– సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం సిగ్గుచేటు
– కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు
– కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కుమార్
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షు లు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు. హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నరు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి పేరుంది. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం సిగ్గుచేటు.
బెంగాల్ ఎలక్షన్ లో ఈసీ రూల్ తో ప్రధానమంత్రి మీటింగ్ లు క్యాన్సిల్ అయినయ్. ఆ రూల్స్ వల్ల అమిత్ షా గారి మీటింగ్ కూడా రద్దు చేసుకున్నం. నువ్వో పెద్ద పోటుగాడివంట. నీకోసం ఎలక్షన్ కమీషన్ స్పెషల్ రూల్ పెట్టాలట…. తెలంగాణలో కోవిడ్ ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖలు రాసింది కేసీఆర్ ప్రభుత్వమే.
దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేస్తున్నడు. దళిత సీఎం ఏమైంది? ఉప ముఖ్యమంత్రి ఏమైంది? మూడెకరాల భూమి ఏమైంది? ఈ విషయాలపై దళితులు నిలదీస్తరని తెలిసే ముఖం చెల్లక కేసీఆర్ హుజూరాబాద్ రాకుండా ఈసీపై నెపాన్ని మోపతున్నడు. దళిత బంధుపై హుజూరాబాద్ నుండే బీజేపీ యుద్దం ప్రారంభించబోతున్నం.
దుబ్బాక ఎన్నికల్లో నిరుద్యోగ భ్రుతి, సాగర్ ఎన్నికల్లో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయం ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. దళితులు, బీసీలు సహా పేదలంతా ఏకమై టీఆర్ఎస్ ను ఓడిస్తేనే గడీలు బద్దలవుతాయి. కేసీఆర్ కు బుద్ది వస్తుంది.తెలంగాణ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని 1400 మంది పేద యువత బలిదానం చేస్తే ….పెద్దోళ్లు రాజ్యమేలుతున్నరు. తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు చేసిన త్యాగాలేమున్నయ్? నాడు ఉద్యమాల కోసం బలిదానం చేసుకుంటే….నేడు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి.
పేదల ఇండ్ల కోసం కేంద్రం 3 లక్షల ఇండ్లు మంజూరు చేసి రూ.10 వేల కోట్లు కేటాయిస్తే…ఒక్క ఇల్లు కట్టకుండా ఓట్లను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమైండు. పేదల రాజ్యం రావాలంటే……అందరూ కలిసి గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టాల్సిందే.
ఏం పాపం చేసిండని ఈటల రాజేందర్ ను బయటకు పంపించినవ్? పేదల తరపున నిలదీస్తున్నందుకే ఆయనను బయటకు పంపిన మాట వాస్తవం కాదా? మీకోసం పనిచేసే ఈటల రాజేందర్ కావాలా? మిమ్ముల్ని నట్టేట ముంచే కేసీఆర్ పాలన కావాలా?…ఆలోచించండి.
ఈరోజు దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉచితంగా ఇఛ్చిన ఘనత నరేంద్రమోదీదే. పేదల కోవిడ్ తో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే 9 నెలల్లోనే 100 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్రమోదీదే. ఏనాడైనా కేసీఆర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఏనాడైనా చెప్పిండ్రా?
కేసీఆర్ చేసిన అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని ఖాయమై పోయింది. ఓటుకు రూ.20 వేల పంచేందుకు కంటైనర్లలో డబ్బుల కట్టలు తీసుకొచ్చిండ్రట. అందులో టీఆర్ఎస్ నేతలే ఓటుకు 15 వేలు కట్ చేసుకుని రూ.5 వేలే ఇస్తున్నరట. అవి కూడా దొంగ నోట్లు ఇస్తరేమో జాగ్రత్త.
టీఆర్ఎస్ కు ఓటేయాలంటూ పోలీసులతో బెదిరించి భయపెడుతున్నరు. ప్రజలెవరూ భయపడకండి. స్వేచ్ఛగా ఓటేయండి. పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి. వచ్చేనెల 2న హుజూరాబాద్ ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి. ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తం. వచ్చేనెల 2 తరువాత కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయం.