Suryaa.co.in

Editorial

షి‘కారు’చేసి సొమ్ములివ్వకుండా ‘ఐ ప్యాక’ప్?

– ట్రావెల్స్‌కు డబ్బులు ఎగ్గొట్టిన ఐప్యాక్?
– జగన్ భేటీ వెంటనే బెంజిసర్కిల్ దుకాణం బంద్
– భోరుమంటున్న ట్రావెల్స్ యజమానులు
– సర్వేలన్నీ వారి వాహనాల్లోనే చేసిన ఐప్యాక్ టీమ్
– ఎవరిని అడగాలో తెలియక ట్రావెల్స్ యజమానుల గగ్గోలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

కత్తిపట్టినవాడు చివరకు ఆ కత్తికే బలవుతాడన్నది ఫ్యాక్షన్ సామెత. ఏ సోషల్‌మీడియాను అయితే ప్రత్యర్ధులపై విపరీతంగా వాడేసే వాడు.. చివరాఖరకు ఆ సోషల్‌మీడియా ట్రోలింగులకే బలవుతాడన్నది ఇప్పటి నయా సామెత. వైసీపీ చేయి పట్టుకుని నడిపించిన ఐ ప్యాక్ కూడా, ఇప్పడు అలాంటి సోషల్‌మీడియా ట్రోలింగులకు బలయిపోవడమే విచిత్రం.

వైసీపీ మార్గదర్శి ఐ ప్యాక్ అన్నది బహిరంగమే. రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిగత జీవితాల నుంచి, వారి వ్యక్తిత్వ హననం వరకూ అంతా అదే చూసుకుంది. వైసీపీ వారికి ఇచ్చిన కాంట్రాక్టు మరి! దానితో ఐప్యాక్ వేల సంఖ్యలో పేటీఎం దళాలను నియమించుకుంది. అంటే టీడీపీ-బీజేపీ-జనసేనపై నెగటివ్‌గా సోషల్‌మీడియాలో పెట్టే ఒక్కో పోస్టుకు.. 5 నుంచి 10 రూపాయలిస్తారట. వారు కాకుండా కో ఆర్డినేటర్లు, ఎనలిస్టులు, సర్వే బృందాలు ఇలా బోలెడు మందిని నెలజీతాలు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంది. ఇది కాకుండా సజ్జల భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ మరో సోషల్‌మీడియా వింగ్ పనిచేస్తుంది.

తెలుగురాష్ట్రాల్లో ప్రజలకు.. గతంలో వివిధ చానెళ్లలో పనిచేసి, కొద్దిగా తెలిసిన ఫేసున్న జర్నలిస్టులు, పెద్ద గొంతేసుకుని అరిచే జనరలిస్టులు, మూతి ముప్ఫయ్ వంకర్లు తిప్పుతూ విశ్లేషించే ఏకవీరులు మరికొంతమంది, సాయంత్రమయితే కళ్లెదుట ఏం జరుగుతుందో, తామే తెలుసుకోలేని, పక్కన మరొకరుంటేగానీ నడవలేని ఎనలిస్టులకు.. రాష్ట్ర ఉపాథి హామీ పథకం కింద, నెలకు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల జీతాలిచ్చి, వారిని ప్రత్యర్ధి పార్టీలపై ఉసిగొల్పి, వైసీపీకి సానుభూతి పోగేయడమే ఈ ‘శ్రమదళాల’ పని.

వీరిలో కొందరు ఎనలిస్టుల ముసుగులో, వివిధ చానెళ్ల కో ఆర్డినేటర్లను పట్టుకుని డిబేట్‌లో కూర్చుని, ప్రముఖులయి పోతారు. మళ్లీ వారు ప్రతిపక్షాలపై వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలనే కట్ చేసి, వైసీపీకి సానుభూతి పోగేసేందుకు వాటిని జనం మీదకు వదులుతుంటారు. వీరిలో దాదాపు 99 శాతం జర్నలిస్టులు కమ్ జనరలిస్టులు పొరపాటునయినా ఏపీకి వెళ్లి, క్షేత్రస్థాయి పరిశీలన చేసిన పాపాన పోరు. హైదరాబాద్‌లోనే కూర్చుని, ఏపీలో తమకు తెలిసిన జర్నలిస్టులకు ఫోన్లు చేసి, ఇక్కడే ఒక వంట వండిస్తారంతే. అది వేరే కథ.

