– ‘కమల వనం’లో కిరణ్‌కుమార్‌రెడ్డి
– నల్లారి చేరికతో బీజేపీ బలపడుతుందా?
– క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తేనే బీజేపీలో గుర్తింపు
– అంత ఓపిక కిరణ్‌కు ఉందా?
– కాంగ్రెస్‌కు భిన్నమైన బీజేపీలో కిరణ్ మనుగడ సాధిస్తారా?
– బీజేపీ అంతర్గత రాజకీయాలను కిరణ్ తట్టుకుంటారా?
– వైసీపీ అనుకూల-వ్యతిరేక వర్గాల్లో కిరణ్ ఎటువైపు?
– ఇప్పటికే కన్నా సహా పలువురు ప్రముఖుల రాజీనామాలు
– సుజనా, సీఎం రమేష్, టిజి వెంకటేష్ మౌనం
– రెడ్డి వర్గాన్ని ఆకర్షించే శక్తి నల్లారికి ఇంకా ఉందా?
– కిరణ్ రాకతో సీమలో బీజేపీ పుంజుకుంటుందా?
– సొంత చిత్తూరు జిల్లాలో పార్టీ సంగతేమిటి?
– ఇంతకూ కిరణ్ పనిచేసేది ఏపీకా? తెలంగాణకా?
– తెలంగాణలో ‘సమైక్యసింహం’ కార్డు బూమెరాంగవుతుందా?
– నాడు విభజనపై కిరణ్ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు వరమవుతాయా?
– తెలంగాణ రెడ్లపై ప్రభావితం చేసే శక్తి ఇప్పుడు ఉందా?
– తెలంగాణ కాంగ్రెస్ రెడ్లు కిరణ్ వెంట వస్తారా?
– చేరికతో లాభం పార్టీకా? కిరణ్‌కా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రెస్‌మీట్‌లో ఒక చిన్న రాయి తెచ్చి, దానిని బెర్లిన్ గోడ రాయితో పోల్చిన ఉమ్మడి ఏపీ చిట్ట చివరి సీఎం గుర్తున్నారా? రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ వైఖరికి నిరసనగా పార్టీకి రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి.. చెప్పు గుర్తుతో పోటీ చేసి.. ఇప్పటిదాకా బయట ఎక్కడా కనిపించని, అప్పటి సీఎం గుర్తున్నారా? హైదరాబాద్‌లో మజ్లిస్‌ను మంచినీళ్లు తాగించిన నాటి ధైర్యశాలి అయిన సీఎం గుర్తున్నారా? యస్. ఆయనే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఇప్పుడాయన కాంగ్రెస్ నుంచి జంపయి, కాషాయం కండువా కప్పేసుకున్నారు.
‘కమలవనం’లో సేదతీరేందుకు వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఆ పార్టీ ఆశించిన స్థాయిలో గౌరవమిస్తుందా? అసలు నల్లారిని ఏ లక్ష్యంతో పార్టీలోకి తీసుకున్నారో, ఆ లక్ష్యం కిరణ్‌తో కుదురుతుందా? కాంగ్రెస్‌లో అనుభవించిన స్వేచ్ఛను కిరణ్ ‘పువ్వుపార్టీ’లో అనుభవిస్తారా? అసలు కిరణ్ రాకతో లాభం ఎవరికి? రాజకీయంగా బీజేపీకా? లేక వ్యక్తిగతంగా నల్లారికా? ఎవరినీ ఎక్కిరానీయని, ప్రధానంగా బయట పార్టీల నుంచి వచ్చే వారిని విజయవంతంగా వెనక్కి పంపించే, ఏపీ బీజేపీ బాసులతో కిరణ్ సర్దుకుపోతారా? లేక వెళ్లిపోయిన వారి దారిని అనుసరిస్తారా?
