Suryaa.co.in

Editorial

నందినగర్‌కు అసెంబ్లీ దూరం.. నల్లగొండ దగ్గరనా?

– ఇప్పటివరకూ అసెంబ్లీకి రాని కేసీఆర్
– విపక్షనేత రాకపోవడం మంచిది కాదన్న రేవంత్
– అనారోగ్య కారణాలంటున్న బీఆర్‌ఎస్ వర్గాలు
– నందినగర్ కేసీఆర్ ఇంటి నుంచి అసెంబ్లీ దూరం 7.2 కిలోమీటర్ల దూరం
– నందినగర్ ఇంటి నుంచి నల్లగొండకు దూరం 109.7 కిలోమీటర్లు
– మరి కేసీఆర్‌కు అసెంబ్లీ దూరమా? నల్లగొండ దూరమా?
– నల్లగొండ వెళ్లేందుకు ఆరోగ్యం సహకరిస్తుందా?
– సభకు వచ్చేందుకు కేసీఆర్‌కు సమస్య ఏమిటి?
– రేవంత్ ర్యాగింగ్ చేస్తారని భయపడుతున్నారా?
– సభకు రానప్పుప్పుడు విపక్షనేత హోదా ఎందుకన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి
– బీసీ నేతకు ఎల్‌ఓపీ ఇవ్వమని రఘువీర్‌రెడ్డి సూచన
– రేవంత్‌కు భయపడి అసెంబ్లీకి రాకపోవడం మంచిదికాదని హితవు
– అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మాపై సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన సీఎంగా ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్లేవారు కాదు.. వాస్తులోపం అని చెప్పి పాతది కూల్చి, రాజభవనం లాంటి కొత్త సచివాలయం కట్టించారు. మరి అక్కడకైనా రోజూ వెళ్లారా అంటే అదీ లేదు… అది కూడా మూడురోజుల ముచ్చటగానే మిగిలింది. ఇప్పడది రేవంత్‌రెడ్డి కోసమే కట్టించినట్లయింది. అలాగని పార్టీ ఆఫీసుకూ వెళ్లేవారు కాదు.. జెండా కూడా నాయని నర్శింహారెడ్డి లాంటి వాళ్లు ఎగరేసేవాళ్లు.

సరే.. ఇప్పుడాయన సీఎం కాదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత. 39 మంది ఉన్న తన పార్టీ ఎమ్మెల్యేలకు నాయకుడు. మరి ఇప్పుడైనా సభకు వస్తున్నారా అంటే అదీ లేదు.. కారణం అనారోగ్యమన్నది ఆ పార్టీ నేతల ఉవాచ. నిజమే కావచ్చు! ఆ ప్రకారమైతే ఆయన ఇంటి నుంచి ఎక్కడకూ కదలకూడదు. కానీ ఇప్పుడాయన నల్లగొండ సభకు వెళుతున్నారు. అదే విచిత్రం. ఆ లెక్కప్రకారం ఆయన హైదరాబాద్‌లోని నందినగర్ ఇంటికి అసెంబ్లీ దూరం.. నల్లగొండ బహు దగ్గరన్నమాట. ఇదీ బీఆర్‌ఎస్ అధినేత-విపక్షనేత కేసీఆర్ తీరుపై, సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్ల యవ్వారం!

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్టెట్ సమావేశాల్లో అధికార-ప్రతిపక్షాల మధ్య, మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. వ్యంగ్యాస్త్రాలు.. వాగ్వాదాలు.. లెక్కల చిట్టాలు.. దాడి-ఎదరుదాడులతో సభ రసవత్తరంగా సాగుతోంది. కాకపోతే ఒకటే లోటు. సభలో విపక్ష నేత కేసీఆర్ ఒక్కరే కనిపించడం లేదు. సభలో ఆయన స్థానం ఖాళీగానే ఉంది. కారణం అనారోగ్యమన్నది, ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. అంటే కాలుజారి కిందపడి తొంటికి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్, ఇంకా కోలుకోలేదని జనం అర్ధం చేసుకోవాలన్నమాట.

దానిని ఎవరూ ఆక్షేపించలేం. ఎందుకంటే ఆయన వయసు కూడా పెద్దదే కాబట్టి. కుదరుకోవాలంటే కొంతకాలం పడుతుంది కాబట్టి! అయినా కేసీఆర్ నివసించే నందినగర్ ఇంటికి.. అసెంబ్లీ 7.2 కిలోమీటర్లే దూరం. అంటే ఆయన ఇంటి నుంచి అసెంబ్లీకి సరిగ్గా పదినిమిషాల ప్రయాణం అన్నమాట. కాబట్టి ప్రయాణంతో వచ్చిన పేచీ ఏమీ లేదు. వచ్చి కూర్చోవడమే సమస్య. అందువల్ల కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అనుకుందాం.