వీరికంటే తెలంగాణ సీనియర్ నేత గోనె ప్రకాశరావే బెటర్. ఆయన ఒక చిన్న బ్యాగ్, పైన టవల్ వేసుకుని ఆంధ్రా అంతా తిరిగి, సర్వే చేసొచ్చారు. ఆయన నిజమైనే జర్నలిస్టయితే.. హైదరాబాద్‌లో తీరికూర్చుని, టీవీ స్టుడియోల చుట్టూ- ఒక చిన్నగదిలో సెల్‌ఫోన్లతో యూట్యూబులు నడిపే వారు జనరిస్టులేనన్నది సీనియర్ పాత్రికేయుల ఉవాచ.

ఇన్ని విన్యాసాలకూ మార్గదర్శి అయిన ఐప్యాక్.. ఇప్పుడు బోలెడన్ని కష్టాల్లో ఉందని అదే సోషల్‌మీడియా కోడై కూస్తోంది. వైసీపీ గెలుపు అవకాశాలపై సర్వే చేసిన ఐప్యాక్ దళాలు తిరిగేందుకు కార్లు సమకూర్చింది. అలా షి‘కారు’చేసిన ట్రావెల్స్‌కు.. ఐప్యాక్ డబ్బులివ్వకుండా దుకాణం సర్దేసింద న్నది, ఇప్పుడు సోషల్‌మీడియాలో గుప్పుమంటున్న వార్త. వందల సంఖ్యలో కార్లు సమకూర్చిన ట్రావెల్స్ యజమానులు, బెజవాడ బెంజిసర్కిల్‌లోని ఐప్యాక్ ఆఫీసుకు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదట. అయితే అధికార పార్టీ కదా.. లేటయినా లేటెస్టుగానయినా డబ్బులిస్తారులే అని సర్దుకుపోయారట.

అయితే ఇటీవల పోలింగ్ ముగిసిన సందర్భంలో.. వైసీపీ అధినేత-సీఎం జగనన్న బెంజిసర్కిల్ ఆఫీసుకు వేంచేసి, మనం గతంలో కంటే ఎక్కువ సీట్లతో గెలవబోతున్నామని స్పీచ్ ఇచ్చి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ.. అక్కడి ‘అక్కషెల్లెమ్మలతో షిక్కటి షిరునవ్వులు షిందిస్తూ’ సెల్ఫీలు కూడా తీసుకున్నారు. జగనన్న అలా వెళ్లిపోయారో లేదో.. ఐప్యాక్ దుకాణం సర్దేశారట. ఉద్యోగుల నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌ట్యాపులు, గట్రాలూ తీసేసుకుని ‘సెలవులిచ్చాం. పండగచేసుకో’మని పంపించేసి, ఆఫీసుకు తాళాలేసుకున్నారట.

ఈ విషయం తెలియని ట్రావెల్స్ యజమానులు ఐప్యాక్ ఆఫీసుకు వెళితే, అక్కడున్న తాళం వారిని చూసి కిసుక్కున నవ్వి వెక్కిరించిందట. దానితో నెత్తీనోరూ కొట్టుకోవడం వారి వంతయింది. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలో తెలియక.. ఉత్తి పుణ్యానికి కార్లు ఇచ్చినందుకు తమ చెంపను తామే వాయించుకున్నారట.

అన్నట్లు.. అసలు ఐప్యాక్ ఆఫీసును పావనం చేసే జగనన్న షెడ్యూలు వాయిదా పడిందట. అయితే ఆ విషయం మీడియాలో రావడంతో, తప్పనిసరై అక్కడి వెళ్లారన్నది సోషల్‌మీడియాలో తిరిగిన వార్త. అసలింకా ఐప్యాక్‌కు, ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన 50 కోట్లు ఇవ్వలేదన్నది మరో కథనం. ఇవన్నీ ఏవిధంగా ఐప్యాక్.. సోషల్‌మీడియాలో వైసీపీ ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా కథనాలను వండి వార్చిందో, సేమ్ టు సేమ్.. ఈ వార్తలు కూడా అలాగే నడవడమే వింత-విశేషం.

LEAVE A RESPONSE