జగన్‌పై బ్రదర్ అనిల్ క్రైస్తవాస్త్రం!

– రంగంలోకి దిగిన బ్రదర్ అనిల్
– విశాఖ నుంచే సమర శంఖారావం
– మంగళవారం విశాఖలో క్రైస్తవ పెద్దలతో భేటీ
– పాస్టర్లు, ఫాదర్లతో కీలక సమావేశం
– 500 మంది మత పెద్దల హాజరు
– అంతకుముందే వారితో అభిప్రాయసేకరణ
– షర్మిల వెంటే ఉంటామన్న మత పెద్దలు
– తర్వాతనే సమావేశం ఖరారు
– విశాఖలోనే కూటములు ప్రారంభం?
– అక్కడే కార్యాచరణ ఖరారు
– నాడు బావమరిదిని గెలిపించేందుకు
– నేడు భార్యను గెలిపించేందుకు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో కులం కార్డు ప్రమాదం. అదే మతం కార్డయితే మహా ప్రమాదం. గత ఎన్నికల్లో ఆ అస్త్రాన్నే టీడీపీపై సంధించిన క్రైస్తవమత ప్రముఖుడు బ్రదర్ అనిల్.. ఇప్పుడు బాణాన్ని బావమరిది జగన్ వైపు తిప్పారు. పీసీసీ చీఫ్ అయిన భార్య షర్మిలారెడ్డిని గెలిపించేందుకు రంగంలోకి దిగారు. అప్పుడూ ఇప్పుడూ ఒకే అస్త్రం. కాకపోతే అంశాలే వేరు. నాడు చంద్రబాబు నాయుడు టార్గెట్ అయితే.. ఇప్పుడు బావమరిది జగన్మోహన్‌రెడ్డి. మిగిలినదంతా సేమ్ టు సేమ్.

అనుకున్నదే జరుగుతోంది. ఊహించిందే నిజమవుతోంది. అంచనాలు అక్షర సత్యాలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజంలో, ఇమేజ్-క్రేజ్ ఉన్న బ్రదర్ అనిల్ రంగంలోకి దిగేశారు. గత ఎన్నికల్లో అన్న జగన్‌ను గెలిపించేందుకు చెల్లి షర్మిలారెడ్డి, కాళ్లకు పుళ్లుపడేలా 3 వేల కిలోమీటర్లకు పైగా తిరిగి, తన రెక్కల కష్టంతో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కారణమయింది. అదే సమయంలో బావమరిదిని సీఎం చేయాలన్న పట్టుదలతో బావ బ్రదర్ అనిల్, క్రైస్తవ మతపెద్దలతో కలసి శ్రమదానం చేశారు.

అనిల్ ప్రభావం ఉన్న చర్చిలన్నీ, జగన్‌ను సీఎం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాయి. జగన్ పాదయాత్రను వెనుకండి నడిపించాయి. ఎన్నికల్లో క్రైస్తవ-దళిత క్రైస్తవ పెద్దలంతా చాపకింద నీరులా పనిచేసి జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేశారన్నది మనం మనుషులం అన్నంత నిజం. అలా షర్మిల-అనిల్ రెక్కల కష్టంతో ఏర్పడ్డ వైసీపీ సౌధం నుంచి.. అతి తక్కువ కాలంలోనే , అన్యాయంగా.. అవమానకరంగా చెల్లి-బావ ‘స్వయం నిష్క్రమణ’ పరిస్థితి కల్పించారు.

అలా.. జగన్ అన్న ఎప్పుడు కష్టాల్లో ఉన్నా.. పిలకపోయినా వెళ్లి రెక్కల కష్టం చేసిన చెల్లి.. కొడుకును సీఎంగా చూడాలన్న అత్తమ్మ విజయలక్ష్మి కోరికను బావ అనిల్ నెరవేర్చి, చివరాఖరకు అంతా మూకుమ్మడిగా తాడేపల్లి నుంచి తరలివెళ్లడం విషాదమే. ఇదంతా పాత కథే. ఇప్పుడు షర్మిల, వేదికలపై కొత్తగా చెబుతున్న పాత కథనే.