సీన్ కట్ చేస్తే కృష్ణానదిపై ఉన్న.. ప్రాజెక్టుల సాగునీటి హక్కులు కాపాడుకునేందుకు, బీఆర్‌ఎస్ నేడు నల్లగొండలో బహిరంగసభ నిర్వహిస్తోంది. ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా, మూడు జిల్లాల నుంచి సభకు భారీ జనసమీకరణ చేయనున్నారు. దానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవడంతో, ఆయన ‘ఆరోగ్యం-అసెంబ్లీకి డుమ్మా’పై, సోషల్‌మీడియాలో అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే వ్యంగ్యాస్త్రాలూ సీమటపాసుల్లా పేలుతున్నాయ్.

అంటే.. ఆరోగ్యం బాగోలేని కేసీఆర్.. 7.2 కిలోమీటర్ల దూరం ఉన్న అసెంబ్లీకి రావటం లేదు. మరి కేసీఆర్ ఇంటి నుంచి.. 109.7 కిలోమీటర్లు దూరం ఉండే నల్లగొండకు ఎలా వెళుతున్నారు? అసలు అంతసేపు కూర్చునేందుకు ఆయన ఆరోగ్యం ఎలా సహకరిస్తుంది? తుంటికి ఆపరేషన్ అయిన మనిషి అంతసేపు ఎలా స్థిమితంగా కూర్చుంటారు? అన్న ప్రశ్నలు సోషల్‌మీడియాలో మిస్సైళ్లలా దూసుకువస్తున్నాయి.

అంటే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లే చిత్తశుద్ధి లేదని కొందరు… వెళితే రేవంత్‌రెడ్డి మాటలతో ర్యాంగింగ్ చేస్తారన్న భయంతోనే ఇంట్లో ఉంటున్నారని ఇంకొందరు.. కేసీఆర్ ఇల్లు అసెంబ్లీకి దూరం. నల్లగొండ దగ్గరనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇది సహజంగానే బీఆర్‌ఎస్‌కు ప్రాణసంకటంలా పరిణమించింది.

కాగా కేసీఆర్ వ్యవహారశైలిని పీసీసీ ప్రధాన కార్యదర్శి కె రఘవీర్‌రెడ్డి తప్పుపట్టారు. ‘‘దగ్గరే ఉన్న అసెంబ్లీకి రాని కేసీఆర్, ఒక జిల్లా దాటి, మరో జిల్లాకు వెళ్లేందుకు మాత్రం తీరిక ఉందా? సభలో ప్రజాసమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావలసిన బాధ్యత గల విపక్ష నేత, ఇలా అసెంబ్లీకి డుమ్మా కొట్టడం మంచిదికాదు. కేసీఆర్ ఏమీ ఫ్రీగా అసెంబ్లీకి రావడం లేదు కదా? అందరు ఎమ్మెల్యేల మాదిరిగా ఆయనకూ టీఏ-డీఏ కూడా ఇస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో గెలుపు-ఓటములు సహజమని, ఓడినంత మాత్రాన సిగ్గుతోనో.. రేవంత్‌రెడ్డిని చూసి భయపడో సభకు రాకుండా, ఇంట్లో కూర్చోవడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సెక్రటేరియేట్, పార్టీ ఆఫీసుకు వెళ్లేవారు కాదు. అంబేద్కర్ సహా ప్రముఖుల వర్థంతి రోజు కూడా బయటకు వచ్చేవారు కాదు. చివరకు పార్టీ ఆఫీసులో దివంగత నాయని నర్శింహారెడ్డితో జెండా ఎగురవేయించిన సందర్భాలు కోకొల్లలు. కనీసం ఇప్పుడు విపక్షనేతగా కూడా సభకు రాకపోతే ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు? దానిని మీ పార్టీలోని బీసీకి ఇచ్చి తప్పుకోండి’’ అని రఘువీర్‌రెడ్డి సలహా ఇచ్చారు.

ఏపీకి ప్రాజెక్టులపై పెత్తనం అప్పగించి, సీఎం జగన్‌కు ప్రగతిభవన్‌లో బిర్యానీపెట్టి, నగరిలో రోజా చేసిన చేపల పులుసు తిన్నందుకు, నల్గొండలో ముక్కును నేలకు రాసి తమ జిల్లాకు రావాలని రఘువీర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE