Home » కాపు-కమ్మ కలిశారు!

కాపు-కమ్మ కలిశారు!

– గుంటూరు-కృష్ణా-ప్రకాశంలో కమ్మ-కాపు కలసి కదనం
– గుంటూరులో కమ్మవర్గం కంటే ఎక్కువ పనిచేసిన కాపులు
– టీడీపీ అభ్యర్ధులకు దన్నుగా నిలిచిన కాపు-బలిజలు
– కాపు అభ్యర్ధులకు బాసటగా నిలిచిన కమ్మవర్గం
– గుంటూరు సిటీలో టీడీపీ అభ్యర్ధికి చేయిచ్చిన కమ్మ నేతలు
– మాధవికి బాసటగా నిలిచిన బ్రాహ్మణ-వైశ్య వర్గం
– పోలింగ్ రోజున కనిపించని కమ్మ అగ్రనేతలు
– కన్నా చొరవతో మాధవికి జైకొట్టిన కాపులు
– ‘సీమ’లో సైకిలెక్కిన బలిజలు
– ఇక కాపు-కమ్మ వర్గ శత్రుత్వానికి తెర
– కులాల చరిత్రలో కొత్త కోణం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల చరిత్రలో ఇదో కొత్త కోణం. వర్గ శత్రువులుగా పేరున్న కమ్మ-కాపు వర్గాలు, ఈ ఎన్నికల్లో వైసీపీపై కలసి కదం తొక్కిన వైచిత్రి దర్శనమిచ్చింది. ఇది కులరాజకీయాల్లో కొత్త మలుపు. గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాల్లో కాపులు, గంపగుత్తగా సైకిలెక్కి, ఆ పార్టీ అభ్యర్ధులను విజయపథాన నడిపించడం ఒక విశేషమయితే.. తమకు అవకాశాలు దక్కని అసంతృప్తితో, కొన్ని చోట్ల కమ్మ వర్గ నేతలు పోలింగ్ రోజున ఇంటికే పరిమితమైన వైచిత్రి మరొకటి దర్శనమిచ్చింది. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. వర్గశత్రువులుగా పేరున్న కాపు-కమ్మ కలసిపోవడమే ఈ ఎన్నికల ప్రత్యేకత. దానికి కారకుడైన జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ను అభినందించాల్సిందే.

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కలలో కూడా ఊహించని, కాపు-కమ్మ వర్గ ఏకీకరణ.. కలసి అడుగులు వేయడం శుభపరిణామం. దానికి జనసేన ప్రధాన కారణమన్నది సుస్పష్టం. పవన్‌పై విశాఖలో వేధింపులు ప్రారంభమైనప్పటి నుంచీ, వారిలో వైసీపీని ఓడించాలన్న ప్రతీకారేచ్ఛ పెరిగింది. అది ఈ ఎన్నికల్లో టీడీపీతో జత కట్టడం ద్వారా నెరవేరినట్టయింది.
నిజానికి వంగవీటి రంగా హత్య తర్వాత కోస్తాలో, కమ్మ-కాపు వర్గాల మధ్య వర్గ శత్రుత్వానికి తెరలేచింది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రపై ఆ ప్రభావం పెద్దగా కనిపించదు. ఎందుకంటే అక్కడ కమ్మ వర్గం తక్కువకాబట్టి! కాబట్టే ఈ జిల్లాల్లో కమ్మలపై కాపులకు పెద్దగా ద్వేషం కనిపించదు.

పశ్చిమ గోదావరిజిల్లాలో ఏలూరు, దెందులూరు; తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, పెద్దాపురం వంటి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కమ్మ వర్గం అధిపత్యం కనిపిస్తుంది. ఆ జిల్లాల్లో అంతా కాపు-బీసీ-ఎస్సీల హవానే. కాపు-బీసీ వర్గాల మధ్య ఒకసారి, కాపు-ఎస్సీల మధ్య మరొకసారి ఘర్షణలు జరుగుతుంటాయి. అందువల్ల గోదావరి-ఉత్తరాంధ్రలో కొన్ని సందర్భాల్లో మినహా.. కాపులు టీడీపీవైపే కొనసాగుతున్నారు.