ఇంతకూ కిరణ్ కార్యక్షేత్రం ఆంధ్రానా? తెలంగాణనా? ఒకవేళ తెలంగాణ అయితే ఆయనతో బీజేపీకి లాభమా? నష్టమా? పోనీ ఆంధ్రాలో ఆయన రాకతో ‘కమల కిరణం’ అవుతుందా? ఆంధ్రా మొత్తం కాకపోయినా సొంత చిత్తూరు జిల్లాలో అయినా ‘పువ్వుపార్టీ’ పరిమళిస్తుందా? ఇదీ.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీలో చేరిక తర్వాత రాజకీయ వర్గాల్లో జరుగుతున్న హాట్‌టాపిక్.
ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అంతా అనుకున్నట్లుగానే.. ‘తాను వ్యతిరేకించిన రాష్ట్ర విభజనకు సహకరించిన’ బీజేపీ తీర్ధం తీసుకున్నారు. అయితే ఆయన చేరిక వల్ల సంస్థాగతంగా బీజేపీకి లాభమా? రాజకీయంగా నల్లారికి లాభమా? అన్న చర్చకు తెరలేచింది. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసి, ఎమ్మెల్యే, చీఫ్ విప్, స్పీకర్, సీఎం పదవులు అనుభవించిన నల్లారికి, ఆ పార్టీలో సొంత వర్గం ఏమీ లేదు. వైఎస్ ఆయనను ప్రోత్సహించారు.
స్వతహాగా నల్లారి.. ఎవరినీ ప్రభావితం చేసే స్థాయి నేత కూడా కాదు. చివరకు సొంత జిల్లాలో కూడా ప్రభావిత నేతగా గుర్తింపు పొందలేదు. ఆయన ఎమ్మెల్యే, సీఎంగా ఉన్నప్పటికీ.. తన సొంత నియోజకవర్గంలో వ్యవహారాలు చూసేది ఆయన సోదరుడు కిశోర్ మాత్రమే. ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. కేవలం అదృష్టం వరించి మాత్రమే, ఆయనకు కాంగ్రెస్ హయాంలో సీఎం పదవి లభించిందన్నది బహిరంగ రహస్యం. ప్రత్యేకంగా వర్గం లేకుండా- జనబలం లేకుండా- పార్టీలో ఎలాంటి పదవులు నిర్వహించకుండా.. సీఎం వంటి అత్యున్నత స్థానానికి ఎదగడం కేవలం అదృష్టమే తప్ప, ప్రతిభ కాదన్నది ఇప్పటికీ రాజకీయవర్గాల్లో వినిపించే టాక్.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని విబేధించి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. అయితే అది అంతకుముందు మరొకరి పేరుతో రిజిస్ట్రరయినప్పటికీ, ఎన్నికల ముందు దానిని ఆయనే నడిపించారు. చెప్పు గుర్తుతో పోటీ చేసినా, ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. అసలు ఆ ఎన్నికల్లో, ఆయనే పోటీ చేయకపోవడం మరో విచిత్రం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిన సమయంలో, నల్లారి రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించారు. కీలక ఘటనల్లో కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు.
అటు కాంగ్రెస్‌కు దూరమయి, ఇటు సొంత పార్టీని కొనసాగించకుండా కేవలం వాకింగ్, ఫ్రెండ్స్‌కే పరిమితమయ్యారు. దానితో కిరణ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మధ్యలో బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా, ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకే ప్రాధాన్యమిచ్చారు. ఆ రకంగా తన కోరిక నెరవేరినప్పటికీ, రాహుల్ ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి, ఏదో ఒక రాష్ట్రానికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారన్న కిరణ్ కోరిక ఫలించలేదు. చివరకు ఏపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ చేసినా ఆయన అంగీకరించలేదు.
స్వతహాగా క్రికెటర్ అయిన కిరణ్.. బీజేపీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించటం చర్చనీయాంశమయింది. ఏపీలో పూర్తిగా శూన్యస్థాయిలో ఉన్న బీజేపీని, కిరణ్ ఏవిధంగా వెలిగించగలరన్న సందేహాలు మొదలయ్యాయి. సొంతంగా వర్గమంటూ లేకపోగా.. ఇప్పటి తరంతో పెద్దగా సంబంధాలు లేకుండా, పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైన కిరణ్, ఏపీ బీజేపీని అర్ధం చేసుకోవడానికే చాలాకాలం పడుతుంది. ఏపీ సమస్యల పరిష్కారం కోసం పోరాటం అటుంచి, ముందు బీజేపీలో తన మనుగడ కోసమే, ఆయన ఎక్కువ పోరాటం చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పటివరకూ బయటనుంచి వచ్చిన వారికి ఎదురైన అనుభవం.
తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి కొత్తగాచేరిన వారిని, బీజేపీ నేతలు మనస్ఫూర్తిగా స్వాగతించరు. వారు తమంతట తాము నిష్క్రమించేంత వరకూ, తమ రాజకీయాలను విజయవంతంగా ప్రయోగిస్తారు. వారిని ‘ఇది తమ పార్టీగా’ భావించుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వరు.
బీజేపీ సీనియర్లు తమలో తమకు అంతర్గతంగా ఎన్ని విబేధాలున్నప్పటికీ, బయట నుంచి వచ్చిన వారిని ‘సాగనంపే రాజకీయంలో’ మాత్రం కలసిపనిచేస్తారు. తెలంగాణలో నాగం నుంచి ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ వరకూ జరిగింది అదే. క్రికెట్‌లో యార్కర్లు, బౌన్సర్లను అవలీలగా ఎదుర్కొన్న నల్లారికి.. ‘బీజేపీ ఇంటర్నల్ పొలిటికల్ గేమ్’ను తట్టుకోవడంపైనే బీజేపీలో ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ప్రధానంగా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బృందాన్ని తట్టుకోవడం కిరణ్‌కు కష్టమే. వీటికిమించి.. ఏపీ బీజేపీలోని వైసీపీ అనుకూల-వ్యతిరేక వర్గాల్లో, ఆయన ఎటు వైపు ఉంటారో తేలిన తర్వాతనే.. కిరణ్‌కు అసలు కష్టాలు మొదలవుతాయి. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపి టిజి వెంకటేష్ వంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారంతా.. సోము వైఖరి నచ్చక, పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా పనిచేసినప్పటికీ, ఏపీ బీజేపీలో సోము వీర్రాజు-సునీల్ దియోధర్-మధుక ర్‌జీ వంటి త్రిమూర్తుల మాటే వేదం. వీరికి ఒక మాజీ సంఘటనా మంత్రి, ఢిల్లీ నుంచి నిరంతరం దిశానిర్దేశం చేస్తుంటారు. ఆయన ఆశీస్సులతోనే, వెంకయ్య అడ్డుపడినప్పటికీ, సోము వీర్రాజు అధ్యక్షుడయ్యారు.
కిరణ్ మాజీ సీఎం అయినప్పటికీ.. కాంగ్రెస్‌లో మాదిరిగా సొంత వ్యక్తిత్వం, సొంత ఆలోచనలు బీజేపీలో పనికిరావు. పైగా ప్రతి కార్యక్రమానికీ హాజరుకావలసి ఉంటుంది. తనది సీఎం స్ధాయి అనుకుంటే అది బీజేపీలో కుదరదు. ఇప్పటిదాకా రాజకీయాలకు దాదాపు దూరంగా ఉండి, ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్న కిరణ్ వీటిని ఎలా అధిగమిస్తారో చూడాలి. క్షేత్రస్థాయి పోరాటాలకు ఆయన ఎంతవరకూ సమయం కేటాయిస్తారన్నది ప్రశ్న.
ఇక ఏపీలో కిరణ్ చేరిక బీజేపీకి ఏమేరకు లాభిస్తుందన్న చర్చ, అటు బీజేపీ వర్గాల్లోనూ జరుగుతుంది. ఒక మాజీ సీఎం స్థాయి నేత బీజేపీలో చేరారన్న ప్రచారం వరకూ అది పనికివస్తుందన్నది మెజారిటీ నేతల వాదన. రెడ్డి సామాజికవర్గం మెజారిటీ శాత ం వైసీపీ వైపు ఉండగా, మిగిలిన వర్గం టీడీపీలో కొనసాగుతోంది. టీడీపీ విపక్షంలోకి వచ్చినప్పటికీ, ఆ పార్టీలోని కమ్మనేతలు పార్టీ ఫిరాయించారే తప్ప.. మొదటి నుంచి టీడీపీలో ఉన్న రెడ్డి నేతలెవరూ పార్టీ మారకపోవడాన్ని విస్మరించకూడదు. ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా.. రెడ్ల ప్రభావిత జిల్లాలయిన కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశంలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం.
ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయాలను పరిశీలిస్తే.. రెడ్డి సామాజికవర్గం, రాజకీయ మార్పులకు సంబంధించిన వాసనలు వెంటనే పసిగడుతుంది. ఆ ప్రకారంగా మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని గ్రహిస్తేనే, ఆ పార్టీ వైపు వెళుతుంది. వైసీపీ బలహీనంగా ఉందని తెలిస్తే, టీడీపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటుందే తప్ప, బీజేపీని ఎంచుకోదు. మరి కిరణ్‌తో ఏపీలో ‘రెడ్డికారు’్డ ఎలా వర్కవుట్ అవుతుందన్నది పార్టీ నేతల సందేహం.
పోనీ కనీసం తన సొంత చిత్తూరు జిల్లా రాజకీయాలపైనయినా కిరణ్ ప్రభావితం చూపుతారా అంటే, అదీ కష్టమేనని బీజేపీ నేతల వాదన. సొంత తమ్ముడు టీడీపీలో ఉన్న నేపథ్యంలో.. ఇతర పార్టీల నుంచి ఆయన ఎంతమందిని బీజేపీకి తీసుకువస్తారో చెప్పడం సందేహమేనంటున్నారు. ఇప్పటిదాకా చిత్తూరు జిల్లాలో చిలకం రామచంద్రారెడ్డిని మినహాయిస్తే, ఆ పార్టీ నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన వారు లేరు. ఇక తిరుపతికి చెందిన భానుప్రకాష్‌రెడ్డి జనంలో కంటే మీడియాలో, అగ్రనేతలు తిరుపతికి వచ్చినప్పుడు వారితోనే ఎక్కువ కనిపిస్తుంటారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తిరుపతికి చెందిన దయాకర్‌రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బీజేపీది ఘోర పరాజయమే. ఈ పరిస్థితిలో కిరణ్ ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకోవడం కూడా కష్టమేనంటున్నారు.
కాగా నల్లారి సేవలను తెలంగాణలో వాడుకుంటారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉండగా, తన వెంట నడిచిన రెడ్డి వర్గ నేతలను, ఆయన ద్వారా బీజేపీలోకి ఆకర్షించవచ్చన్న వ్యూహం ఉందంటున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రం విడిపోకూడదని పోరాడి.. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంట్ లేక అంధకారమవుతుందని, గతంలో కిరణ్ సీఎంగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు వరంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీలో ‘‘మీకు ఐదు పైసలు కూడా ఇవ్వను. దిక్కున్నచోట చెప్పుకో’’మని హరీష్‌రావునుద్దేశించి కిరణ్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు మళ్లీ బీఆర్‌ఎస్ ప్రచారంలోకి తెచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఫలితంగా మళ్లీ ఆంధ్రా కార్డును వాడేందుకు, బీజేపీనే స్వయంగా బీఆర్‌ఎస్‌కు ఒక అస్త్రం ఇస్తుందన్న విశ్లేషణ కూడా, తెలంగాణ బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే మజ్లిస్‌ను ఎదుర్కొన్న మొనగాడిగా కిరణ్‌కు ఉన్న పేరు, గ్రేటర్ హైదరాబాద్‌కు పనికివస్తుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కిరణ్ చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికయినప్పటికీ, పుట్టి పెరిగిందంతా హైదరాబాదే కాబట్టి, ఆయనను తెలంగాణవాడిగానే పరిగణిస్తారన్నది వారి వాదన. అందువల్ల అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి.. బీజేపీలో తన కార్యక్షేత్రం ఏమిటన్నది తేల్చుకోవలసి ఉంది.