Suryaa.co.in

National

అప్పులు చేసి ఉచితాలు ఇవ్వడం పరిపాలన కాదు:కేజ్రివాల్

మన దగ్గర మిగులుంటే అవసరమైన పేదలకు ఉచితంగా ఏదైనా చేయొచ్చు. అప్పులు చేసి ఉచితంగా ఇవ్వడం పరిపాలన అనిపించుకోదు. ఆమ్​ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేపట్టక ముందు ఢిల్లీ రాష్ట్రం అప్పులతో సతమతమయ్యేది. నేడు దేశంలో అప్పు లేకుండా మిగులు కలిగిన రాష్ట్రంగా ఎదిగాం. అందుకు ప్రధాన కారణం ఆర్థిక క్రమశిక్షణ,అవినీతి నిర్మూలనేనంటూ ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్​ నిర్మొహమాటంగా వెల్లడించారు. టైమ్స్​ నెట్​ టెలివిజన్​ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు మీరు ఉచిత వైద్యం, కరెంటు, మంచినీళ్లివ్వడాన్ని ఓ ఐఆర్​ఎస్​ ప్రొఫెషనల్​గా ఎలా సమర్థించుకుంటారని యాంకర్​ అడిగారు. దీనిపై కేజ్రివాల్​ స్పందిస్తూ.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నాలుగు వేల యూనిట్ల దాకా విద్యుత్​ ఉచితంగా పొందుతున్నారు. మరి నెలకు 250 యూనిట్లు వినియోగించే పేదలకు ఉచితంగా ఎందుకివ్వకూడదన్నారు. ఇటీవల మూడు వేల కోట్ల అంచనాతో ఓ ఫ్లైవర్​ నిర్మించాం. ఎక్కడా అవినీతికి తావులేకుండా పొదుపుగా ఖర్చు పెట్టడం వల్ల రూ.500 కోట్లు మిగిలాయి. వాటితో ఏం చేయొచ్చో మంత్రులతో చర్చించా. పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి రూ.350 కోట్లు సరిపోతుందన్నారు.. వెంటనే అమలు చేశాం.
అలాగే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.190 కోట్లు పెట్టి హెలికాప్టర్​ కొనుక్కున్నారు. ఆ రాష్ట్రంలో ప్రజల నెత్తిన పెద్ద ఎత్తున పన్నులేస్తున్నారు. మేం అలా ప్రజలపై పన్నులు మోపడం లేదు. మావద్ద ఉన్న మిగులుతో వంద కోట్లు వెచ్చించి బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాం. ఇలా ప్రాథమ్యాలు ఎంచుకోవడంలో విజ్ఞత ఉండాలి. ప్రజా ప్రయోజనాన్ని ప్రధానంగా చూడాలి. అవినీతి లేకుండా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ రాష్ట్రమైనా అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేయాల్సిన దుస్థితి ఉండదని కేజ్రివాల్​ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రభుత్వాలతో పోల్చుకుంటూ ‘సెబ్బాష్​ కేజ్రివాల్​’ అంటూ పొగిడేస్తున్నారు.

LEAVE A RESPONSE