అయితే ప్రధానంగా విజయవాడ సిటీ-గుంటూరు జిల్లాల్లో దాని ప్రభావం ఇటీవలి కాలం వరకూ కొనసాగింది. ఈ రెండు ప్రాంతాల్లోనే ఈ వర్గవిద్వేషాలు దశాబ్దాలపాటు కొనసాగాయి. ఈ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ రంగా-పరిటాల రవి విగ్రహాలు కనిపిస్తుంటాయంటే.. వారిలో కులాభిమానం ఏ స్థాయిలో నాటుకుపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వంగవీటి రంగా భార్య రత్నకుమారి, కొడుకు రాధా టీడీపీలో చేరినప్పటికీ.. విజయవాడ సిటీ, గుంటూరు జిల్లాలో కాపులు మాత్రం.. రంగా హత్యకోణంలో కమ్మవర్గంపై తమ ద్వేషాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

దానితో కాపుల పార్టీగా ముద్ర ఉన్న జనసేన పార్టీ, కమ్మ పార్టీగా ముద్రపడ్డ టీడీపీతో జతకట్టినా.. కాపులు టీడీపీకి ఏమేరకు ఓట్లు వేస్తారన్న అనుమానం, ఈ ఎన్నికల ముందు వరకూ ఉండేది. కానీ పోలింగ్‌లో ఆ అనుమానాలు పటాపంచలయి.. కమ్మ-కాపు కలసిపనిచేసిన, అద్భుత సమీకరణ దర్శనమిచ్చింది.

ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడటం, ఈ కుల వాతావరణం కొత్త మలుపు తిరిగేందుకు కారణమయింది. తాజా ఎన్నికల్లో కాపులు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలు, టీడీపీ అభ్యర్ధికి జైకొట్టాయి. అదే సమయంలో కమ్మ వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు, కాపు అభ్యర్ధులకు దన్నుగా నిలిచాయి. నిజంగా ఇది ఎవరూ ఊహించని పరిణామమే. జనసేనతో కలసిన క్రమంలోనే ఈ కలయిక సాధ్యమైందన్నది నిష్ఠుర నిజం.

పల్నాడు జిల్లా సతె్తనపల్లిలో టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణకు, కమ్మ వర్గం పూర్తిస్థాయిలో దన్నుగా నిలిచింది. ఇక్కడ అంబటి రాంబాబు అభ్యర్ధిత్వం వల్ల కాపుల్లో స్వల్పంగా చీలిక వచ్చినప్పటికీ, కమ్మవర్గం మాత్రం గంపగుత్తగా కన్నాకు జైకొట్టింది. ఇక గుంటూరులో కాపులపై ఎక్కువ ప్రభావం ఉండే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో, అక్కడ కాపులంతా గుంటూరు టీడీపీ అభ్యర్ధి మాధవికి దన్నుగా నిలిచారు. మాధవిని గెలిపించాలంటూ కన్నా కాపులకు ఇచ్చిన పిలుపు పోలింగ్‌లో బాగా పనిచేసినట్లు కనిపించింది.

విచిత్రంగా ఇక్కడ టికెట్ కోసం పోటీపడిన కమ్మ నేతలు, పోలింగ్ రోజున ముఖం చాటేశారు. వారితో సమన్వయం చేయడంలో మాధవి వైఫల్యం చెందారన్న విమర్శ ఉన్నప్పటికీ, రాష్ట్ర నేతలుగా ప్రచారం చేసుకునే గుంటూరు నగర కమ్మ నేతల్లో, అధిక శాతం ఎన్నికల్లో పనిచేయలేదన్న ఆరోపణలున్నాయి. మరికొందరు వైసీపీ అభ్యర్ధితో కుమ్మక్కయారన్న ఆరోపణలూ వినిపించకేపోలేదు. అయితే వీరికి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం బోలెడంత పలుకుబడి ఉండటం విశేషం.

మరికొందరు అగ్రనేతలకు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డితో వ్యాపార సంబంధాలు-సెటిల్‌మెంట్ బంధాలు ఉండటం విశేషం. వీరంతా వచ్చే ఐదేళ్లను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి చేయిచ్చారని పార్టీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. ఇక్కడ కొంతమంది కమ్మ నేతలకు ‘ఆల్‌పార్టీ లీడర్స్’ అన్న ముద్ర ఉన్నప్పటికీ, వారికి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రెడ్‌కార్పెట్ వేయమడే వింత.

అయినప్పటికీ కాపు-బ్రాహ్మణ-వైశ్య వర్గాలు మాధవికి దన్నుగా నిలిచాయి. వైసీపీ అభ్యర్ధి రజనీని వైశ్య కార్పొరేటర్ బుజ్జి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైర క్టర్ సిరిపురపు శ్రీధర్ ఇద్దరే పోలింగ్ బూత్‌ల వద్ద ైధె ర్యంగా ఎదుర్కొని, ఆమెతో ఘర్షణ పడటం విశేషం. గత ఎన్నికల్లో కూడా కమ్మనేతలు మాయమయిపోగా, పోలింగ్-కౌంటింగ్‌కేంద్రం వద్ద బ్రాహ్మణనేత ఒక్కరే నాటి అభ్యర్ధి మద్దాలి గిరికి దన్నుగా ఉండటం ప్రస్తావనార్హం.

