కీచక ఉపాధ్యాయుల భరతం పడతాం..

– మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– లైంగిక వేధింపుల ఘటనలపై సీరియస్‌
– కఠిన చర్యలకు పోలీసు అధికారులకు ఆదేశాలు
పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై సోమవారం ఆమె స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టికంపై వాసిరెడ్డి పద్మ సీరియస్‌ అయ్యారు.
గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషను హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి ఆమె కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే వాలంటీర్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని… రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించిన ఏ స్థాయి ఉద్యోగినైనా క్షమించరాదని పోలీసులకు చెప్పారు. అదేవిధంగా గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్ లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపై గుంటూరు అర్బన్ పోలీసు అడిషనల్ ఎస్పీతో మాట్లాడి మహిళా కమిషన్ ఆరా తీసింది.
విద్యార్ధినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్ విషయంలో అరెస్టుతో పాటు భవిష్యత్తులో మరొకరు అలా ప్రవర్తించని రీతిలో కఠినమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచకపర్వంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏలూరు సబ్ రిజిస్టార్ తోటి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఏలూరు రిజిస్ట్రేషన్ డిఐజీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.


పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏలూరు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారని.. శాఖాపరమైన చర్యలపై అడగ్గా… తక్షణమే సబ్ రిజిస్టార్ డిప్యూటేషన్ ను రద్దు చేస్తున్నట్లు డిఐజీ సమాధానమిచ్చారు. మహిళలు, బాలికలకు జరుగుతున్న అన్యాయం, వేధింపులపై మహిళా కమిషన్ సత్వరమే స్పందింస్తుందని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

Leave a Reply