తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగమైన కోనసీమ ను ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించినప్పుడు ; సంతోషించని కోనసీమ వాసి కనపడలేదు. అది కోనసీమ వాసులకు ఓ చిరకాల స్వప్నం. గోదావరి పాయ -గౌతమీ పై- యానాం – ఎదుర్లంక బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు కోనసీమ వాసులు జిల్లా కేంద్రమైన కాకినాడకు రాకపోకలు సాగించాలంటే ….రావులపాలెం , మండపేట , రామచంద్రపురం మీదుగా వెళ్లి రావలసి వచ్చేది. మూడు గంటలకు పైబడి రోడ్ ప్రయాణం . అందుకే , కోనసీమను ఒక జిల్లా చేస్తే ; ప్రజలకు గొప్ప సౌకర్యంగా ఉంటుందని కోనసీమ రాజకీయ నాయకులు , ముఖ్యంగా మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ వంటి వారు పదే పదే గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఆ కోరిక తీరకముందే ఆయన పరమపదించారు .
కోనసీమ అనేది ఓ పొదరిల్లు లాంటిది. పచ్చని ప్రకృతితో అలరారే మినీ కేరళ . ఓ పక్క సముద్రం, రెండు పక్కల గోదావరి పాయలు – గౌతమి , వైనతేయ ; నాలుగో పక్క -రావులపాలెం వైపు రోడ్ మార్గం . బయట ప్రపంచంలోకి ఎక్కడకు అడుగు పెట్టాలని అనుకున్నా, రావుల పాలెం మీదుగానే – అమెరికా అయినా , అనకా పల్లి అయినా . ఇప్పుడు ఎదుర్లంక -యానాం బ్రిడ్జి కోనసీమ స్వరూపాన్ని మార్చి వేసింది .
కోనసీమ అంటే కాలువలు …కొబ్బరి చెట్లు …..వాటి మధ్యలో ఇళ్ళు …..పాడి పంటలు .
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ఓ సుపరిచితమైన పేరు ఇది అంటూ -కోనసీమ వాసులకు ఓ ప్రైడ్ . కేరళ తరువాత , వైదిక శాస్త్రాలలో నిష్ణాతులైన బ్రాహ్మణ సంపదకు కోనసీమ పెట్టింది పేరు .
బ్రాహ్మణులు మాత్రమే కాక ;. సంఖ్యాపరంగా దళితులు .. శెట్టి బలిజ , కాపు వర్గాల జనాభాకు కూడా కోనసీమ పెట్టింది పేరు. సామాజిక వర్గాల నుంచి రాష్ట్ర స్థాయి నేతలుగా వెలుగొందిన వారు కూడా ఉన్నారు . అటువంటి కోనసీమ ఇప్పుడు నిప్పుల కొలిమి లా మారిపోయింది .
అగ్గిపుల్ల గీచింది ఎవరైనప్పటికీ ; ఈ మంటలు చల్లారి,సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా సమయం పడుతుంది.అందరూ తలో చెయ్యీ వేయకపోతే ; ‘ఈ భావోద్వేగాలు ‘ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని పలువురు భయ పడుతున్నారు .
బీ ఆర్ అంబేద్కర్ స్మృతికి ….,కోనసీమకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంటుంది. కోనసీమలో రామాలయం లేని గ్రామం ఉన్నదేమో గానీ ; అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు , ప్రతి భారతీయుడూ సొంతం చేసుకోవాల్సినంతగా దేశానికి చిరస్మరణీయమైన సేవలు అందించిన అంబేద్కర్ స్మృతిని కోనసీమలో మాత్రం దళితులే సొంతం చేసుకున్నారని అంటారు. దానితో , అంబేద్కర్ అనే భావనకు దళితేతరులు కొంచెం దూరం జరిగారని పలువురు భావిస్తుంటారు . కోనసీమ జనాభాలో దాదాపు పాతిక శాతం ఉన్న దళితులు ….;స్థానిక రాజకీయ , సామాజిక అంశాలలో తమ గొంతును బలంగా వినిపిస్తుంటారు . కోనసీమ లో ఉన్న ఒక్క ఎంపీ స్థానం, ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉన్న స్థానాలు .
ఇలా … మొత్తం మీద దళితులు -దళితేతర సామాజిక వర్గాల మధ్య ఎప్పుడో మొదలైన మానసిక అంతరం …..సందు దొరికినప్పుడల్లా భగ్గు మంటూ బయట పడుతూనే ఉంటున్నది . ఎవరూ వెనక్కి తగ్గరని చెబుతారు. దానితో,పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసుల తల ప్రాణం తోకలోకి వస్తూనే ఉంటున్నది . -కోనసీమ ప్రాంతమంతా వెలసి ఉన్న అంబేద్కర్ స్మృతి చిహ్నలైన ఆయన విగ్రహాలు – దళితుల -దళితేతర వర్గాల మధ్య వైషమ్యాలకు అనేక సార్లు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
‘అంబేద్కర్’ అంటే – దళిత చిహ్నం అనే భావం కోనసీమలోని దళితేతర వర్గాల లో స్థిరపడి పోయి ఉన్నది.ఈ నేపథ్యంలో కోనసీమకు -‘బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ’ జిల్లా అని ప్రభుత్వం నామకరణం చేయడం తో చిక్కుముడి పడిపోయింది. తమపై దళితులది పైచేయి అయిందనే భావన దళితేతరులలో గుప్పుమన్నది.చాలా సహనం, సంయమనం, విజ్ఞత, సామాజిక స్పృహ తో ఈ చిక్కుముడి ని విడదీయవలసి ఉంది.
లేని పక్షంలో ఈ ‘సమస్య ‘ కోనసీమ దాటి, ఇతర ప్రాంతాలలో సైతం దళిత -దళితేతర వర్గాల మధ్య భావోద్వేగ అంశంగా పరిణమించవచ్చు.
ఏలూరు రేంజ్ డీ ఐ జీ పాలరాజు ఒక మంచి మాట చెప్పారు. మంగళవారం నాటి విధ్వంసంలో బయట ప్రాంతాలవారు లేరని, స్థానికంగానే అప్పటికప్పుడు పెల్లుబికిన ఆవేశంలో నుంచే విధ్వంసం చోటు చేసుకున్నదని ఆయన అన్నారు. అక్కడ నెలకొన్న సమస్య మూలాలు తెలుసుకోడానికి, రాజకీయ నేతలు సంయనం పాటిస్తూ; పాలరాజు ప్రకటనను విశ్లేషిస్తే సరిపోతుంది.