Suryaa.co.in

Editorial

కవిత ధర్నా సరే.. పార్టీలో రిజర్వేషన్ల సంగతేమిటి?

– మరి బీఆర్‌ఎస్‌ 36 అసెంబ్లీ సీట్లు మహిళలకు ఇవ్వలేదేం?
– ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఆ నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించలేదేం?
– కనీసం పార్టీ కమిటీల్లో ఆ 33 శాతం పదవులేవీ?
– మహిళలపై మమకారం ఉంటే ఆ నిష్పత్తిలో సీట్లు ఇవ్వలేదేం?
– ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల పోరాటం ఫలిస్తుందా?
– కవిత ‘రిజర్వేషన్‌’ డిమాండ్‌తో కొత్త పంచాయతీ
– బీఆర్‌ఎస్‌పై బీజేపీ, వైఎస్సార్‌టీపీ విమర్శల వాన
( మార్తి సుబ్రహ్మణ్యం)

మహిళా బిల్లుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత ఢిల్లీ జంతర్‌మంతర్‌ వేదికగా చేయనున్న దీక్ష సక్సెస్‌ అవుతుందా? మహిళా రిజర్వేషన్ల కోసం గళమెత్తిన కవిత రాజకీయ వ్యూహం బెడిసికొడుతుందా? ధర్మం ముందు తన ఇంటి నుంచి ప్రారంభించాలన్న సూత్రాన్ని బీఆర్‌ఎస్‌ విస్మరించిందా?… ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్‌ టాపిక్‌.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్‌ఎస్‌ నేత కవిత, ఢిల్లీ జంతర్‌మంతర్‌లో దీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మహిళల కోసం చేస్తున్న దీక్ష కావడంతో, మహిళలు గంపగుత్తగా బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతారన్న కవిత వ్యూహం వర్కవుటవుతుందా? లేక ఇప్పటివరకూ మహిళలకు పదవులపై పార్టీ తీసుకున్న నిర్ణయాలతో బూమెరాంగవుతుందా? అన్న చ ర్చకు తెరలేచింది. బీఆర్‌ఎస్‌గా మారకముందు, టీఆర్‌ఎస్‌ మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదన్న విమర్శలే దానికి కారణం.

పైగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల, బీజేపీ మహిళా మోర్చా నేత నర్రా జయలక్ష్మి అదే అంశానికి సంబంధించి సంధించిన ప్రశ్నాస్త్రాలపై ఎదురుదాడి చేయలేక, బీఆర్‌ఎస్‌ రాజకీయంగా ఇరుకునపడింది. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌… తన తొలి మంత్రివర్గంలో ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదు. దానితో విపక్షాలు టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించాయి. అయినా కేసీఆర్‌ తన తొలి ఐదేళ్ల పదవీకాలంలో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌కు మాత్రమే మంత్రి పదవులిచ్చారు. మహిళల జనాభా దామాషా ప్రకారం, క్యాబినెట్‌లో మంత్రి పదవులు వస్తాయని మహిళలు భావించారు. కానీ కాంగ్రెస్‌ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌కు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమయింది.

ప్రస్తుతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కవిత, ఢిల్లీలో పోరాటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో.. అసలు అదే 33 శాతం రిజర్వేషన్ల ప్రకారం, బీఆర్‌ఎస్‌ పార్టీపరంగా.. మహిళలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు- కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న కవితకు, మహిళా రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. తొలి ఎన్నికల్లో 6 సీట్లు, 2018 ఎన్నికల్లో 4 అసెంబ్లీ సీట్లు, శాసనమండలిలో 34 స్థానాలకు 3 సీట్లు, 17 ఎంపీ స్థానాలకు 2 సీట్లు మాత్రమే మహిళలకు ఎందుకు కేటాయిస్తారన్న ప్రశ్నలు, కవితతోపాటు బీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నిజంగా బీఆర్‌ఎస్‌ మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయించిన తర్వాత, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల గురించి పోరాడితే, మహిళా లోకం నుంచి అపూర్వ స్పందన వచ్చేదన్న వ్యాఖ్యలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఆవిధంగా తన పరిథిలో ఉన్న సీట్ల కేటాయింపులే చేయలేని బీఆర్‌ఎస్‌కు, ఇప్పుడు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల గురించి, పోరాడే నైతిక హక్కు ఎక్కడిదన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో.. కవిత డిమాండ్‌ ప్రకారమే మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తే, 36 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నాయకత్వం, మహిళలకు టికెట్లు ఇవ్వాలని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. పోనీ, పార్టీ కమిటీల్లోనూ మహిళలకు 33 శాతం ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీలో 36 మంది మహిళలు ఎక్కడున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘‘ కేసీఆర్‌కు నిజంగా మహిళలపై ప్రేమ-మమకారం ఉంటే.. ఇప్పుడు కవిత డిమాండ్‌ చేస్తున్నట్లు, గత ఎన్నికల్లో మహిళలకు 36 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. మరి ఇచ్చారా? తన చేతిలో ఉన్న టికెట్లనే కేటాయించలేని కేసీఆర్‌, ఆయన బిడ్డ కవిత, ఇప్పుడు 33 శాతం మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ మహిళలు అమాయకులా? ముందు కవిత 36 మందికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లతోపాటు, అదే నిష్పత్తిలో కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇప్పించిన తర్వాత, 33 శాతం మహిళా రిజర్వేషన్లపై మాట్లాడితే బాగుంటుంద’ని బీజేపీ మహిళా మోర్చా జాతీయ నేత నర్రా జయలక్ష్మి వ్యాఖ్యానించారు.

మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ఢిల్లీలో చేసే దీక్ష, ఆమె భవిష్యత్తు అరెస్టు తర్వాత వచ్చే సానుభూతి కోసమేనని స్పష్టం చేశారు. పార్టీలో ముందు 33 శాతం మేరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్‌ పదవులను ఇప్పించిన తర్వాత కవిత ధర్నా చేస్తే, తాము కూడా మహిళగా ఆమెకు మద్దతిస్తామని వ్యాఖ్యానించారు.

అటు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా.. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌, మహిళలకు 33 శాతం ఎమ్మెల్యే సీట్లు ఎందుకివ్వలేదని నిలదీయడం గమనార్హం. ‘తెలంగాణ తొలి క్యాబినెట్‌లో మహిళలకు చోటు లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరినే తీసుకున్నారు. ఇదేనా మహిళలపై మీకున్న చిత్తశుద్ధి? అసలు కవిత ధర్నా చేయాల్సింది ఢిల్లీలో కాదు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ ముందు’ అని షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు, మహిళా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

LEAVE A RESPONSE