– కేసీఆర్ ఫాం హౌస్ కలలు మానుకోవాలి
– టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన… గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన,ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారు.ఆయన వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూరుకుపోయిన కేసీఆర్ కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్ ఫాం హౌస్‌లో పగటి కలలు కంటున్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్, కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదం. కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా?
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో రేషన్ కార్డుల కోసం నిరుపేదలు ఎదురుచూస్తే పట్టించుకోని కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల వరకు రేషన్ కార్డులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధితో బీఆర్‌ఎస్ ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు పలుకుతున్నారు.