ఇప్పుడు బ్రదర్ అనిల్ భార్య షర్మిలా రెడ్డి ఏపీ కాంగ్రెస్ దళపతి. పార్టీ పగ్గాలందుకున్న వెంటనే సివంగిలా, జగన్ అన్న సర్కారుపై విరుచుకుపడుతోంది. బాధ్యతలు స్వీకరించకముందే మణిపూర్‌లో క్రైస్తవుల దాడి జరిగినప్పుడు జగన్ అన్న స్పందించకుండా బెల్లంకొట్టిన రాయిలా మౌనంగా ఉన్నారని, ఎంట్రీకి ముందే క్రైస్తవ అస్త్రం సంధించి, క్రైస్తవ సమాజాన్ని మెప్పించారు.. అధ్యక్షురాలయ్యాక, ఇసుక-మద్యం-భూములతో కోట్లకు పడగలెత్తిన జగనన్న సామ్రాజ్యాన్ని, ఒంటరిగా ఢీ కొంటోంది. ఫలితంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌లో, మెరుపులాంటి కదలిక. కార్యకర్తల్లో తొంగిచూస్తోన్న సమరోత్సాహం.

కానీ ఎంతున్నా జగన్ పార్టీకి క్రైస్తవులు-దళిత క్రైస్తవులే దన్ను. అది తెలిసిన బ్రదర్ అనిల్… వైసీపీ మూలాలను కదిలించి, దానిని పెకలించేందుకు మళ్లీ క్రైస్తవ అస్త్రం సంధిస్తున్నారు. జగన్ అమితంగా ప్రేమిస్తున్న విశాఖ నుంచే.. బావమరిదిపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఏ క్రైస్తవుల దన్నుతో జగన్ గద్దెనెక్కారో.. అదే క్రైస్తవులతో గద్దె కూల్చేందుకు, బ్రదర్ అనిల్ సిద్ధమవుతున్నారు.

అందులో భాగంగా మంగళవారం విశాఖ నగరంలోని ఒక చర్చిలో దాదాపు 550 మంది క్రైస్తవ మత పెద్దలతో కీలక సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. హిందూ సమాజంపై పూజారుల ప్రభావం ఎలా ఉంటుందో, క్రైస్తవ సమాజంలో ఫాదర్లు-పాస్టర్ల ప్రభావం అంతకు వందరెట్ల ప్రభావం ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బ్రదర్ అనిల్ వారినే జగన్‌పై అస్త్రంగా సంధిస్తున్నారు.

విశాఖలో జరగనున్న ఈ సమావేశంలో విశాఖ నగరం, శివారు ప్రాంతాల్లోని చర్చిల నుంచి, పెద్ద సంఖ్యలో ఫాదర్లు-పాస్టర్లు రానున్నారు. అయితే దీనికంటే ముందుగానే.. అనిల్-ఆయన సన్నిహిత బృందం, ఫాదర్లు-పాస్టర్లతో అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలుస్తోంది. తాము ఏ పరిస్థితిలో జగన్‌తో యుద్ధం చేయాల్సి వస్తోంది? తమను జగన్ ఏవిధంగా మోసం చేశారు? క్రైస్తవ- దళిత క్రైస్తవుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్, వారికి ఎలా అన్యాయం చేస్తున్నారు? క్రైస్తవుల పేరు చెప్పి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తున్నారు? సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను, మళ్లీ క్రైస్తవులు గెలిపించుకోవాల్సిన అవసరం గురించి, అనిల్ అండ్ కో వారికి స్పష్టమైన వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

దానితో నిజాలు తెలుసుకున్న క్రైస్తవ మత పెద్దలు.. తాము రేపటి ఎన్నికల్లో షర్మిల అధ్యక్షురాలిగా ఉన్న, కాంగ్రెస్‌కు దన్నుగా ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరికొందరు మత పెద్దలయితే .. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో.. కాంగ్రెస్‌కు మద్దతునీయడం, ప్రతి క్త్రైస్తవుడి బాధ్యత-ధర్మమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ భరోసాతోనే బ్రదర్ అనిల్.. విశాఖ చర్చిలో మంగళవారం మతపెద్దలతో భేటీ కానున్నట్లు కనిపిస్తోంది.

అదే ఉత్సాహంతో ఆయన.. తన బావమరిది జగన్ అమితంగా ప్రేమించే విశాఖ నుంచే, క్రైస్తవ కూటములు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాడేరు లేదా నర్సీపట్నం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, క్రైస్తవ మతం ఆచరించే ఎస్సీ-ఎస్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎస్టీల్లో కూడా మతం మారిన వారే అధికం. దానితో ఆ రెండు ప్రాంతాల్లో ఒక చోట నుంచి… క్రైస్తవ కూటములు ప్రారంభించాలని, బ్రదర్ అనిల్ భావిస్తున్నట్లు క్రైస్తవ వర్గాల సమాచారం. సో మొత్తానికి బావ-బావమరిది యుద్ధం మొదలయిందన్నమాట.

Leave a Reply