఉంచాలన్న మంచి ఆలోచనతో ఆమోదం తెలిపారు. దాని ద్వారా రాజధాని నగరంలో భవిష్యత్ లో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా నివారించడం జరిగింది. హైవేలకు సంబంధించిన ట్రాఫిక్ ఎక్కడా రాజధాని నగరంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడటం జరిగింది.
దానికే రూ.780కోట్లు అదనంగా ఖర్చు అయ్యేలా చంద్రబాబు వ్యవహరించారని ఈ ప్రభుత్వం..బుద్ధిలేని సీఐడీ ఆరోపిస్తున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలోపెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా, రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పా? అది కూడా కేవలం నిర్ణయమే తప్ప, ఎక్కడా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ భౌతికంగా అమల్లోకి రాలేదు.. పైసా ఖర్చు చేయలేదు…ఎకరా భూమి సేకరించలేదు. ప్రస్తుత ప్రభుత్వం తమ రంగుల పిచ్చి తీర్చుకోవడం కోసం రాష్ట్రంలోని కొన్ని వేల భవనాలపైన రంగుల వేయడానికి చేసిన ఖర్చుతో పోల్చినా.. పత్రికా ప్రకటనలకోసం గత నాలుగున్నరేళ్లలో తగలేసిన ఖర్చుతో పోల్చినా.. చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కి పెట్టదలుచుకున్న ఖర్చు నామమాత్రమే.
ఈ ప్రభుత్వం లేవంటున్న స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు మేం చూపిస్తాం.. ఉంది అంటున్న ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుందో పేర్నినాని ప్రజలకు చూపించగలడా?
ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వాస్తవాలు తెలియచేస్తూ నేడు 20 డాక్యుమెంట్లతో పూర్తి సమాచారం ప్రజలముందు ఉంచాము. మా సమాచారం పరిశీలిం చాక పేర్నినాని తాను చెబుతున్నఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుందో ప్రజలకు చూపించాలి. ఒక్క ఎకరం సేకరించకుండా, ఎక్కడా నిర్మాణమే మొదలుకాని ఇన్నర్ రింగ్ రోడ్ అటునుంచి ఇటు వచ్చింది … ఫలానా నాయకులు.. వారి సంస్థల పక్కగా వెళ్లిందని పేర్నినాని పిచ్చివాగుడు వాగడం ఆయన మతి భ్రమణానికి నిదర్శనం ఈ ప్రభుత్వం రాష్ట్రంలో లేవంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు మేం ప్రత్యక్షంగా చూపిస్తాం.. పేర్నినాని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఉంది అన్న ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుందో మాకు చూపిస్తే, నేనే స్వయంగా ఆయన వాహనం ఎక్కిమరీ ఆయనతో ఇన్నర్ రింగ్ రోడ్ పై చక్కర్లు కొడతాను.” అని పట్టాభిరామ్ దెప్పి పొడిచారు.