తాజాగా ఒక పోలింగ్‌బూత్‌లో వైసీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిని.. కమ్మ మహిళలు ఏకమై తరిమికొట్టగా, టీడీపీ కమ్మ నేతలెవరూ అక్కడ కనిపించకపోవడం మరో ఆశ్చర్యం. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులంతా ఒక్కతాటిపై నిలిచి, టీడీపీ అభ్యర్ధుల విజయానికి సహకరించడం, కొత్త కుల సమీకరణకు దారితీసింది. ఫలితంగా కమ్మ-కాపు ఏకీకరణకు బీజం పడినట్టయింది. నిజానికిది ఊహించని పరిణామామే.

ఇక ప్రకాశం-నెల్లూరులో కూడా కాపులు, టీడీపీ అభ్యర్ధులకు మనస్ఫూర్తిగా పనిచేయడం కొత్త పరిణామం. ప్రకాశం జిల్లాలో కమ్మ అభ్యర్ధులకు కాపులు పూర్తి స్థాయిలో దన్నుగా నిలవడం విశేషం. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే.. దాదాపు ఏకపక్షంగానే కాపులు, టీడీపీ-బీజేపీ వైపు మొగ్గినట్లు కనిపించింది. జనసేనాధిపతి పవన్ పోటీచేసిన పిఠాపురంలో అయితే, జనసేన కంటే టీడీపీనే ఆయన విజయం కోసం ఎక్కువగా పోరాడింది.

అటు రాయలసీమలోనూ, బలిజలు టీడీపీ వైపు ఏకపక్షంగా మొగ్గుచూపారు. అయితే తిరుపతిలో జనసేన అభ్యర్ధి పోలింగ్ చేసుకోవడంలో ఘోరంగా విఫలయ్యారు. ఆయన స్థానిక బలిజ నేతలను కాకుండా, చిత్తూరు నుంచి తెచ్చుకున్న యంత్రాంగంతో పనిచేయించుకోవడమే దానికి కారణమంటున్నారు. అయినప్పటికీ టీడీపీకి చెందిన బలిజ నేతలంతా శ్రీనివాస్ విజయానికి కృషి చేసినట్లు కనిపించింది. ఇక్కడ జనసేనకు క్యాడర్ లేకపోవడం ఒక మైనస్‌పాయింట్.

రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో, బలిజల ప్రభావం దాదాపు 27 నియోజకవర్గాల్లో ఉంటుంది. అక్కడ పాటీడీపీ అభ్యర్ధుల విజయం కోసం బలిజలు పనిచేయాలంటూ.. బలిజనాడు కన్వీనర్, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి ర మణ, సోషల్‌మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. తిరుపతి వేదికగా బలిజలతో సమావేశాలు నిర్వహించారు. ‘ఇది బలిజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. బలిజలను అవమానించిన వైసీపీని ఓడించడం మన బాధ్యత. ఈసారి వైసీపీని ఓడిస్తేనే జగన్‌కు బలిజల విలువ తెలుస్తుంది. బలిజలకు ప్రాధాన్యం ఇచ్చే టీడీపీని గెలిపించాల’ని రమణ బలిజల్లో చైతన్యం రగిలించారు. రాజంపేట బీజేపీ ఎంపి అభ్యర్ధి కిరణ్‌కుమార్‌రెడ్డికి బలిజలు దన్నుగా నిలవడంతో, ఆయన మిథున్‌రెడ్డికి తీవ్రస్థాయిలో పోటీ ఇచ్చినట్లు కనిపించింది. నిజానికి ఇక్కడ రెడ్లు ఎక్కువ సంఖ్యలో వైసీపీ వైపు మొగ్గు చూపగా, బలిజలే బీజేపీ పక్షాన నిలబడ్డారు.

కడప-కర్నూలు-అనంత పురం జిల్లాల్లో కూడా బలిజలు రెండు-మూడు నియోజకవర్గాల్లో మినహా, మిగిలిన చోట్ల టీడీపీ వైపే ఏకపక్షంగా మొగ్గుచూపడంతో.. కాపు,బలిజ-కమ్మ వర్గం ఏకీకరణకు తెరలేచినట్లయింది. ఇక దీనితో ఆ రెండు కులాల మధ్య.. వైరానికి శాశ్వతంగా తెరపడినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply