ఇష్టపడి పని చేస్తే కష్టమైనా సాధించవచ్చు

– గతంలో అవార్డులు ఇస్తామన్నా వద్దన్నా
– పద్మవిభూషణ్ అవార్డు వినమ్రతతో స్వీకరిస్తా
– ఆరెస్సెస్‌తోనే తెలుసుకోవడం నేర్చుకున్నా
– ప్రజాజీవితంలో ఉన్నవారు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి
– కుటుంబ వ్యవస్థ బలహీనపడితే దేశానికే ప్రమాదం
– రాజకీయాల్లో మంచివాళ్లకు గుర్తింపు రావడం లేదు
– సుజనా-కామినేని సత్కార సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఇష్టపడి పనిచేస్తే కష్టమైనా దానిని సాధించవచ్చని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి మనిషి తెలుసుకోవడం నేర్చుకునే తత్వం అలవాటుచేసుకోవాలన్నారు. తనకు ఆరెస్సెస్‌లోనే తెలుసుకునే తత్వం అలవాటయిందని వెల్లడించారు. వెంకయ్యకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో.. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి దంపతు లు -ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా, వెంకయ్య దంపతులకు ఆత్మీయ సన్మానం చేశారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ ఐటీ జోన్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… రాజకీయాల్లో మంచివారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఉన్న వారు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని సూచించారు. కుటుంబ వ్యవస్థ కూలిపోతే దేశానికే నష్టమని స్పష్టం చేశారు. సమయపాలన-క్రమశిక్షణ-కష్టపడే గుణం ఉంటే ఉన్నత స్థానాల్లో రాణించవచ్చన్నారు.

గతంలో తనకు అనేక యూనివర్శిటీలు, సంస్థలు అవార్డులు ఇస్తామని ముందుకొచ్చినా తాను నిరాకరించానని గుర్తు చేశారు. పద్మవిభూషణ్ అవార్డును మాత్రం వినమ్రతతో స్వీకరిస్తానన్నారు. దేశంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను గుర్తించి, వారికి అవార్డులు ఇచ్చినందుకు ప్రధాని మోదీని అభినందించారు. తనకు వచ్చిన అవార్డును రైతులు-మహిళలకు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు.

కేంద్ర మాజీ మంత్రి- బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరి మాట్లాడుతూ, వెంకయ్య నాయుడు జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయమని కొనియాడారు. తన నిబద్ధత-సమయపాలన-క్రమశిక్షణాయుత జీవితం, తమలాంటి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయనను చూసి నేటి యువ రాజకీయనేతలు చాలా నేర్చుకోవాలని సూచించారు. తన వివాదరహిత జీవితంలో వెంకయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.

రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు కట్టుబడి జీవించేవారు బహు తక్కువ అని, అలాంటి వారిలో వెంక్యనాయుడు ఒకరని ప్రశంసించారు. వెంకయ్యకు పద్మవిభూషణ్ రావడం అంటే తెలుగువారికి, దేశంలోని రైతులందరికీ అవార్డు ఇచ్చినట్లేనన్నారు. వెంకయ్యకు అవార్డు ప్రకటించిన ప్రధాని మోదీకి సుజనా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపి రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపి కెవిపి రామచంద్రరావు, మురళీమోహన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Leave a Reply